- Home
- Sports
- Cricket
- India vs England: మాంచెస్టర్ పిచ్ ఎలా ఉండనుంది? బ్యాటింగా లేదా బౌలింగా? ఎవరికి బెస్ట్?
India vs England: మాంచెస్టర్ పిచ్ ఎలా ఉండనుంది? బ్యాటింగా లేదా బౌలింగా? ఎవరికి బెస్ట్?
India vs England: భారత్-ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్‌లో జూలై 23 నుండి ప్రారంభం కానుంది. మాంచెస్టర్ పిచ్ ఎలా ఉంటుందనే వివరాలను స్టీవ్ హార్మిసన్ వెల్లడించారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మాంచెస్టర్ పిచ్ రిపోర్టు.. హర్మిసన్ కీలక వ్యాఖ్యలు
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానం వేదికగా భారత్ - ఇంగ్లాండ్ నాల్గో టెస్టు మ్యాచ్ జరగనుంది. మాంచెస్టర్ పిచ్ ఎలా ఉంటుందనే వివరాలను ఇంగ్లాండ్ మాజీ పేసర్ స్టీవ్ హార్మిసన్ ESPNcricinfo ద్వారా వెల్లడించారు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా బుధవారం నుండి ప్రారంభం కానున్న మాంచెస్టర్ నాల్గో టెస్టు ముందు, హార్మిసన్ పిచ్ పరిస్థితులపై వివరంగా మాట్లాడారు. ప్రస్తుత సిరీస్‌లో 1-2 తేడాతో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది. అయితే, నాల్గో టెస్టును గెలిచిన భారత్ సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది.
మాంచెస్టర్ పిచ్ గతంలో మాదిరిగా ఫాస్ట్, బౌన్స్ కు అనుకూలం కాదు
క్రికెట్ చరిత్రను గమనిస్తే మాంచెస్టర్ పిచ్ ఫాస్ట్, బౌన్స్‌కు ప్రసిద్ధి చెందింది. కానీ గత రెండేళ్లుగా ఈ మైదానం తన చురుకుదనాన్ని కోల్పోయి స్లో, ఫ్లాట్ గా మారిందని హార్మిసన్ తెలిపారు.
"గత 18 నెలలు లేదా రెండు సంవత్సరాల్లో మాంచెస్టర్‌లోని ఫస్ట్ క్లాస్ పిచ్‌లు, గత 10-15 ఏళ్ల క్రితం ఉన్న విధంగా లేవు. అప్పుడు అవి బౌన్సీగా ఉండేవి. ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా కూడా ఉండేవి. కానీ, ఇప్పుడు అవన్నీ చాలా స్లోగా, ఫ్లాట్‌గా మారాయి” అని ఆయన పేర్కొన్నారు. అంటే మాంచెస్టర్ పిచ్ ప్రస్తుతం పేసర్ల కంటే స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని ఆయన వివరించారు.
వర్షం వస్తే మాంచెస్టర్ పిచ్ తో పేసర్లకు ప్రయోజనం
ఇంగ్లాండ్‌లో మూడు నెలలుగా వర్షం పడకపోయినా, మాంచెస్టర్‌లో మాత్రం వర్షం పడే అవకాశాలున్నాయని హార్మిసన్ వాతావరణ నివేదికలను ప్రస్తావించారు. “ఇక్కడ కొంత వర్షం పడితే, పిచ్‌కు కొంత జీవం వస్తుంది. లైవ్లీ సర్ఫేస్‌కు ఇది అవసరం” అని చెప్పారు. వర్షం వల్ల తేమ పెరిగితే, పేసర్లకు తాత్కాలికంగా సహాయం లభించే అవకాశం ఉందని అన్నారు.
స్పిన్నర్లకు అనుకూలంగా మాంచెస్టర్ పిచ్
ఈ పిచ్ ఎడ్జ్‌బాస్టన్‌లోని రెండో టెస్టుకు సమానంగా ఉండవచ్చని హార్మిసన్ అభిప్రాయపడ్డారు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ భారీగా పరుగులు చేసి విజయం సాధించిందని గుర్తుచేశారు. “ఇక్కడ రెండు స్పిన్నర్లను ఆడించేందుకు అవకాశం ఉంది. ఇంగ్లాండ్ మాత్రం ఒకే స్పిన్నర్ లియం డాసన్‌తోనే బరిలోకి దిగుతోంది” అని వివరించారు.
పిచ్ నెమ్మదిగా ఉండటంతో, మళ్లీ తక్కువ పరుగుల మ్యాచ్ కు అవకాశం ఉందని పేర్కొన్నారు. బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయడం అంత ఈజీగా ఉండదని పిచ్ రిపోర్టులు పేర్కొంటున్నాయి.
మాంచెస్టర్ గ్రౌండ్ ఇటీవలి రికార్డులు
మాంచెస్టర్ గ్రౌండ్ లో ఇటీవలి స్కోర్లు చూస్తే.. 2023 యాషెస్ టెస్టులో ఇంగ్లాండ్ 592 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 317, 214 పరుగులతో మ్యాచ్‌ను డ్రా చేసింది. గత కొన్ని మ్యాచ్‌లలో స్కోర్లు 236, 326, 358, 205గా నమోదయ్యాయి.
అంటే ఇక్కడ పెద్ద స్కోర్లు నమోదుచేయడం అంత ఈజీకాదు. బ్యాటర్లను ఇబ్బంది పెట్టే పిచ్ ఇది. అలాగే, పేసర్లకు పెద్దగా అనుకూలించకపోవచ్చు. స్పిన్నర్లకు మంచి పిచ్ అని చెప్పొచ్చు. అయితే, మైదానంలోని పిచ్ పరిస్థితులు, వాతావరణం, జట్ల వ్యూహాలు మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపే అవకాశముంది.
భారత్ - ఇంగ్లాండ్ టెస్టు సిరీస్.. ఇరు జట్లు
భారత్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్ & వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధృవ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, కుల్దీప్ యాదవ్, అన్షుల్ కాంబోజ్.
ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జేకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జాక్ క్రాలీ, లియం డాసన్, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్.