Ravana Lanka: రావణాసురుడికి లంకను బహుమతిగా ఇచ్చింది ఎవరో తెలుసా?
Ravana Lanka: రామాయణంలో రావణాసురుడి లంక చాలా గొప్పగా, సంపదలతో తులతూగేదని అంటారు. అందుకే దాన్ని 'బంగారు లంక' అని కూడా పిలుస్తారు. అసలు ఈ బంగారు లంక రావణుడికి ఎలా దక్కింది? దీన్ని అతనికి బహుమతిగా ఇచ్చింది ఎవరో తెలుసా?

రావణుడి లంక వెనుక కథలు
రామాయాణంలో రావణుడికి, లంకకు ఎంతో ప్రాధాన్యం ఉంది. రావణుడికి లంకను ఎవరు ఇచ్చారు అనే దానిపై కూడా కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. మొదటి కథలో శివపార్వతులు, లంక నిర్మాణం, రావణుడి ఎంట్రీ ఉంటాయి. ఇక రెండో కథలో రావణుడి సవతి సోదరుడు కుబేరుడు, పుష్పక విమానం గురించి చెబుతారు.
ఒకసారి పార్వతీదేవి తనకు నివసించడానికి ఒక గొప్ప భవనం కావాలని శివుడిని అడిగింది. అప్పుడు శివుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మను పిలిచి ఒక అద్భుతమైన భవనాన్ని కట్టమన్నాడు. విశ్వకర్మ సముద్రం మధ్యలో బంగారంతో ఒక అందమైన నగరాన్ని నిర్మించాడు. అదే బంగారు లంకగా ఫేమస్ అయింది.
రావణుడికి లంక ఎలా దక్కింది?
ఈ బంగారు భవనం గృహప్రవేశానికి శివుడు రావణుడిని కూడా పిలిచాడు. రావణుడు గొప్ప పండితుడు, పైగా పరమ శివభక్తుడు. అతడే దగ్గరుండి గృహప్రవేశ పూజలు చేశాడు. ఆ భవనం చూసి మురిసిపోయిన రావణుడు, దక్షిణగా ఆ బంగారు లంకనే అడిగాడు. శివుడు కాదనకుండా ఇచ్చేశాడు. దీంతో కోపానికొచ్చిన పార్వతీదేవి ఆ లంక నాశనమైపోతుందని శపించింది.
కుబేరుడిని ఓడించిన రావణుడు
బంగారు లంక గురించి ఉన్న రెండో కథ కుబేరుడికి సంబంధించింది. విశ్రవసుడి కొడుకైన కుబేరుడు రావణుడికి సవతి సోదరుడు. మొదట ఈ లంకను కుబేరుడే పాలించేవాడు. అతని దగ్గర పుష్పక విమానం కూడా ఉండేది. రావణుడు ఘోర తపస్సు చేసి శక్తులు సంపాదించాడు. ఆ తర్వాత యుద్ధంలో కుబేరుడిని ఓడించి లంకతో పాటు పుష్పక విమానాన్ని కూడా లాక్కున్నాడు.
సుందరకాండలో హనుమంతుడు లంకను చూసి ఆశ్చర్యపోతాడు. అంతటి సంపద ఉన్న లంక, సీతాపహరణం తర్వాత పూర్తిగా నాశనమైంది.








