- Home
- Sports
- Cricket
- IND vs ENG: భారత్‌కు బిగ్ షాక్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి నితీశ్ కుమార్ రెడ్డి ఎందుకు అవుట్ అయ్యారు?
IND vs ENG: భారత్‌కు బిగ్ షాక్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి నితీశ్ కుమార్ రెడ్డి ఎందుకు అవుట్ అయ్యారు?
IND vs ENG: భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య నాల్గో టెస్టు మ్యాచ్ మాంచెస్టర్ లో జరగనుంది. టీమిండియాకు కీలకమైన ఈ మ్యాచ్ కు యంగ్ ప్లేయర్లు నితీష్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్ లు దూరం అయ్యారు.

భారత్ - ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కు నితీష్ కుమార్ దూరం
భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే 2-1తో వెనుకబడింది భారత్.. నాల్గో టెస్టులో గెలిచి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది.
ఇలాంటి కీలక సమయంలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. యంగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఈ సిరీస్ నుంచి అవుట్ అయ్యాడు. మిగిలిన టెస్టులకు అతను అందుబాటులో ఉండరని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం వెల్లడించింది.
గాయంతో టెస్టు సిరీస్ కు దూరమైన నితీష్ కుమార్ రెడ్డి
గాయం కారణంగానే ఈ టెస్టు సిరీస్ కు నితీస్ కుమార్ రెడ్డి దూరం అయ్యారని బీసీసీఐ తెలిపింది. ఆదివారం ఉదయం జిమ్ సెషన్ సందర్భంగా నితీస్ కు రెడ్డి తన ఎడమ మోకాలు నొప్పితో బాధపడుతున్నట్టు ఫిజియోలజిస్ట్‌కి తెలిపాడు. తర్వాతి స్కానింగ్‌లో లిగమెంట్ దెబ్బ తినినట్టు తేలింది. దీని ప్రభావంతో అతను జులై 23 నుంచి ప్రారంభమయ్యే మాంచెస్టర్ టెస్ట్‌కు దూరంగా ఉంటాడు. అలాగే, గాయం త్వరగా తగ్గే అవకాశం లేదు కాబట్టి పూర్తిగా ఈ టూర్ కు దూరం అయ్యాడు.
భారత బౌలింగ్ విభాగంలో గాయాల సమస్యలు
ఇప్పటికే టెస్టు సిరీస్‌లో పేస్ బౌలింగ్ విభాగంలో గాయాల ముప్పు తీవ్రంగా ఉంది. ఆకాశ్ దీప్ గ్రోయిన్ ఇంజరీతో మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశముంది. అలాగే, ఇంకా అరంగేట్రం చేయని యంగ్ పేసర్ అర్షదీప్ సింగ్ నెట్ ప్రాక్టీస్ సమయంలో ఎడమ బొటనవేలుకు గాయం అయింది. దీంతో అతను కనీసం 10 రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ పేర్కొంది. అంటే ఐదవ టెస్టు (ఓవల్) కూడా అర్షదీప్ సింగ్ మిస్సయ్యే అవకాశముంది.
భారత జట్టులోకి అంశుల్ కాంబోజ్
కీలక ప్లేయర్లు దూరం కావడంతో వారి స్థానంలో అంశుల్ కంబోజ్ ను బీసీసీఐ జట్టులోకి తీసుకువచ్చింది. హర్యానాకు చెందిన ఈ రైట్ ఆర్మ్ పేసర్, ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన అన్‌ఆఫీషియల్ టెస్టుల్లో భారత్ ఏ తరఫున ఆడాడు. ఒక మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడంతో పాటు, 51 పరుగులతో అజేయంగా నిలిచి తన ఆల్ రౌండ్ ప్రతిభను చూపించాడు.
అలాగే, శార్దుల్ ఠాకూర్ ను తిరిగి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిరీస్ తొలి టెస్టులో ఆడిన అతను తర్వాత రెండు మ్యాచ్‌ల్లో చోటు కోల్పోయాడు. కానీ నితీష్ కుమార్ రెడ్డి గైర్హాజరుతో పేస్ ఆల్‌రౌండర్ అవసరం దృష్ట్యా అతనికి తిరిగి అవకాశం దక్కే సూచనలు ఉన్నాయి.
కుల్దీప్ యాదవ్ కు ఛాన్స్ దక్కేనా?
కుల్దీప్ యాదవ్‌కు సిరీస్‌లో నాల్గో టెస్టుతో తొలి అవకాశం లభించవచ్చు. బౌలింగ్ పరంగా అతను ఇంగ్లాండ్ పై గతంలో అద్భుత ప్రదర్శనలు చేశాడు. గత సంవత్సరం అతను ఇంగ్లాండ్ ను 20.15 సగటు, 19 వికెట్లతో దెబ్బతీశాడు. ఈసారి కూడా అతని సేవలను వినియోగించుకోవాలని భారత్ యోచిస్తోంది.
లార్డ్స్ టెస్టులో వాషింగ్టన్ సుందర్‌కు చోటిచ్చిన భారత జట్టు, మాంచెస్టర్ టెస్ట్‌లో ముగ్గురు స్పిన్నర్లు... రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ లతో బరిలోకి దిగే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది. పిచ్‌లు పేస్ బౌలింగ్ కు అనుకూలంగా కనిపించకపోవడంతో స్పిన్ తో అటాక్ చేయాలనే వ్యూహాలు రచిస్తోంది.
స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా పంత్.. కీపింగ్ కు ధ్రువ్ జురేల్
రిషభ్ పంత్ ఎడమ చేతి వేళ్లకు గాయం కావడంతో ధ్రువ్ జురేల్ కీపింగ్ బాధ్యతలు చేపడతాడు. పంత్ బ్యాటింగ్‌కి మాత్రం అందుబాటులో ఉంటాడు. అతని ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుని, అతనికి ఛాన్స్ ఇవ్వడం తప్పనిసరిగా మారింది.
అయితే ధ్రువ్ జురేల్ ను ఎవరి స్థానలో తీసుకువస్తారనేది ఆసక్తికరంగా మారింది. అతన్ని నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో తీసుకుంటే బౌలింగ్ విభాగం బలహీనమవుతుంది, లేకపోతే మరో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌ను తొలగించాల్సి ఉంటుంది.
ఒత్తిడితో తడబడుతున్న భారత్
ఇప్పటికే సిరీస్‌లో 1-2 తేడాతో వెనుకబడిన భారత్‌కు నాలుగో టెస్టు తప్పక గెలవాల్సిన మ్యాచ్ గా మారింది. టెస్టు ప్రారంభానికి ముందు ముగ్గురు ప్రధాన బౌలర్లకు గాయాల కారణంగా మ్యాచ్ కు అందుబాటులో లేరు. బుమ్రా ఇప్పటికే వర్క్ లోడ్ పరిమితుల కారణంగా మూడు మ్యాచ్‌లకే పరిమితం కానున్నాడు. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో అతనిని ఎలా వినియోగించాలన్నది కూడా భారత్ ముందున్న ప్రధాన ప్రశ్నగా మారింది.