India vs England: మాంచెస్టర్ లో బిగ్ ఫైట్.. భారత్ తో పోరుకు ఇంగ్లాండ్ జట్టు ఇదే
India vs England: భారత్ తో నాలుగో టెస్టు కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించింది. షోయబ్ బషీర్ స్థానంలో లియామ్ డాసన్ జట్టులోకి వచ్చారు. ఇక భారత జట్టు తరఫున అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది.

మాంచెస్టర్ లో ఇండియా-ఇంగ్లాండ్ బిగ్ ఫైట్
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో నాలుగో టెస్టు కోసం ఇంగ్లాండ్ జట్టు తమ ప్లేయింగ్ 11ను ప్రకటించింది. మాంచెస్టర్‌లో జూలై 23 నుండి ప్రారంభమయ్యే ఈ కీలక టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది.
గాయంతో సిరీస్ నుంచి తప్పుకున్న ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లియమ్ డాసన్‌కు అవకాశం లభించింది. మరోవైపు, భారత జట్టు తరఫున యంగ్ పేసర్ అన్షుల్ కాంబోజ్ అరంగేట్రం చేసే అవకాశముంది.
ఎనిమిదేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి లియమ్ డాసన్
ఇంగ్లాండ్ జట్టుకు ఇది కీలకమైన టెస్టు కావడంతో అనుభవజ్ఞులైన ఆటగాళ్లకు అవకాశం ఇచ్చారు. దీంతో దాదాపు 8 ఏళ్ల తర్వాత డాసన్ టెస్టు జట్టులోకి వచ్చాడు. హాంప్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహించే 35 ఏళ్ల లియమ్ డాసన్ చివరిసారిగా జూలై 2017లో టెస్టు ఆడారు.
2023, 2024 సీజన్లలో అద్భుత ప్రదర్శనలతో కౌంటీ క్రికెట్లో PCA ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గెలిచిన డాసన్ కు షోయబ్ బషీర్ గాయంతో దూరం కావడంతో ఇంగ్లాండ్ జట్టు నుంచి పిలుపు వచ్చింది.
లార్డ్స్ టెస్టు మూడో రోజు షోయబ్ బషీర్ కు గాయం అయింది. రవీంద్ర జడేజా కొట్టిన హిట్టింగ్ డ్రైవ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన సమయంలో అతని ఎడమ చేయి చిటికన వేలికి గాయం అయింది.
ఆ తరువాత అతనికి సర్జరీ కూడా జరిగింది. ఇక అతను ఇండియా రెండవ ఇన్నింగ్స్‌లో 5.5 ఓవర్లు వేసి చివరి వికెట్ అయిన మహ్మద్ సిరాజ్‌ను ఔట్ చేసి ఇంగ్లాండ్‌కు 22 పరుగుల విజయాన్ని అందించాడు.
మాంచెస్టర్ టెస్టు కోసం ఇంగ్లాండ్ ప్లేయింగ్ XI:
ఇంగ్లాండ్: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), లియమ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రిడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్.
అధిక్యంలో ఇంగ్లాండ్
ఇంగ్లాండ్ ప్రస్తుతానికి ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది. లీడ్స్, లార్డ్స్ వేదికలపై మొదటి, మూడవ టెస్టులలో ఇంగ్లాండ్ విజయం సాధించింది. అయితే, ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. మాంచెస్టర్ టెస్టులో భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది.
భారత బౌలింగ్ లైనప్‌లో గాయాల కలవరం
భారత జట్టు విషయానికి వస్తే పేస్ బౌలింగ్ విభాగంలో గాయాల వల్ల సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆకాష్ దీప్ ఇంకా గాయాల నుంచి కోలుకోలేదు. అర్ష్‌దీప్ సింగ్ చేతి గాయంతో టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతను చివరి మ్యాచ్ కు కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదని సమాచారం.
జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ, అన్షుల్ కంబోజ్ మాత్రమే ప్రస్తుతం భారత పేస్ బౌలింగ్ విభాగంలో ఫిట్ గా ఉన్నారు.
24 ఏళ్ల అన్షుల్ కంబోజ్‌ను రిజర్వ్‌గా జట్టులోకి తీసుకున్నారు. శనివారం అతను భారత జట్టులో చేరాడు. ఆదివారం మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్లను కలుసుకున్న కాంబోజ్, సోమవారం నెట్ సెషన్‌లో పూర్తి వేగంతో బౌలింగ్ చేశాడు.
అతని లైన్-లెంగ్త్ బౌలింగ్, క్రమశిక్షణ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ సహా కోచింగ్ సిబ్బందిని మెప్పించడంతో జట్టులోకి వచ్చాడు.
రిషబ్ పంత్ కీపింగ్ చేసేనా?
భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు గత మ్యాచ్ లో చేతికి గాయం అయింది. దీంతో ధ్రువ్ జురేల్ కీపింగ్ చేయడానికి వచ్చారు. అయితే, భారత ఇన్నింగ్స్ సమయంలో పంత్ బ్యాటింగ్ చేయడానికి వచ్చారు. ప్రస్తుతం గాయం తగ్గడంతో తిరిగి కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
ప్రాక్టీస్ సెషన్‌లో స్వల్పంగా అసౌకర్యంగా ఉన్నా, అతను కీపింగ్ చేస్తూ కనిపించాడు. ఇది భారత జట్టుకు పెద్ద బలంగా మారనుంది. అయితే ఆకాష్ దీప్ గాయం మరోసారి తీవ్రతరం కావడంతో అతను ఆడటం కష్టమేనని సమాచారం.