హెడింగ్లీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య టెస్ట్ సిరీస్‌కు తెర లేచింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ క్రికెట‌ర్, భారత దిగ్గజం సచిన్ తెందుల్కర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

భార‌త్‌, ఇంగ్లండ్ మ‌ధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభ‌మైంది. హెడింగ్లీ వేదిక‌గా జ‌రుగుతోన్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత భారత్ జట్టుకు ఇది తొలి టెస్ట్ సిరీస్‌. డబ్ల్యూటీసీ కొత్త సైకిల్‌లో ఇదే తొలి ఛాలెంజ్ కావడం విశేషం. యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని ఈ టీమ్‌ పై క్రికెట్ అభిమానులకే కాదు, లెజెండ్స్‌కూ విశ్వాసం ఉంది.

భారత్, ఇంగ్లండ్ తుది జట్లు ఇవే

భారత జట్టు (India Playing XI):

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

ఇంగ్లండ్ జట్టు (England Playing XI):

జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్.

సిరీస్ గెలిచేది ఎవ‌రంటే: స‌చిన కీల‌క వ్యాఖ్య‌లు

టీమ్‌ఇండియా ఈ సిరీస్‌ను 3-1 తేడాతో గెలుచుకుంటుందని భారత దిగ్గజం సచిన్ తెందుల్కర్ అభిప్రాయపడ్డాడు. ఒక ప్రముఖ క్రీడా ఛానెల్‌తో మాట్లాడుతూ, భారత్ బౌలింగ్ అటాక్‌పై భరోసా వ్యక్తం చేశాడు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా కీలకంగా నిలుస్తాడని అన్నారు.

భారత బౌలింగ్‌కు కీలక పాత్ర

సచిన్ మాటల ప్రకారం, బుమ్రా బౌలింగ్‌లో రాణించడానికి ఇతర బౌలర్ల సహకారం అవసరం. ప్రసిద్ధ్ కృష్ణ మంచి రీతిలో బౌలింగ్ చేస్తున్నాడని, ఆర్షదీప్ సింగ్, శార్దూల్ ఠాకూర్, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా లాంటి వారు బుమ్రాకు మద్దతుగా నిలుస్తారని చెప్పారు.

స్పిన్నర్ల మీద ఆశ‌లు

స్పిన్ విభాగంలో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ లాంటి నిపుణులు ఆత్మవిశ్వాసంగా ఉన్నారని, వారు ప్రత్యర్థిని కట్టడి చేస్తారని సచిన్ అభిప్రాయపడ్డాడు. వీరి కృషితో టీమ్ ఇండియా విజయం సాధించగలదని తన విశ్లేషణలో తెలిపారు.