- Home
- Feature
- Arrested Person Rights : పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే ఏంచేయాలి? ఈ 6 లీగల్ రైట్స్ గురించి తెలుసుకొండి
Arrested Person Rights : పోలీసులు అరెస్ట్ చేయడానికి వస్తే ఏంచేయాలి? ఈ 6 లీగల్ రైట్స్ గురించి తెలుసుకొండి
పోలీసులను చూడగానే చాలామంది భయపడిపోతుంటారు… వారిని ప్రశ్నించేందుకు ధైర్యం చేయరు. అయితే భారత రాజ్యాంగం అరెస్ట్ సమయంలోనూ పౌరులకు కొన్ని లీగల్ రైట్స్ కల్పించింది. వాటిగురించి ఇక్కడ తెలుసుకుందాం.

అరెస్ట్ అయినవారికీ ఈ హక్కులుంటాయి
పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు చాలామంది భయాందోళనకు గురవుతారు. ఏం చేయాలి? ఎవరిని సహాయం అడగాలి? పోలీసులకు ఎలాంటి వివరాలు చెప్పాలి? అనే విషయంలో అయోమయానికి గురవుతుంటారు. అయితే పోలీసులను చూసి కంగారుపడాల్సిన పనిలేదు... అరెస్ట్ చేసే సమయంలోనూ పౌరులకు చట్టం కొన్ని హక్కులను కల్పించింది. అరెస్టుకు గల కారణాలు తెలుసుకోవడం నుంచి న్యాయవాదిని సంప్రదించడం వరకు చాలా హక్కులు ఉంటాయి. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు లేదా అదుపులోకి తీసుకున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు, లీగల్ రైట్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
1. అరెస్టుకు కారణం తెలుసుకోండి
పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నట్లయితే... ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు? అందుకు కారణాలేంటి? అనే విషయాలను స్పష్టంగా అడిగి తెలుసుకోండి. అరెస్టుకు గల కారణాలను మీకుగానీ, మీ కుటుంబసభ్యులకు గానీ తెలియజేయాల్సిన బాధ్యత పోలీసులదే. వారెంట్ అవసరమయ్యే సందర్భంలో దాని గురించి అడిగి తెలుసుకోవచ్చు. అయితే కొన్ని కేసుల్లో చట్టప్రకారం వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసే అధికారం పోలీసులకు ఉంటుంది... కాబట్టి వారెంట్ తప్పనిసరి కాదు.
2. న్యాయవాది సహాయం పొందండి
అరెస్ట్ అయిన వ్యక్తికి తనకు నచ్చిన న్యాయవాదిని సంప్రదించి న్యాయసహాయం పొందే హక్కు ఉంటుంది. కాబట్టి కేసు విషయంలో న్యాయవాదితో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులను కోరవచ్చు. న్యాయవాదిని నియమించుకునే ఆర్థిక స్థోమత లేకపోతే, అర్హతను బట్టి ఉచిత న్యాయసేవల సంస్థల ద్వారా సహాయం పొందవచ్చు. ఇందుకు అవకాశం కల్పించాలని పోలీసులను లేదా మెజిస్ట్రేట్ ను కోరవచ్చు.
3. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వాలి
పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు, ఆ విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు లేదా అతను సూచించిన వ్యక్తికి తప్పకుండా తెలియజేయాలి. ఎవరికి సమాచారం అందించాలనుకుంటున్నారో పోలీసులకు స్పష్టంగా చెప్పండి. అరెస్ట్ వివరాలు కుటుంబ సభ్యులకు తెలియడం వల్ల న్యాయసహాయం పొందడం, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడం సులభమవుతుంది. కేవలం కుటుంబసభ్యులకే కాదు స్నేహితులకు కూడా అరెస్ట్ సమాచారం తెలియజేయాలని కోరవచ్చు.
4. 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచాలి
చట్టప్రకారం అరెస్ట్ చేసిన వ్యక్తిని ప్రయాణ సమయాన్ని మినహాయించి 24 గంటల్లోగా సమీప న్యాయమూర్తి లేదా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అంతకంటే ఎక్కువ సమయం పోలీసుల అదుపులో ఉంచాలంటే చట్టబద్ధమైన న్యాయపరమైన అనుమతి అవసరం. ఈ నిబంధన వ్యక్తులను అక్రమంగా నిర్బంధించకుండా రక్షిస్తుంది.
5. అరెస్ట్ మెమో వివరాలు పరిశీలించండి
అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు మెమో (Arrest Memo) సిద్ధం చేయాలి. అందులో అరెస్ట్ చేసిన తేదీ, సమయం, ఇతర అవసరమైన వివరాలు నమోదు చేయాలి. నిబంధనల ప్రకారం సాక్షి ధ్రువీకరణ, అరెస్ట్ అయిన వ్యక్తి సంతకం వంటి వివరాలు కూడా ఉండాలి. ఈ పత్రంలో పేర్కొన్న వివరాలను జాగ్రత్తగా పరిశీలించండి.
6. వైద్య పరీక్ష కోరవచ్చు
అరెస్ట్ అయిన వ్యక్తికి వైద్య పరీక్ష చేయించుకునే అవకాశం ఉంటుంది. ముందుగానే శరీరంపై గాయాలు ఉన్నా, పోలీసులు లాకప్ లో టార్చర్ చేస్తారనే అనుమానం ఉన్నా వైద్య పరీక్ష కోరండి. పరీక్షలో నమోదైన వివరాలు తర్వాత న్యాయపరమైన విచారణలో ఉపయోగపడవచ్చు. కస్టడీలో గాయాలైతే వాటిని వైద్యుడికి స్పష్టంగా తెలియజేయడం ముఖ్యం.
రాజ్యాంగం కల్పించిన హక్కులు తెలుసుకోండి
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 అరెస్ట్, నిర్బంధానికి సంబంధించి కొన్ని రక్షణలను కల్పిస్తుంది. అలాగే భారత న్యాయ సంహిత (BNSS)లోని సెక్షన్ 38 ప్రకారం, విచారణ సమయంలో అరెస్టయిన వ్యక్తికి తనకు నచ్చిన న్యాయవాదిని కలిసే హక్కు ఉంటుంది. ఈ హక్కులతో పాటు అరెస్టుకు కారణాలు తెలుసుకోవడం, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడం వంటి చట్టపరమైన రక్షణల గురించి అవగాహన కలిగి ఉండాలి.
ముఖ్య గమనిక : అరెస్ట్కు సంబంధించిన నిబంధనలు కేసు స్వభావం, అరెస్ట్ చేసే పరిస్థితులను బట్టి మారవచ్చు. కాబట్టి అరెస్ట్ అయినప్పుడు వీలైనంత త్వరగా న్యాయవాదిని సంప్రదించి న్యాయసహాయం పొందండి.

