India vs England: టీమిండియాకు బిగ్ షాక్.. నాలుగో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం !
India vs England: కీలకమైన మాంచెస్టర్ టెస్టులో గెలిస్తేనే భారత్ సిరీస్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్ట్‌కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

మాంచెస్టర్ టెస్ట్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ
ప్రస్తుతం భారత జట్టు ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ లో పర్యటిస్తోంది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో నాలుగో టెస్ట్ భారత్ కు చాలా కీలకం. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత్ గెలవకపోతే సిరీస్‌ను కోల్పోతుంది. సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 1-2తో వెనుకంజలో ఉంది. ఇలాంటి సమయంలో భారత్ కు మరో షాక్ తగిలింది. భారత బౌలింగ్ విభాగంలో కీలక ప్లేయర్ ఆకాశ్ దీప్ గాయం కారణంగా నాలుగో టెస్ట్‌కు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లార్డ్స్ టెస్ట్‌లో గాయపడ్డ ఆకాశ్ దీప్
లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ సందర్భంగా ఆకాశ్ దీప్ నడుము నొప్పి సమస్యను ఎదుర్కొన్నారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆకాశ్ దీప్ ఓవర్లు పూర్తిగా వేసే పరిస్థితిలో కనిపించలేదు. గాయం తీవ్రత తగ్గకపోవడంతో నాలుగో టెస్ట్‌కు అతన్ని ఎంపిక చేస్తారా? లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే, ఐదో టెస్ట్ (ది ఓవల్‌లో) కోసం ఆకాశ్ దీప్ తప్పకుండా అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
బుమ్రా, ఆకాశ్ దీప్ కలిసి ఆడే అవకాశమే లేదు !
భారత స్టార్ పేసర్ జస్రీత్ బుమ్రా వర్క్ లోడ్ నిర్వహణ కారణంగా మూడు టెస్టులు మాత్రమే ఆడతారని ఇంగ్లాండ్ పర్యటనకు ముందే భారత జట్టు ప్రకటించింది. తాజా పరిస్థితుల్లో బుమ్రా నాలుగో టెస్ట్ ఆడితే, ఆకాశ్ దీప్ దూరమవుతారు. ఐదో టెస్ట్‌కు బుమ్రా విశ్రాంతి తీసుకుంటే, ఆకాశ్ దీప్ మళ్లీ జట్టులోకి వస్తారు. కాబట్టి ఈ సిరీస్ లో అయితే బుమ్రా, ఆకాశ్ దీప్ లు కలిసి ఆడే సందర్భం రాకపోవచ్చని సమీప వర్గాలు పేర్కొంటున్నాయి.
భారత జట్టులోకి అంషుల్ కాంబోజ్
ఆకాశ్ దీప్ గాయంతో భారత్ జట్టులోకి హర్యానా యంగ్ ప్లేయర్, చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్ బౌలర్ అంషుల్ కాంబోజ్ జట్టులోకి రానున్నారు. ఇండియా ఏ తరపున ఇంగ్లాండ్ లయన్స్‌తో రెండు అన్‌ఆఫీషియల్ టెస్టులు, సిరీస్ ప్రారంభానికి ముందు ఇంట్రా-స్క్వాడ్ గేమ్‌లు ఆడిన కాంబోజ్.. ఇప్పుడిప్పుడే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.
అర్షదీప్ సింగ్ కూడా దూరం అయ్యాడు !
భారత జట్టుకు మరో బ్యాడ్ న్యూస్.. అర్షదీప్ సింగ్ గాయం. యంగ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా నాలుగో టెస్ట్‌కి అందుబాటులో ఉండకపోవచ్చు. బౌలింగ్ ప్రాక్టీస్ సమయంలో ఆయన ఎడమచేతికి గాయమై, కుట్లు పడ్డాయని రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ గాయం పూర్తిగా మానాలంటే దాదాపు 10 రోజులు అవసరం అవుతుందని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' నివేదించింది.
"అర్ష్‌దీప్ చేతికి లోతైన గాయం అయింది. కుట్లు వేయాల్సి వచ్చింది. ఆయన పూర్తిగా కోలుకోవడానికి పది రోజులు పడుతుంది. అందుకే కాంబోజ్ ను జట్టులోకి తీసుకొచ్చారు" అని సంబంధిత వర్గాలు తెలిపాయని నివేదిక పేర్కొంది.
ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో భారత్ గెలిచేనా
భారత్ ఈ సిరీస్‌లో ఇప్పటికే ఒక ఓటమిని చవిచూసింది. లార్డ్స్ టెస్ట్‌లో అనూహ్యంగా మ్యాచ్‌ను కోల్పోయింది. దీంతో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది. నాలుగో టెస్ట్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయడమే ప్రస్తుతమున్న ప్రధాన లక్ష్యం. ఆ తర్వాత 5వ టెస్టు గురించి ఆలోచన చేయాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే, కీలకమైన నాల్గో టెస్టుకు ముందు భారత బౌలింగ్ విభాగంలో మంచి ఫామ్ లో ఉన్న ప్లేయర్లు దూరం కావడం, ప్రధాన ఆటగాళ్లు గాయాలతో తప్పుకోవడం భారత్‌కు పెను సవాలుగా మారింది.
జట్టు ఎంపికపై చివరిదాకా నిర్ణయాలు మారే అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం నాలుగో టెస్ట్‌కు భారత్ బౌలింగ్ విభాగంలో కొన్ని కీలక మార్పులు తప్పకుండా కనిపించే ఛాన్స్ వుంది. కరుణ్ నాయర్ స్థానం మినహా బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులు వుండకపోవచ్చు.