Amazon Jobs : ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు... అమెజాన్ లో 10 లక్షల జాబ్స్..!
Amazon Investment : అమెజాన్ ఇండియాలో మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా దేశ యువతకు భారీ ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

అమెజాన్ భారీ పెట్టుబడులు
Amazon : దిగ్గజ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ భారతదేశంలో భారీ పెట్టుబడులకు సిద్దమయ్యింది. ఇప్పటికే అమెజాన్ భారతీయ మార్కెట్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది... ఇకపై మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు సిద్దమయ్యింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో అంటే 2010 నాటికి మరో 35 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమయ్యింది... తద్వారా ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా భారీగా ఉద్యోగాల కల్పన జరగనుందని తెలిపింది. ఈ మేరకు అమెజాన్ కీలక ప్రకటన చేసింది.
ఇండియాలో అమెజాన్ పెట్టుబడులు
ఇవాళ (డిసెంబర్ 10, బుధవారం) అమెజాన్ సంభవ్ 2025 నిర్వహిస్తోంది. దేశ రాజధాని న్యూడిల్లీలోని భారత్ మండపంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇందులోనే భారతదేశంలో పెట్టుబడులకు సంబంధించి అమెజాన్ అధికారిక ప్రకటన చేసింది.
అమెజాన్ వివిధ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతుందని... 2030 నాటికి 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెజాన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ ప్రకటించారు. ఈ పెట్టుబడులు కంపెనీ విస్తరణకే కాదు భారతదేశ అభివృద్ధికి ఉత్ప్రేరకంగా ఉపయోగపడతాయని అన్నారు. డిజిటల్ ఇండియా దిశగా మరింత వేగంగా అడుగులు వేస్తున్నామని... మౌలిక సదుపాయాల కల్పనకే కాదు నూతన ఆవిష్కరణల కోసం పెట్టుబడులను ఉపయోగించుకోనున్నట్లు అమెజాన్ ప్రకటించింది.
భారీగా ఉద్యోగాలు
ఇప్పటికే అమెజాన్ భారతదేశంలో 40 బిలియన్లకు పైగా పెట్టుబడులు పెట్టింది... తద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 28 లక్షలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. అలాగే 2024 నాటికి 1,20,00,000 చిరు వ్యాపారులను డిజిలటలైజేషన్ దిశగా నడిపించింది. ఇలా అమెజాన్ దేశంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా, ఇ-కామర్స్ దిగ్గజంగా నిలిచింది.
అయితే వచ్చే ఐదేళ్లలో దేశంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు... వ్యాపారాన్ని విస్తరించేందుకు సిద్దమయ్యింది అమెజాన్. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా మరో 10 లక్షల ఉద్యోగాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా కల్పించనున్నట్లు తెలిపింది. కేవలం ప్యాకేజింగ్, లాజిస్టిక్ విభాగాల్లోనే కాదు ఇతర విభాగాల్లోనూ ఉద్యోగాలను కల్పించనున్నట్లు అమెజాన్ వెల్లడించింది.
చిరు వ్యాపారులకు అండగా అమెజాన్..
2030 నాటికి అమెజాన్ వినియోగదారులకే కాదు చిరు వ్యాపారులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుత ఏఐ జమానాలో ప్రతి ఒక్కరికి దీన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెబుతోంది. 15 మిలియన్ల చిరు వ్యాపారులకు AI ప్రయోజనాలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అమెజాన్ తెలిపింది. ఇప్పటికే Amazon.in ద్వారా సెల్లర్ అసిస్టెంట్, నెక్స్ట్ జెన్ సెల్లింగ్ వంటి సేవలను పొందుతున్నారని తెలిపారు.
చదువులేని వ్యాపారులు, వినియోగదారులకు కూడా అమెజాన్ అండగా నిలుస్తోందని.. వారికోసం ప్రత్యేక AI టెక్నాలజీని తీసుకువస్తున్నామని తెలిపింది. తద్వారా తమ వ్యాపారాన్ని మరింత పెంచుకుని లాభపడేలా చూస్తామంటోంది. అమెజాన్ లెన్స్, రూఫస్ వంటి ఏఐ షాపింగ్ అసిస్టెంట్స్ ని తీసుకువచ్చింది.
ఈ మూడు రంగాలపైనే అమెజాన్ దృష్టి
అమెజాన్ 35 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ముఖ్యంగా మూడు రంగాలపై దృష్టి పెడుతోంది.
AI-ఆధారిత డిజిటలైజేషన్ : చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు AI టూల్స్ ప్రయోజనాలను అందించడం.
ఈ-కామర్స్ ఎగుమతులను పెంచడం : భారతదేశం నుండి గ్లోబల్ మార్కెట్‌కు $80 బిలియన్ల వరకు ఎగుమతులు.
కొత్త ఉద్యోగాల సృష్టి : 1 మిలియన్ ప్రత్యక్ష, పరోక్ష, ప్రేరేపిత, సీజనల్ ఉద్యోగాలు.
అమెజాన్ 'AI-ఫర్-ఆల్' విజన్ భారత డిజిటల్ విద్యను మారుస్తుందా?
అమెజాన్ AI నిబద్ధత భారతదేశవ్యాప్తంగా విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, కస్టమర్లకు AI ప్రయోజనాలను అందిస్తుంది.
15 మిలియన్ల చిన్న వ్యాపారాలు AI టూల్స్‌తో సన్నద్ధమవుతాయి.
4 మిలియన్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు AI విద్య, కెరీర్ అన్వేషణ అవకాశాలు లభిస్తాయి.
బహుభాషా అనుభవం, విజువల్ డిస్కవరీతో కోట్ల మంది షాపర్ల షాపింగ్ అనుభవం మెరుగుపడుతుంది.
దీనివల్ల డిజిటల్ అక్షరాస్యత పెరుగుతుంది, జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యాలు నెరవేరుతాయి.

