- Home
- Sports
- Cricket
- Vaibhav Suryavanshi: వైభవ్ ఆటకు ప్రపంచమే ఫిదా.. పాకిస్థానీ ఆటగాళ్లు సైతం ప్రశంసలు
Vaibhav Suryavanshi: వైభవ్ ఆటకు ప్రపంచమే ఫిదా.. పాకిస్థానీ ఆటగాళ్లు సైతం ప్రశంసలు
Vaibhav Suryavanshi: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో వైభవ్ పై ఇండియన్ ఆటగాళ్లతో పాటు పాకిస్థానీ ప్లేయర్స్ సైతం ప్రశంసల కురిపిస్తున్నారు.

52 బంతుల్లోనే డబుల్ సెంచరీ.. రికార్డుల మోత
యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో 28 సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు. అతడి పరుగుల్లో ఎక్కువ భాగం బౌండరీల రూపంలోనే వచ్చాయి. అంతకుముందు లిస్ట్-ఏ క్రికెట్లో 103 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన చాడ్ బోవెస్ పేరిట ఉన్న రికార్డును వైభవ్ అధిగమించాడు.
అలాగే కేవలం 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగంగా వంద పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు 29 బంతుల్లో సెంచరీ చేసిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ పేరిట ఉండేది. 40 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసి మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
టీమ్ మొత్తానికి సాధ్యం కాని పని ఒక్కడే చేశాడు: బాసిత్ అలీ
వైభవ్ బ్యాటింగ్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రశంసలు కురిపించాడు. యూఏఈ 249 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ, వైభవ్ బ్యాటింగ్ ముందు ఆ జట్టు నిలవలేకపోయిందని వ్యాఖ్యానించాడు. తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. ఒక జట్టు మొత్తం ఎన్ని సిక్సర్లు కొట్టినా వైభవ్ ఒక్కడే అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదాడని పేర్కొన్నాడు. ప్రతి ఓవర్లోనూ మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు లేదా వరుస బౌండరీలతో ప్రత్యర్థి బౌలర్లను ఇబ్బంది పెట్టాడని చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలో చాలా జట్లు కూడా ఒకే మ్యాచ్‌లో ఇన్ని సిక్సర్లు కొట్టలేవని, కానీ వైభవ్ ఒక్కరోజులోనే ఆ ఘనత సాధించాడని కొనియాడాడు. అతడు కేవలం 8 పరుగులే రన్నింగ్ ద్వారా సాధించాడని, దాదాపు 196 పరుగులు బౌండరీల ద్వారానే సాధించాడని చెప్పుచొచ్చాడు.
అసాధారణ ప్రతిభ.. రికార్డును అతడే బద్దలు కొట్టగలడు
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ వసీం కూడా వైభవ్ ఆటను ప్రశంసించాడు. వైభవ్ నెలకొల్పిన రికార్డును మరొకరు బద్దలు కొట్టడం కష్టమని, బహుశా అతడే భవిష్యత్తులో తన రికార్డును అధిగమించవచ్చని అభిప్రాయపడ్డాడు. మరో మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ మాట్లాడుతూ.. 15 ఏళ్ల బాలుడి నుంచి ఇలాంటి బ్యాటింగ్ ఊహించలేమని, అతడిలో అసాధారణ ప్రతిభ ఉందని పేర్కొన్నాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో ఇలాగే సిక్సర్లు కొట్టడం అంత సులభం కాదని అభిప్రాయపడ్డాడు. వైభవ్ తన బ్యాటింగ్‌లో బలహీనంగా ఉన్న ప్రాంతాలపై కూడా దృష్టి పెట్టాలని సూచించాడు. ముఖ్యంగా కవర్స్ వైపు షాట్లు ఆడటంలో మరింత మెరుగుపడాలని చెప్పాడు. అందుకే భారత జట్టు అతడికి ఇప్పుడే ఎక్కువ ఒత్తిడి ఇవ్వకుండా పర్యటనల్లో అవకాశం కల్పిస్తూ అనుభవం అందిస్తోందని వివరించాడు.
పాక్ క్రికెట్‌పై విమర్శలు
వైభవ్ ఆటను ప్రశంసిస్తూనే తన్వీర్ అహ్మద్ పాకిస్థాన్ క్రికెట్ వ్యవస్థపై విమర్శలు చేశాడు. ఇలాంటి ప్రతిభ ఉన్న ఆటగాడు పాకిస్థాన్‌లో ఉంటే టీ20, వన్డే, టెస్టు జట్లలో ఆడించడంతో పాటు కెప్టెన్‌ను కూడా చేసేవారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. మరో మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ కూడా ఇదే అంశంపై స్పందించాడు. 25-30 ఏళ్ల వయసులో సాధించే పేరు, గుర్తింపు వైభవ్‌కు కేవలం 15 ఏళ్లకే వచ్చాయని చెప్పాడు. అతడి ఆటలో పరిపక్వత కనిపిస్తోందని ప్రశంసించాడు. పాకిస్థాన్‌లో ఇలాంటి ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లను ముందుకు తీసుకురావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. యువ ఆటగాళ్లకు వారి వయసుకు తగిన స్థాయిలో అవకాశాలు కల్పించాలని, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డాడు. వైభవ్‌కు లభిస్తున్న అవకాశాలు, అతడి ఆటతీరును చూసి పాకిస్థాన్ క్రికెట్ కూడా నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయని పేర్కొన్నాడు.
వైభవ్ ఖాతాలో ఉన్న కీలక రికార్డులివే
యూఏఈతో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సాధించిన ఘనతలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే పలు రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్నాడు.
వేగవంతమైన అర్ధ సెంచరీ: జూన్ 21న శ్రీలంక ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. గతంలో ఈ రికార్డు 12 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన కే. వీరరత్నే పేరిట ఉండేది.
వేగవంతమైన సెంచరీ: నవంబర్ 24న కేవలం 28 బంతుల్లోనే శతకం పూర్తి చేశాడు. గతంలో జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ 29 బంతుల్లో ఈ ఘనత సాధించాడు.
వేగవంతమైన 150 పరుగులు: 40 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేశాడు. అంతకుముందు 59 బంతుల్లో 150 పరుగులు చేసిన రికార్డు కూడా వైభవ్ పేరిటే ఉంది.
వేగవంతమైన డబుల్ సెంచరీ: కేవలం 52 బంతుల్లోనే 200 పరుగులు సాధించి లిస్ట్-ఏ క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు.
వీటితో పాటు లిస్ట్-ఏ, టీ20 క్రికెట్లో అతి తక్కువ వయసులో సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా వైభవ్ రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్లో కెప్టెన్సీ చేసిన అతి పిన్న వయస్కుడిగానూ గుర్తింపు పొందాడు. చిన్న వయసులోనే ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్ర వేస్తున్న వైభవ్ భవిష్యత్తులో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.















