Legal Advice: పరువు నష్టం దావా అంటే ఏమిటి? ఇది ఎవరి మీద వేయవచ్చు?
పరువు నష్టం దావా (Defamation) గురించి ఎంతోమంది వినే ఉంటారు. కానీ సాధారణ ప్రజలకు దాని గురించి అవగాహన చాలా తక్కువ. పరువు నష్టం అంటే ఏమిటి? ఎవరిమీద ఈ దావా వేయవచ్చు. దాని పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోండి.

పరువు నష్టం అంటే?
పరువు నష్టం అంటే ఒకరి ప్రతిష్టకు, పేరుకు హాని కలిగించే విధంగా ప్రకటనలు చేయడం . ఒక వ్యక్తి పరువుకు, ప్రతిష్టకు తమ మాటల ద్వారా, చేష్టల ద్వారా లేదా రాతల ద్వారా భంగం కలిగిస్తే... ఇబ్బంది పెడితే వారిపై పరువు నష్టం దావా వేయవచ్చు. భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 356 పరువు నష్టం దావాకు సంబంధించినది. పరువు నష్టం చేయడం అనేది నేరం కిందే పరిగణిస్తారు. ఉద్దేశపూర్వకంగా వేరొకరి పరువుకు లేదా మర్యాదకు భంగం కలిగించడం నేరంగానే చెబుతారు. ఆ వ్యక్తి మిమ్మల్ని ఎలా అవమానపరిచినా కూడా పరువు నష్టం దావా వేయవచ్చు.
నియమాలు ఏమిటి?
అప్రస్తుతం ఉన్న నిబంధనల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఏది పరువు నష్టం కిందకి వస్తుందో ప్రజలకు అవగాహన లేదు. ఒక వ్యక్తి పై దురుద్దేశంగా తప్పుడు వార్తలు ప్రచురించడం, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం వంటివన్నీ కూడా పరువు నష్టం కిందకే వస్తాయి. అలా మీ విషయంలో ఎవరు ప్రవర్తించిన వారిపైనా మీరు దావా వేయవచ్చు. పరువు నష్టం దావా వేస్తే దానికి తగ్గ రుజువులు కూడా చూపించాలి. ఎక్కువగా పరువు నష్టం దావా అనేది పత్రికలు, మీడియాపై ఇతరులు వేస్తూ ఉంటారు.
శిక్ష ఏమిటి?
ఎవరైనా ఒక రాజకీయ నాయకుడి పనితీరు గురించి మాట్లాడే హక్కు సమాజంలో అందరికీ ఉంటుంది. అయితే అది అతని పరువుకు నష్టం కలగకుండా ఉండాలి. అలాగే గురువు తన శిష్యుణ్ణి దండించినా, తిట్టినా అది పరువు నష్టం కిందకు రాదు. అలాగే యజమాని తన ఉద్యోగిని మంచి ఉద్దేశంతో దండించినా కూడా అది నేరం కాదు. కొంతమంది వీటిని కూడా పరువు నష్టం కింద భావించి దావా వేస్తూ ఉంటారు. ఇలాంటివి కోర్టుల్లో నిలబడవు. పరువు నష్టం... దీన్నే క్రిమినల్ డిఫమేషన్ అంటారు. ఈ కేసులోగాని నేరం రుజువైతే అది తక్కువగా రెండు సంవత్సరాల సాధారణ జైలు జీవితం గడపాల్సి వస్తుంది. అలాగే జరిమానాలను కూడా కట్టాల్సి వస్తుంది. దానితో పాటు కొన్ని సామాజిక సేవా కార్యాక్రమాల్లో పాల్గొనమని కూడా జడ్జి తీర్పు ఇస్తారు.
పరువు నష్టం దావా ఎవరు వేయవచ్చు?
తప్పుడు ప్రకటన వల్ల తమ ప్రతిష్ట దెబ్బతిందని భావించే ప్రతి ఒక్కరూ కూడా ఈ పరువు నష్టం దావాను వేయవచ్చు. అయితే ఈ పరువు నష్టం కేసులు కాస్త భిన్నంగా ఉంటాయి. దావా వేసే వ్యక్తి ఆధారంగా ఇవి భిన్నంగా కోర్టులు పరిగణిస్తాయి. పరువు నష్టం దావా కేసుల్లో గెలవాలంటే ప్రతిదానికి నిరూపణలు చాలా ముఖ్యం. నోటితో చెప్పినంత మాత్రాన కోర్టులు నమ్మవు.. ప్రతీది ఆధారాలతో నిరూపించాలి.
యూట్యూబ్ ఛానెళ్లపైనా
ఇప్పుడు ఎక్కువగా పరువు నష్టం కేసులు మీడియా సంస్థలపైనే పడుతున్నాయి. అలాగే యూట్యూబ్ కూడా అధికంగా ఉండడంతో యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్న కొందరిపై కూడా ఈ కేసులు వేసే ప్రైవేటు వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. ఇక ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో కూడా ఇతరులను విమర్శించడం, వారిని తప్పు పట్టడం అనేది అధికంగా జరుగుతోంది. కాబట్టి వీటి ఆధారంగా కూడా పరువు నష్టం కేసులు వేస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంది.