Chat GPT: మీ ఫోన్‌లో ఈ వాట్సాప్ నెంబర్ ఉంటే.. ప్రపంచం మీ చేతిలో ఉన్నట్లే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ఎక్కడా చూసినా దీని గురించే చర్చ. ఏఐలో తొలిసారి సంచలనంగా దూసుకొచ్చింది చాట్ జీపీటీ. గూగుల్ వంటి దిగ్గజ సంస్థ భయపడే పరిస్థితి వచ్చిందంటేనే చాట్ జీపీటీ రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కేవలం 5 రోజుల్లోనే 1 మిలియన్ డౌన్‌లోడ్స్‌తో చాట్ జీపీటీ టెక్ ప్రపంచాన్ని షేక్ చేసింది. అయితే ఈ చాట్ జీపీటీని వాట్సాప్‌లో కూడా ఉపయోగించుకోవచ్చని తెలుసా.?

Whats App
ఏదైనా సమాచారం కావాలంటే మొన్నటి వరకు గూగుల్‌లో వెతికే వారు. కానీ ప్రస్తుతం చాట్ జీపీటీని ఆశ్రయిస్తున్నారు. ఒక ప్రశ్నకు గూగుల్ వంద రకాల సమాధానాలు చెప్తుంది. అయితే చాట్ జీపీటీ మాత్రం మీ ప్రశ్నకు సరైన ఒకే ఒక సమాధానం ఇస్తుంది. అందుకే ఈ చాట్‌బాట్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీగా ఆదరణ లభించింది. ఒక మనిషితో మనం చాట్ చేస్తే ఎలా ఉంటుందో అచ్చంగా అలాగే ఉంటుంది చాట్ జీపీటీతో. సాధారణంగా చాట్ జీపీటీని ఉపయోగించాలంటే ఏం చేస్తాం. ఏముంది మొబైల్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటాం లేదంటే సెర్చ్ ఇంజన్‌లో చాట్ జీపీటీని ఓపెన్ చేస్తాం. అంతే కదూ!

chatgpt
అయితే ఇలాంటివి ఏం లేకుండా ఎంచక్కా వాట్సాప్‌లో చాట్ జీపీటీ సేవలు యాక్సెస్ చేసుకోగలిగితే భలే ఉంటుంది కదూ! ఈ సేవలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. సింపుల్‌గా ఒక క్లిక్‌తో చాట్ జీపీటీతో సంభాషించవచ్చు. మీకు నచ్చిన ప్రశ్నలు అడగొచ్చు. అంతరిక్షం నుంచి అవకాయ వరకు ఆ మాటకొస్తే ఒక స్నేహితుడితో ఎలాగైతే చాట్ చేస్తామో అలాగే చాట్ చేసుకోవచ్చు. ఇంతకీ వాట్సాప్‌లో చాట్ జీపీటీ సేవలను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వండి..
* ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లో +1 800 242 8478 నెంబర్‌ను సేవ్ చేసుకోవాలి.
* సహజంగా మనం నెంబర్ సేవ్ చేసుకునే సమయంలో +91 వస్తుంది. అయితే నెంబర్ సేవ్ చేసే ముందు +1ని టైప్ చేయాలి.
* ఆ తర్వాత వాట్సాప్‌ను ఓపెన్ చేసి ఏ పేరుతో అయితే జీపీటీ నెంబర్‌ను సేవ్ చేసుకున్నారో ఆ చాట్‌బాక్స్‌ను ఓపెన్ చేయాలి.
* అంతే మీకు ఎలాంటి సందేహం ఉన్నా, ఎలాంటి సమాచారం కావాలనుకున్నా సరే ఒక మెసేజ్‌తో పొందొచ్చు.
అయితే వాట్సాప్ చాట్ జీపీటీ సేవల్లో ప్రస్తుతం కొన్ని పరిమితులు ఉన్నాయి. యూజర్లకు ప్రతీ నెల 15 నిమిషాల పాటు ఉచితంగా చాట్ జీపీటీ సేవలను పొందొచ్చు. అన్‌లిమిటెడ్ సేవలను పొందాలంటే చాట్ జీపీటీ ప్రో లేదా ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం వాట్సాప్ చాట్ జీపీటీలో ఫొటోలు, వీడియోలు, ఆడియోలను జనరేట్ చేసే టెక్నాలజీ అందుబాటులోకి రాలేదు. కానీ మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎక్కడ పొందొచ్చన్న విషయాన్ని మాత్రం టక్కును చెప్పేస్తుంది.
ఏ సమాచారమైనా.?
చాట్ జీపీటీ ద్వారా మీకు కావాల్సిన ఎలాంటి సమాచారమైనా పొందొచ్చు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే తెలుగులోనూ మీరు సమాచారం పొందొచ్చు. చాట్ జీపీటీ చాట్ బాక్స్‌ను ఓపెన్ చేసి మీరు తెలుగులో టైప్ చేసినా సమాచారం అందిస్తుంది. ఉదాహరణకు బిర్యానీ ఎలా చేయాలని అడిగారనుకుందాం. వెంటనే కావాల్సిన పదార్థాలు మొదలు తయారీ విధానం వరకు అన్నీ పూసగుచ్చినట్లు టెక్ట్స్ రూపంలో అందిస్తుంది.