- Home
- Entertainment
- రూ.50 వేలకు కక్కుర్తిపడి రూ.5 కోట్లు పోగొట్టుకున్న చంద్రమోహన్.. నా తలరాత అంతే, బోరుమన్న సీనియర్ నటుడు
రూ.50 వేలకు కక్కుర్తిపడి రూ.5 కోట్లు పోగొట్టుకున్న చంద్రమోహన్.. నా తలరాత అంతే, బోరుమన్న సీనియర్ నటుడు
కళాతపస్వి కె విశ్వనాథ్ తెరకెక్కించిన ఆల్ టైం క్లాసిక్ చిత్రం శంకరాభరణం 1980లో విడుదలైంది. ఈ చిత్ర విశేషాలు చెబుతూ ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

శంకరాభరణం మూవీపై చంద్రమోహన్ కామెంట్స్
సీనియర్ నటుడు చంద్రమోహన్ తెలుగులో కొన్ని వందల చిత్రాల్లో నటించారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక విజయవంతమైన చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. 50 ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో కొనసాగారు. బి.ఎన్ రెడ్డి దర్శకత్వంలో చంద్రమోహన్ రంగులరాట్నం అనే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీ సంచలన విజయం సాధించింది.
కళాతపస్వి కె విశ్వనాథ్ తెరకెక్కించిన ఆల్ టైం క్లాసిక్ చిత్రం శంకరాభరణం 1980లో విడుదలైంది. టాలీవుడ్ గొప్ప చిత్రాలలో ఈ మూవీ కూడా ఒకటిని చెబుతుంటారు. ఈ చిత్రంలో సోమయాజులు, మంజుభార్గవి, చంద్రమోహన్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్ర విశేషాలు చెబుతూ ఓ ఇంటర్వ్యూలో చంద్రమోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శంకరాభరణం చిత్రం అఖండ విజయం సాధించినప్పటికీ ఆ మూవీ వల్ల తనకి ఒక దురదృష్టకర సంఘటన జరిగిందని చంద్రమోహన్ తెలిపారు.
ఈ చిత్రాన్ని ఎవరూ కొనలేదు
ఈ చిత్రానికి కే విశ్వనాధ్ దర్శకత్వం వహించగా, ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు. చంద్రమోహన్ మాట్లాడుతూ..శంకరాభరణం చిత్రం షూటింగ్ పూర్తయ్యాక కొన్ని రోజులు రిలీజ్ ఆలస్యమైంది. ఎందుకంటే ఈ చిత్రాన్ని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లని అడిగితే.. ఆ సినిమాలో తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారండి చంద్రమోహన్ తప్ప ఇంకెవరూ లేరు అని అనేవారు.
ఈ చిత్ర థియేటర్ హక్కులు కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు..సినిమాకి బజ్ పెరగడం లేదు. దీంతో నిర్మాత దాదాపు 50 ప్రీమియర్ షోలు వేశారు. చూసిన సెలబ్రిటీలంతా కన్నీళ్లు పెట్టుకుంటూ సినిమా అద్భుతంగా ఉందంటున్నారు కానీ కొనడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ చిత్రానికి బిజినెస్ జరగడంలేదని నిర్మాత ఏడిద నాగేశ్వరరావు లబోదిబోమంటున్నారు. తమిళనాడు హక్కులు ఎవరూ కొనడం లేదని నిర్మాత చాలా తక్కువ ధర చెప్పారట. ఒకటిన్నర లక్షలకు ఇచ్చేస్తాను ఎవరైనా కొనండి అని అడిగారట. అయినా కూడా ఎవరూ కొనడానికి ముందుకు రాలేదు.
రూ.50 వేలు ఎగ్గొట్టడానికి ప్లాన్ ?
