Fact Check: విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్‌టాప్ ఇస్తోందా.?
ఎంత అవగాహన పెరుగుతోన్నా మీడియా, సోషల్ మీడియా ద్వారా ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ నేరాలు మాత్రం రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రకరకాల మార్గాల్లో బురిడి కొట్టిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఉచితంగా ల్యాప్‌టాప్ అంటూ మెసేజ్
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తోందని పేర్కొంటూ ఒక సందేశం వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతోంది. విద్యార్థులను ఆకర్షించేందుకు, లింక్ క్లిక్ చేయాలని కోరుతూ ఈ సందేశాలు వస్తున్నాయి. పొరపాటున ఇది నిజం అని క్లిక్ చేశారో మీ పని అంతే.
స్పందించిన కేంద్ర ప్రభుత్వం
ఈ సందేశాల వెనుక ఉన్న అసలైన ఉద్దేశం ఏమిటంటే.. ఆ లింక్‌లపై క్లిక్ చేయించి వ్యక్తిగత సమాచారం దొంగిలించడం, బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేయడం. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పష్టంగా చెప్పింది “ఇది ఫేక్ న్యూస్. ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం లేదు.” కేంద్రం ఎక్స్ (మాజీ ట్విట్టర్) వేదికగా దీనిపై అవగాహన కల్పించింది.
Free Laptops Anyone⁉️
A message is being circulated on WhatsApp with a link claiming that the central government is providing free laptops to students. #PIBFactCheck
❌This message is #fake and the URL is fraudulent.
🚫 Do NOT click on suspicious links.
▶️Always VERIFY… pic.twitter.com/nfXNYSrFlV— PIB Fact Check (@PIBFactCheck) June 29, 2025
గుడ్డిగా నమ్మకూడదు
ప్రజలు ఎప్పుడైనా ఇలాంటి ఆఫర్లపై విశ్వసించకూడదని, అధికారిక వెబ్‌సైట్‌లు లేదా న్యూస్ చానళ్ల ద్వారా సమాచారం పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం సూచిస్తోంది. నిజంగా కేంద్రం ఏదైనా పథకం ప్రవేశపెడితే, దానికి సంబంధించిన వివరాలు https://pib.gov.in లేదా respective govt portals లోనే ఉంటాయి. వాటిని తప్ప మరే ఇతర లింక్‌లను నమ్మకూడదు.
విద్యార్థులే లక్ష్యంగా
సైబర్ నేరస్థులు ఈసారి విద్యార్థులను టార్గెట్ చేశారు. “డిజిటల్ విద్యను ప్రోత్సహించేందుకు ఉచిత ల్యాప్‌టాప్‌లు అందిస్తున్నాం” అంటూ ఆకట్టుకునే మెసేజ్ చేశారు. ఇందుకోసం వివరాలను ఎంటర్ చేయాలని పేర్కొంటూ ఓ లింక్‌ను పంపిస్తున్నారు.
ఒకవేళ ఎవరైనా ఆ లింక్‌పై క్లిక్ చేస్తే, వారి ఫోన్‌లో ఉన్న డేటా హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకు OTPలతో సహా ఇతర ప్రైవేట్ వివరాలు లీక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఇలాంటి సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే కచ్చితంగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లో గుర్తు తెలియని లింక్‌లపై క్లిక్ చేయకూడదు. ఫేక్ ఆఫర్లను ఫార్వర్డ్ చేయకూడదు.
సమాచారాన్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ లేదా అధికారిక వేదికల ద్వారా ధృవీకరించుకోవాలి. అనుమానాస్పద సందేశాల విషయమై వెంటనే cybercrime.gov.in లేదా పోలీసులను సంప్రదించాలి.