- Home
- Automobile
- Cars
- Tesla India: భారత్‌కు వచ్చేసిన టెస్లా.. షోరూమ్ నెల రెంటే రూ. 35 లక్షలు, కారు ఫీచర్లు తెలిస్తే కళ్లు తేలేయ్యాల్సిందే
Tesla India: భారత్‌కు వచ్చేసిన టెస్లా.. షోరూమ్ నెల రెంటే రూ. 35 లక్షలు, కారు ఫీచర్లు తెలిస్తే కళ్లు తేలేయ్యాల్సిందే
అమెరికాకు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ టెస్లా ఎట్టకేలకు భారత్‌లోకి అడుగు పెట్టింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెర తీస్తూ దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో తొలి షోరూమ్ అధికారికంగా ప్రారంభమైంది.

ముంబయిలో తొలి షోరూమ్ ప్రారంభం
ప్రపంచవ్యాప్తంగా ఈవీ రంగంలో దూసుకుపోతున్న టెస్లా ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ముంబయి నగరంలోని ప్రముఖ బిజినెస్ ఏరియా బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC) లో టెస్లా తొలి షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ఇది టెస్లా సంస్థ ఇండియాలో ఏర్పాటు చేసిన తొలి "ఎక్స్‌పీరియన్స్ సెంటర్" కావడం విశేషం.
షోరూమ్ ప్రత్యేకతలు
టెస్లా షోరూమ్ 4,000 చ.అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఇది ముంబయిలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉంది. ఈ షోరూమ్ నెలవారీ అద్దె రూ. 35 లక్షలు అని తెలుస్తోంది. షోరూమ్‌లో ప్రస్తుతం టెస్లా ప్రీమియమ్ ఎలక్ట్రిక్ SUV అయిన మోడల్ Y ప్రదర్శనలో ఉంది. షాంగై నుంచి భారత్‌కు ఆరు మోడల్ Y కార్లను దిగుమతి చేశారు. వీటిని షోరూమ్‌లో ప్రదర్శన కోసం ఉంచారు.
మోడల్ వై కార్ల ఫీచర్లు ఏంటంటే.?
ఈ కారులో రియర్ వీల్ డ్రైవ్ (RWD), లాంగ్ రేంజ్ AWD వంటి ఫీచర్లను అందించారు. అలాగే ఇందులో 15.4 ఇంచెస్ టచ్ స్క్రీన్, వైర్‌లెస్ చార్జింగ్, USB-C పోర్ట్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, వాయిస్ కమాండ్స్, 9 స్పీకర్లు, సౌండ్ ఇన్సులేషన్ టెక్నాలజీ, డ్యూయల్ టోన్ ఇంటీరియర్ డిజైన్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.
5.6 సెకన్లలో 100 కి.మీల వేగం
రియర్ వీల్ డ్రైవ్ వేరియంట్ కారు ఒక్కసారిగా ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. ఇక ఈ కారు కేవలం 5.9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. లాంగ్ రేంజ్ AWD వేరియంట్ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 622 కిలోమీటర్లు దూసుకెళ్తుంది. ఈ కారు కేవలం 5.6 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటంది.
ధరలు ఎలా ఉన్నాయంటే.?
టెస్లా రియర్ వీల్ డ్రైవ్ ధర రూ. 60.1 లక్షలు కాగా లాంగ్ రేంజ్ AWD ధర రూ. 67.8 లక్షలుగా నిర్ణయించారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో టెస్లా కార్ల ధరలు భారత్‌లో ఎక్కువగా ఉన్నాయి. ఇవే మోడల్ కార్లు అమెరికా, చైనా, జర్మనీల్లో దాదాపుగా సగం రేటుకే అందుబాటులో ఉండడం గమనార్హం.
భారత ప్రభుత్వం 40వేల డాలర్ల కంటే విలువైన ఈవీ కార్ల దిగుమతులపై 70 శాతం నుంచి 100 శాతం వరకు దిగుమతి సుంకాలను విధించడం కారణంగానే కార్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి. కాగా దీనిని భారీగా తగ్గించాలనే డిమాండ్ చాలా కాలం నుంచి కొనసాగుతోంది.