చివరికి ఆయన తనకి ఆఫర్ ఇచ్చారని చంద్రమోహన్ అన్నారు. ఈ సినిమాని ఎవరూ కొనడం లేదయ్యా చంద్రమోహన్.. నీకు నేను ఎలాగో రూ.50 వేలు ఇవ్వాలి కదా.. ఆ డబ్బుకి తమిళనాడు హక్కులు నువ్వే తీసేసుకో అని చెప్పారట. ఒకటిన్నర లక్షకి చెప్పినా ఎవరూ కొనడం లేదు.. నువ్వు కాబట్టి 50,000కి ఇచ్చేస్తాను అని అన్నారట. చంద్రమోహన్ వెంటనే ఏంటి నా 50 వేలు ఎగ్గొట్టడానికి ప్లానింగా ? .. ఈ సినిమాని నేను కొనను. నాకు ఇవ్వాల్సిన 50,000 ఇచ్చేసేయ్ అని అన్నారట.
సినిమా పూర్తయ్యాక కూడా థియేటర్ నుంచి కదలని ఆడియన్స్
చివరికి చెన్నైలో సీనియర్ నటి మనోరమ కి చెందిన థియేటర్ లో ప్రీమియర్ షో ప్రదర్శించారు. నటి మనోరమ తెలుగులో అరుంధతి, సింహరాశి లాంటి ఎన్నో చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆమెకి చెందిన థియేటర్లో శంకరాభరణం ప్రీమియర్ షో ప్రదర్శించడంతో చూడ్డానికి ఆమె కూడా వచ్చారు. క్లైమాక్స్ పూర్తి అయిన తర్వాత కూడా సీట్లలో నుంచి ఎవరు పైకి లేవడం లేదు. లైట్లు ఆన్ చేస్తే అందరి కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి. అలాగే చూస్తూ ఉండి పోతున్నారు. సినిమా అయిపోయింది పైకి లేవండి అని చెప్పినా ఎవరూ వినిపించుకోవడం లేదు అని చంద్రమోహన్ అన్నారు.
రూ.1.5 లక్షలకు తమిళనాడు హక్కులు కొనుగోలు చేసిన సీనియర్ నటి
నటి మనోరమైతే క్లైమాక్స్ చూసి బోరున ఏడ్చేస్తూ వచ్చి కె విశ్వనాథ్ కాళ్ల మీద పడ్డారు. ఎంత అద్భుతమైన సినిమా తీశారు సార్ అంటూ కె విశ్వనాధ్ ని పట్టుకుని ఏడ్చేసిందట. కానీ పక్కనున్న వాళ్లు ఎవరో.. అందరూ సినిమా బావుంది అంటున్నారు కానీ ఎవరూ కొనడం లేదు. తమిళనాడు హక్కులు కూడా ఎవరూ కొనలేదు అని అన్నారట. వెంటనే మనోరమ ఇంకా ఎవరు కొనలేదా.. నేను కొంటాను నాకు ఇవ్వండి అని అడిగారట. బేరాలు వద్దు ఒక అమౌంట్ చెప్పండి వెంటనే కొనేస్తాను అని ఆమె అన్నారు. ఏడిద నాగేశ్వరరావు 1.5 లక్షలు చెప్పారు. వెంటనే ఆమె డబ్బు కట్టి శంకరాభరణం తమిళనాడు హక్కులు మొత్తం తీసుకున్నారు.
జాక్ పాట్ కొట్టిన మనోరమ, బోరుమన్న చంద్రమోహన్
ఆమె ఒకటిన్నర లక్షలకు శంకరాభరణం హక్కులు కొంటే ఆ చిత్రం ఏకంగా రూ.5.5 కోట్లు వసూలు చేసింది. ఇది కేవలం తమిళనాడులో మాత్రమే. అది నాకు వచ్చిన అవకాశం.. కానీ 50 వేల కక్కుర్తిపడి చేజార్చుకున్నాను.. నా తలరాత అంతే అంటూ చంద్రమోహన్ లబోదిబోమన్నారు. మొదటి వారం రోజులు సినిమా చాలా స్లోగా వెళ్ళింది. రెండో వారం నుంచి తమిళనాడులో, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో టికెట్లు దొరకడం కష్టం అయిపోయింది. ఈ చిత్రం చూసేందుకు జనాలు థియేటర్లకి క్యూ కట్టారు. అప్పట్లో గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏదైనా పని జరగాలంటే శంకరాభరణం సినిమా టికెట్లను లంచంగా అడిగే వారిని చంద్రమోహన్ గుర్తు చేసుకున్నారు.