- Home
- Business
- Road Accidents: రోడ్డు ప్రమాదాల్లో ఏటా ఇన్ని లక్షల మంది చనిపోతున్నారా? యాక్సిడెంట్స్‌కి ప్రధాన కారణాలు ఇవే
Road Accidents: రోడ్డు ప్రమాదాల్లో ఏటా ఇన్ని లక్షల మంది చనిపోతున్నారా? యాక్సిడెంట్స్‌కి ప్రధాన కారణాలు ఇవే
Road Accidents: వృద్ధాప్యం వల్ల చనిపోవడం సహజం. శరీరంలో శక్తి లేక మరణిస్తుంటారు. కాని రోడ్డు ప్రమాదాలు అలా కాదు.. చిన్న, పెద్ద తేడా లేకుండా ఎవరి ప్రాణాలనైనా తీసేస్తాయి. ఇండియాలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో ఎన్ని లక్షల మంది చనిపోతున్నారో మీకు తెలుసా?

1.68 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు
భారత్‌లో ప్రతి సంవత్సరం రహదారి ప్రమాదాల వల్ల 1.68 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దుస్థితిని దృష్టిలో ఉంచుకొని రోడ్ సేఫ్టీ నెట్‌వర్క్ (RSN) దేశంలో రహదారి భద్రతా చట్టాలను మరింత కఠినంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. త్వరలో 2025 పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల విషయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయంపై గట్టి చర్చ జరగబోతోందని సమాచారం. మరి కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
ఇందులో దాదాపు 10% మంది పిల్లలే
2019లో కొత్త మోటారు వాహన చట్టం అమలులోకి వచ్చింది. దీనిపై చాలా రాష్ట్రాలు సంస్కరణలు కూడా చేపట్టాయి. అయినా కూడా ఏటా 1.68 లక్షలకు పైగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో దాదాపు 10% మంది పిల్లలు ఉండటం బాధించే విషయం.
2011 నుంచి 2022 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.98 లక్షల మంది పిల్లలు చనిపోయారు. అందుకే రోడ్డు భద్రతను జాతీయ ప్రాధాన్య అంశంగా పరిగణించాలని RSN పార్లమెంటును కోరుతోంది.
అనుమతులు పొందని స్కూల్ బస్సులు, ఆటోలే కారణం
RSN కేంద్రానికి విన్నవించిన నివేదికలో అనేక ముఖ్య విషయాలను ప్రస్తావించింది. అనుమతులు లేని వేన్లు, ఆటో రిక్షాల వంటి స్కూల్ వాహనాల వల్ల ప్రమాదాలు జరిగి పిల్లలు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొంది. ఇలాంటి వాహనాలను నియంత్రించడానికి MV చట్టంలోని సెక్షన్ 2(11)ని సవరించాలని RSN కోరుతోంది. 60% మంది పిల్లలు స్కూళ్లకు నడుచుకుంటూ వెళ్తున్నందున సురక్షిత స్కూల్ జోన్‌లను కూడా ఏర్పాటు చేయాలని RSN విన్నవించింది.
రోడ్డు ప్రమాదాలకు అతివేగమే కారణం
2022లో భారతదేశంలో జరిగిన 1.19 లక్షల రోడ్డు ప్రమాద మరణాల్లో 72% వేగమే కారణమని నిర్ధారణ అయ్యింది. ముఖ్యంగా స్కూళ్లు, మార్కెట్లు, నివాస ప్రాంతాల దగ్గర అతివేగంగా వాహనాలు నడపడం వల్లనే ప్రమాదాలు ఎక్కువగా జరిగాయని RSN గుర్తించింది. MV చట్టంలోని సెక్షన్ 112 వేగ పరిమితులను నిర్దేశించినప్పటికీ అది స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోదు.
భారతీయ రోడ్లు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, పాదచారులు, సైక్లిస్టులు, ప్రజా రవాణా వాడుకునేవారి భద్రత కోసం బలమైన రాష్ట్ర రోడ్డు భద్రతా ప్రణాళికలను RSN కోరుతోంది.
పట్టణ ప్రణాళిక మెరుగుపడితేనే ప్రమాదాల నివారణ
2019లో తీసుకొచ్చిన MV చట్టం వల్ల హైవే డిజైన్ మెరుగ్గా మారింది. అయితే పట్టణ ప్రణాళిక వెనుకబడి ఉండటం వల్ల రోడ్డుప్రమాదాలు తగ్గలేదు. ముఖ్యంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు సంబంధించిన నియమాల అమలు బలహీనంగా ఉంది. వాహనదారుల ప్రమాదకర ప్రవర్తనను అరికట్టడానికి సెక్షన్ 183 కింద కఠిన శిక్షలు విధించాలని RSN కోరుతోంది.
2025 జనవరి-మే మధ్య ఢిల్లీలో 517 రహదారి మరణాలు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే 13.4% తగ్గినా పాదచారులు, రెండు చక్రాల వాహనదారుల మృతి ఎక్కువగా ఉంది. ఇందుకు కారణం ప్రామాణిక మౌలిక సదుపాయాల లోపం, వేగ నియంత్రణను కంట్రోల్ చేయకపోవడమేనని తెలుస్తోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో అయినా రోడ్డు ప్రమాదాల నివారణపై చర్చించి కేంద్రం కఠిన నియమాలు అమలు చేయాలని RSN కోరుతోంది.