Parcel boxes: పార్శిల్ డబ్బాలు ఎప్పుడూ గోధుమ రంగులోనే ఎందుకుంటాయి?
Parcel boxes: పార్శిల్ డబ్బాలు ఎప్పుడు చూసినా గోధుమ రంగులోనే ఉంటాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నుంచి వచ్చే పార్శిల్ డబ్బాలు గోధుమ రంగులోనే ఎందుకుంటాయి? దానికి కారణం తెలుసుకోండి.

పార్సిల్ బాక్సులు గోధుమ రంగులోనే...
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నుంచి వచ్చే పార్సిల్ బాక్సులు ఎప్పుడూ గోధుమరంగులోనే ఉంటాయి. ఆహారం ఆర్డర్ చేసినప్పుడు వచ్చే పార్శిల్ డబ్బాలు ఎక్కువగా గోధుమ రంగులోనే కనిపిస్తాయి. దీని వెనుక ప్రధాన కారణం కలప సహజ రంగు. సాధారణ కాగితం తయారీలో ఉపయోగించే కలప గుజ్జులో సెల్యులోజ్, లిగ్నిన్ అనే పదార్థాలు ఉంటాయి. కలపకు సహజంగానే గోధుమ రంగు ఉంటుంది. సాధారణంగా పుస్తకాలు లేదా తెల్ల కాగితాల తయారీ కోసం రసాయనాలు, బ్లీచింగ్ పద్ధతులను ఉపయోగించి ఆ రంగును తొలగిస్తారు. కానీ పార్శిల్ బాక్సుల కోసం తయారుచేసే క్రాఫ్ట్ పేపర్ తయారీలో కలప గుజ్జును బ్లీచ్ చేయకుండా సహజ స్థితిలోనే ఉంచుతారు.
బ్లీచ్ చేయని కాగితం
ఇలా బ్లీచ్ చేయని క్రాఫ్ట్ పేపర్ వాడటానికి బలమైన శాస్త్రీయ, ఆర్థిక కారణాలు ఉన్నాయి. బ్లీచింగ్ చేసినప్పుడు కాగితం తెల్లగా మారుతుంది కానీ, అందులోని పీచు పదార్థాలు బలహీనపడతాయి. బ్లీచ్ చేయని సహజ గోధుమ రంగు కాగితం దృఢంగా ఉండి ఎక్కువ బరువును, ఒత్తిడిని తట్టుకోగలదు. డెలివరీ సమయంలో బాక్స్‌లు చిరిగిపోకుండా ఉండటానికి ఈ దృఢత్వం చాలా అవసరం. అదనంగా బ్లీచింగ్ లేదా రంగులు వేయకపోవడం వల్ల తయారీ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. వ్యాపారాలు, రెస్టారెంట్లు తక్కువ ధరకే ప్యాకేజింగ్ డబ్బాలను కొనుగోలు చేయడానికి ఇది దోహదపడుతుంది.
నేలలో త్వరగా కలిసిపోతాయి
ఈ గోధుమరంగు బాక్సులు పర్యావరణ హితం. గోధుమ రంగు బాక్స్‌లలో రసాయనాలు తక్కువగా ఉండటం వల్ల ఇవి నేలలో త్వరగా కలిసిపోతాయి. పునర్వినియోగ కాగితం ద్వారా కూడా కొత్త బాక్స్‌లు తయారుచేసేటప్పుడు తిరిగి గోధుమ రంగులోనే వస్తాయి. రవాణా సమయంలో దుమ్ము, చిన్న మరకలు పడినా ఈ రంగు బాక్స్‌లపై పెద్దగా కనిపించవు. ఈ కారణాల వల్లనే టేక్-అవుట్ ప్యాకేజింగ్‌కు గోధుమ రంగు బాక్స్‌లు ప్రామాణిక ఎంపికగా మారాయి.

