Income Tax: ఇంట్లో డబ్బులు దాచుకుంటున్నారా.? అయితే మీ ఇంటికి అధికారులు రావొచ్చు
Income Tax: మనలో చాలా మందికి ఆదాయపు పన్ను నిబంధనలపై అవగాహన ఉండదు. మన డబ్బే కదా మన ఇష్టం అనడానికి వీలుండదనే విషయం మీకు తెలుసా.? ఇంట్లో భారీగా నగదు ఉంటే పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఇంతకీ చట్టం ఏం చెబుతోందంటే..

నగదు దాచుకుంటే భారీ పన్ను భారం
కొత్త ఆదాయపు పన్ను నిబంధనల వల్ల ఇంట్లో ఉన్న నగదుపై భారీ భారం పడే అవకాశం ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా హెచ్చరించిన ప్రకారం, ఐటీ శాఖ దాడుల్లో సోర్స్ చెప్పని నగదు దొరికితే దాదాపు 84% వరకు పన్నులు, పెనాల్టీలు వేసే అవకాశం ఉంది.
నగదు వినియోగంపై ప్రభుత్వ కంట్రోల్ మరింత పెరిగింది
అహుజా చెప్పిన వివరాల ప్రకారం, ఇప్పుడు నగదు లావాదేవీలపై మరింత కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. నగదు మీద పన్నులు, పెనాల్టీలు భారీగా పెరిగాయి. ఎవరైనా అధిక మొత్తంలో నగదును ఇంట్లో దాచుకుంటే.. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం తెలపాల్సిన బాధ్యత వాళ్లదే. లేదంటే 84 శాతం పన్ను చెల్లించాల్సి వస్తుంది.
పన్ను శాఖ మీ నగదు కదలికలను ఎలా తెలుసుకుంటుంది?
ఇప్పుడు బ్యాంకులు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, పన్ను శాఖ మధ్య డేటా షేరింగ్ ఆటోమేటిక్ అయింది. అందువల్ల ఒక సంవత్సరంలో రూ. 10 లక్షలకు పైగా నగదు విత్‌డ్రా చేస్తే, బ్యాంక్ ఆ సమాచారాన్ని నేరుగా పన్ను శాఖకు పంపుతుంది. రూ. 20 లక్షలకి పైగా నగదు విత్‌డ్రా చేస్తే, బ్యాంక్ TDS కట్ చేస్తుంది. తరచుగా పెద్ద నగదు లావాదేవీలు చేస్తే, ఐటీ శాఖ మీపై దర్యాప్తు చేయొచ్చు.
కొన్ని నగదు లావాదేవీలు నేరంగా 100% పెనాల్టీకి దారి తీస్తాయి
కొన్ని నగదు లావాదేవీలపై ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధిస్తోంది. ఒకే వ్యక్తి నుంచి ఒక్క రోజులో రూ. 2 లక్షలకు పైగా నగదు తీసుకోవడం, ఏ రకం నగదు లోనైనా నగదుగా తీసుకోవడం, ప్రాపర్టీ అమ్మినప్పుడు రూ. 20,000 పైగా నగదు పొందడం వంటి సందర్భాల్లో 100% పెనాల్టీ పడుతుంది. అంటే మీరు తీసుకున్న నగదు మొత్తాన్ని మళ్లీ పన్నుగా చెల్లించాలి అన్నమాట.
ఇప్పుడు ఎందుకు కఠినంగా అమలు చేస్తున్నారు?
బ్లాక్ మనీ, అక్రమ నగదు, అన్‌అకౌంటెడ్ లావాదేవీలను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. కొత్తవి కాకపోయినా, ఇప్పుడు బ్యాంకులు–పన్ను శాఖ–రిజిస్ట్రార్‌ల మధ్య డేటా షేరింగ్ బలంగా ఉండటంతో ఎవరినైనా తేలికగా గుర్తించగలిగే పరిస్థితి వచ్చింది.

