India vs England: 5 సెంచరీలు కొట్టినా ఓడిన భారత్
India vs England: భారత్ ఉంచిన 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. దీంతో బెన్ స్టోక్స్ టీమ్ ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.
లీడ్స్ టెస్టులో భారత్ కు బిగ్ షాక్.. 5 వికెట్లతో ఇంగ్లాండ్ గెలుపు
India vs England : లీడ్స్‌లోని హెడ్డింగ్లీ మైదానంలో ముగిసిన తొలి టెస్టులో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. ఐదు సెంచరీలు కొట్టినా భారత్ విజయాన్ని అందుకోలేకపోయింది. భారత్ ఉంచిన 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం 5 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 1-0తో ప్రారంభించింది. భారత జట్టు ఓటమిలో ఫీల్డింగ్ తప్పిదాలు, బౌలింగ్ పనిచేయకపోవడం, టాపార్డర్ బ్యాటింగ్ లో రాణించినా టెయిలెండర్లు రాణించకపోవడంతో భారత్ ఓటమిని నుంచి తప్పించుకోలేకపోయింది.
భారత్ తొలి ఇన్నింగ్స్: మూడు సెంచరీలతో 471 పరుగులు
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, భారత్‌కు బ్యాటింగ్ ఆఫర్ చేశాడు. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ శభ్ మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు మెరుగైన ఆరంభం లభించింది. యశస్వి జైస్వాల్ (101 పరగులు), శుభ్ మన్ గిల్ (147 పరుగులు), రిషభ్ పంత్ (134 పరుగులు) సెంచరీలు కొట్టారు.
మొదటి వికెట్‌కు కేఎల్ రాహుల్ (42 పరుగులు) - యశస్వి జైస్వాల్ మధ్య 91 పరుగుల భాగస్వామ్యం నిలిచింది. కానీ మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ పరుగులు చేయడంలో విఫలమైంది. డెబ్యూట్ చేస్తున్న సాయి సుదర్శన్ డకౌట్ కాగా, జడేజా 11, శార్దూల్, ప్రసిద్ధ్ ఒక్కో పరుగు మాత్రమే చేశారు. కరుణ్ నాయర్ నిరాశపరిచాడు. జోష్ టంగ్, బెన్ స్టోక్స్ ఇద్దరు చెరో నాలుగు వికెట్లు తీశారు.
ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్: ఓలీ పోప్ సెంచరీ.. బుమ్రాకు ఐదు వికెట్లు
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది. ఓలీ పోప్ 106 పరుగులు, హ్యారీ బ్రూక్ 99 పరుగులు, బెన్ డకెట్ 62 పరుగులు, జేమీ స్మిత్ 40 పరుగులు చేశారు. భారత్ తరఫున బుమ్రా 5 వికెట్లు తీసి మెరిశారు. ప్రసిద్ధ్ 3, సిరాజ్ 2 వికెట్లు తీసినా, ఫీల్డింగ్ లో పొరపాట్లు భారత్‌పై ప్రభావం చూపాయి. జైస్వాల్ పలు క్యాచ్‌లు, జడేజా ఒక క్యాచ్ వదిలారు.
భారత్ రెండో ఇన్నింగ్స్: పంత్, రాహుల్ సెంచరీలతో మరోసారి మెరిశారు
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేసింది. రిషబ్ పంత్ మరోసారి (118 పరుగులు) సెంచరీతో అదరగొట్టాడు. కేఎల్ రాహుల్ (137 పరుగులు) అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మరోసారి లోయర్ ఆర్డర్ విఫలమైంది. దీంతో ఇంగ్లాండ్ ముందు 371 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది భారత్.
ఇంగ్లాండ్ ఛేజ్: బెన్ డకెట్ 149 దుమ్మురేపాడు
ఇంగ్లాండ్ ఛేజ్‌లో బెన్ డకెట్ 170 బంతుల్లో 149 పరుగుల సూపర్ నాక్ ఆడాడు. బెన్ డకెట్, క్రాలీ (65) మొదటి వికెట్‌కు 188 పరుగుల భాగస్వామ్యం అందించారు. ప్రసిద్ధ్ కృష్ణ క్రాలీ, పోప్‌లను ఔట్ చేయగా, శార్దూల్ డకెట్, బ్రూక్‌లను వరుస బంతుల్లో వెనక్కి పంపి భారత్‌కు అవకాశమిచ్చాడు. అయితే జో రూట్ (53* పరుగులు), బెన్ స్టోక్స్ (33 పరుగులు) నిలకడగా ఆడి ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించారు.
చివరి రోజు థ్రిల్: ఫీల్డింగ్ పొరపాట్లు భారత్ కొంపముంచాయి
యశస్వి జైస్వాల్ బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్ వదలడంతో భారత్ పై ఒత్తిడిని పెంచింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు అనేక స్థాయిలలో నిర్లక్ష్యం వహించింది. యశస్వి జైస్వాల్ కీలక క్యాచ్‌ను వదిలేయడం, కుల్దీప్ యాదవ్ లాంటి లెగ్ స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకోకపోవడం భారత ఓటమికి దారితీసింది. బుమ్రా ఒక్కడే ప్రయత్నించినప్పటికీ, ఇతర బౌలర్ల నుంచి సరైన మద్దతు లేకపోవడం స్పష్టంగా కనిపించింది.
చివర్లో వర్షం ఆటను ఆపినప్పటికీ ఇంగ్లాండ్ దూకుడును కోల్పోలేదు. టీ బ్రేక్ తర్వాత 102 పరుగులు అవసరంగా ఉండగా, ఇంగ్లాండ్ 373/5 స్కోరు వద్ద లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది.