Andhra Pradesh: ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం.. తెలంగాణ కంటే భిన్నంగా
ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్కో హామీలను సాకారం చేసే దిశగా కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగానే తాజాగా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
- FB
- TW
- Linkdin
Follow Us

ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం దృష్టి
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సమీక్ష నిర్వహించారు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ విధానం అమలవుతుండగా... ఆంధ్రప్రదేశ్ తమ పథకాన్ని అత్యుత్తమంగా అమలు చేయాలన్న లక్ష్యంతో సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవడమే ముఖ్యమని స్పష్టం చేశారు.
ఎప్పటి నుంచి ప్రారంభం కానుందంటే.
ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. కాగా ఉచిత ప్రయాణ పథకం అమలుతో మహిళల రాకపోకలు భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఈ పెరుగుదలకు అనుగుణంగా రాష్ట్రంలో అదనంగా 2,536 బస్సులు అవసరమవుతాయని అంచనా.
వీటిని కొనుగోలు చేయడమో, అద్దెకు తీసుకోవడమో వంటి ప్రత్యామ్నాయాలపై చర్చ జరిగింది. ముఖ్యంగా విద్యుత్ బస్సులను ప్రాధాన్యంగా కొనుగోలు చేయాలని, ఇప్పుడున్న డీజిల్ బస్సులను ఈవీకి మార్చే అవకాశాలను పరిశీలించాలన్నారు.
ఆర్టీసీకి ఆదాయ మార్గాల అన్వేషణ
ఆర్థికంగా బలపడాలంటే ఆర్టీసీకి కొత్త ఆదాయ మార్గాలను సృష్టించాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. బ్యాటరీ స్వాపింగ్, సీఎన్జీ, విద్యుత్ బస్సుల నిర్వహణ ఖర్చులను తక్కువ చేయడానికి ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో సేవలు అందించాలన్న అంశాన్ని అధ్యయనం చేయాలని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తిని ఆర్టీసీ స్వయంగా నిర్వహిస్తే, బస్సుల నిర్వహణ ఖర్చు తగ్గే అవకాశాలపై కూడా దృష్టిపెట్టాలని సూచించారు.
ప్రయాణికులకు మెరుగైన వాతావరణం
బస్టాండ్లలో తాగునీరు, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు మెరుగుపర్చాలని సీఎం ఆదేశించారు. బస్సు ప్రయాణం ప్రారంభం నుంచి చివరి వరకు మహిళలకు సౌకర్యవంతమైన అనుభవం కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే సమాచార బోర్డులు, శుభ్రత, భద్రత వంటి అంశాల్లో నూతన ప్రమాణాలు ఏర్పరచాలని అధికారులను ఆదేశించారు.
ఏటా 88.90 కోట్ల మహిళల ప్రయాణాలు
రాష్ట్రంలో ప్రస్తుతం 2.62 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వీరిలో సాధారణ బస్సుల ద్వారా ఏడాదిలో 43 కోట్ల ప్రయాణాలు జరుగుతున్నాయి. ఉచిత ప్రయాణ పథకం అమలుతో ఇది 88.90 కోట్లకు పెరిగే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ప్రతి మహిళ వారానికి కనీసం ఒక్కసారైనా ప్రయాణించనుంది. ఈ మొత్తం ప్రయాణ వ్యయానికి ఏడాదికి సుమారు రూ.996 కోట్లు ఖర్చవుతుందని అధికారులు పేర్కొన్నారు.