- Home
- Entertainment
- కన్నప్ప మూవీపై మంచు మనోజ్ రివ్యూ.. నేను అనుకున్నదానికంటే 1000 రెట్లు బావుంది, కలలో కూడా అనుకోలేదు
కన్నప్ప మూవీపై మంచు మనోజ్ రివ్యూ.. నేను అనుకున్నదానికంటే 1000 రెట్లు బావుంది, కలలో కూడా అనుకోలేదు
తన కుటుంబంతో విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి మంచు మనోజ్ కన్నప్ప చిత్రాన్ని థియేటర్లలో తొలి షో వీక్షించారు. సినిమా చూసిన అనంతరం మంచు మనోజ్ కన్నప్ప మూవీ పై ప్రశంసలు కురిపించారు.

మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం నేడు శుక్రవారం రోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. ఈ మూవీలో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభుదేవా, ప్రభాస్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రీతి ముకుందన్ నటించారు. మంచు విష్ణు తన కలల ప్రాజెక్టు కోసం ఎంతో శ్రమించారు. తన మార్కెట్ కి మించి ఈ చిత్రానికి భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
థియేటర్లలోకి వచ్చిన కన్నప్ప చిత్రానికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫస్టాఫ్ యావరేజ్ గా ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉందని ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ భక్తి రస చిత్రాన్ని ధూర్జటి రచించిన శ్రీకాళహస్తి మహత్యం ఆధారంగా రూపొందించారు. తన కుటుంబంతో విభేదాలు ఉన్నప్పటికీ వాటిని పక్కనపెట్టి మంచు మనోజ్ కన్నప్ప చిత్రాన్ని థియేటర్లలో తొలి షో వీక్షించారు.
సినిమా చూసిన అనంతరం మంచు మనోజ్ కన్నప్ప మూవీ పై ప్రశంసలు కురిపించారు. మంచు మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. కన్నప్ప మూవీ చూశాను.. చాలా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. క్లైమాక్స్ లో ఇంత గొప్పగా నటిస్తారని నేను కలలో కూడా అనుకోలేదు అంటూ పరోక్షంగా తన సోదరుడు మంచు విష్ణు గురించి తెలిపారు. నేను అనుకున్న దానికంటే సినిమా వెయ్యిరెట్లు బాగుంది అని మంచు మనోజ్ తెలిపారు. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్.
మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందని ఆశిస్తున్నా. మీరు పెట్టిన డబ్బు వెయ్యింతలు తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు మనోజ్ తెలిపారు. సినిమా తొలి 5 నిమిషాలు మిస్ అయ్యానని దానికోసం రేపు మళ్లీ వచ్చి చూస్తానని మనోజ్ సరదాగా అన్నారు.
ఇటీవల మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య తీవ్ర విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకున్నారు. ఆస్తి విషయంలో గొడవలైనట్ల వార్తలు వచ్చాయి. మంచు మనోజ్ కూడా పలు సందర్భాల్లో మంచు విష్ణు పై ఆరోపణలు చేశారు. కన్నప్ప మూవీ చూసిన తర్వాత కూడా మంచు మనోజ్ తన సోదరుడు విష్ణు గురించి ఒక్క కామెంట్ కూడా చేయలేదు. క్లైమాక్స్ లో అద్భుతంగా నటించారు అని పరోక్షంగా మాత్రమే ప్రస్తావించారు.

