- Home
- Business
- Indian Railway: బ్యాటరీ వాహనాలు, వీల్ చైర్‌లు.. రైల్వే స్టేషన్‌లో మీకు తెలియని ఎన్నో సౌకర్యాలు
Indian Railway: బ్యాటరీ వాహనాలు, వీల్ చైర్‌లు.. రైల్వే స్టేషన్‌లో మీకు తెలియని ఎన్నో సౌకర్యాలు
Indian Railway: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌లలో ఒకటి. ప్రయాణికుల సౌకర్యాల విషయంలో ముందుంటుంది. ముఖ్యంగా వృద్ధులకు రైలు ప్రయాణం సులభంగా ఉండేలా పలు ప్రత్యేక సదుపాయాలు అందిస్తోంది. అవేంటంటే..

సులభంగా లోయర్ బెర్త్‌లు
రైలులో స్లీపర్, ఏసీ–3 టైర్, ఏసీ–2 టైర్ కోచ్‌లలో 60 ఏళ్లు దాటిన పురుషులకు, 58 ఏళ్లు దాటిన మహిళలకు లోయర్ బెర్త్ కేటాయింపు ఉంటుంది. టికెట్ బుకింగ్ సమయంలోనే ఈ అవకాశం కల్పిస్తారు. రైలు బయలుదేరిన తర్వాత కూడా లోయర్ బెర్త్ ఖాళీగా ఉంటే ముందుగా వృద్ధులకే ఇస్తారు. దీంతో ప్రయాణికులకు ఎక్కడం, దిగడం సులభంగా ఉంటుంది.
వీల్ చైర్ సౌకర్యం
దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో వృద్ధులకు ఉచిత వీల్ చైర్ సదుపాయం ఉంది. స్టేషన్ గేట్ నుంచి ప్లాట్‌ఫాం వరకు నడవలేని వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. లగేజీ మోయడానికి పోర్టర్ల సహాయం కూడా లభిస్తుంది.
బ్యాటరీ వాహనాల సేవ
దేశంలోని పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లలో బ్యాటరీతో నడిచే చిన్న వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి రైలు బోగీల దగ్గర వరకూ తీసుకెళ్తాయి. వృద్ధులు ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం ఉండదు. ఈ సేవ ఉచితంగా అందిస్తున్నారు.
ప్రత్యేక టికెట్ కౌంటర్లు
ప్రతి రైల్వే స్టేషన్‌లో వృద్ధులు, వికలాంగుల కోసం ప్రత్యేక టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీని వల్ల పొడవైన క్యూలలో నిలబడాల్సిన అవసరం ఉండదు. త్వరగా టికెట్ పొందవచ్చు.
లోకల్ రైళ్లలో ప్రత్యేక సీట్లు
ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా లాంటి నగరాల్లో లోకల్ రైళ్లలో వృద్ధుల కోసం ప్రత్యేక సీట్లు కేటాయించారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో కూడా కూర్చుని ప్రయాణించే అవకాశం ఉంటుంది. నిలబడాల్సిన ఇబ్బంది తగ్గుతుంది.

