Home Loan: హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ కొనాలంటే.. నెలకు ఎంత జీతం రావాలి.?
Home Loan: సొంతిల్లు అందరి కల. ప్రస్తుతం అపార్ట్‌మెంటుల్లో ఫ్లాట్స్ కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. బ్యాంకులు సైతం సులభంగా లోన్స్ ఇస్తున్నాయి. మరి హైదరాబాద్ లో అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయాలంటే మీకు ఎంత జీతం రావాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నగరంలో ధరలు ఎలా ఉన్నాయి.?
ప్రస్తుతం హైదరాబాద్‌లో అపార్ట్‌మెంట్ ధరలు భారీగా పెరిగాయి. ఇండిపెండెంట్ హౌజ్‌లకు పోటీగా ఫ్లాట్‌ల ధరలు సైతం పెరుగుతున్నాయి. నగర శివారుల్లో డబుల్ బెడ్ రూమ్ కొనుగోలు చేయాలన్నా తక్కువలో తక్కువ రూ. 40 నుంచి రూ. 50 లక్షలు చెల్లించాల్సిందే. అయితే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో సెకండ్ హ్యాండ్ ఫ్టాట్స్ మాత్రం రూ. 30 నుంచి రూ. 35 లక్షల్లో కూడా లభిస్తున్నాయి. ఫ్లాట్ కొనుగోలు చేయాలంటే కచ్చితంగా మీ దగ్గర కొంత మొత్తంలో డౌన్‌పేమెంట్ ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
EMI కాలిక్యులేటర్ ఉపయోగించడం ఎలా?
మొదటగా హోం లోన్ ఎంత వస్తుంది, EMI ఎంత ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకోవడానికి EMI కాలిక్యులేటర్‌ను ఉపయోగించడం మంచిది. గూగుల్‌లో “Loan EMI Calculator” లేదా “Home Loan EMI Calculator” అని సెర్చ్ చేస్తే చాలా ఉచిత టూల్స్ కనిపిస్తాయి. అందులో లోన్ మొత్తం, వడ్డీ రేటు, లోన్ కాలం (Tenure) వంటి వివరాలు అందిస్తే సరిపోతుంది. ఈ వివరాల ఆధారంగా ప్రతి నెల ఎంత EMI చెల్లించాలో సులభంగా తెలుస్తుంది.
జీతంలో ఎంత శాతం EMIకి వెళ్తుంది?
బ్యాంకులు సాధారణంగా ఒక నియమం పాటిస్తాయి. మీ నెల జీతంలో నుంచి ముందుగా కొన్ని ఖర్చులు తీసివేస్తారు. ఉదాహరణకు PF లేదా NPS కట్టే డబ్బు, TDS (ఇంకమ్ టాక్స్), ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇలాంటి తప్పనిసరి ఖర్చులు తీసివేసిన తర్వాత జీతంలో సుమారు 40% ఖర్చులకు వెళ్తుంది అని భావిస్తారు. మిగిలిన 60% వరకు EMI చెల్లించగల సామర్థ్యం ఉందని బ్యాంకులు చూస్తాయి.
రూ. 30 లక్షల హోం లోన్‌కు EMI ఎంత ఉంటుంది?
ఉదాహరణకు మీరు రూ. 30 లక్షల లోన్ కోసం సెర్చ్ చేస్తున్నారని అనుకుందాం. మీ మొత్తం లోన్ మొత్తం రూ. 30 లక్షలు, వడ్డీ రేటు 9%తో 20 ఏళ్ల టెన్యూర్‌తో లోన్ తీసుకుంటే మీ నెలవారీ EMI సుమారు రూ. 27,000 – రూ. 28,000 మధ్య ఉంటుంది. లోన్ కాలాన్ని 25 లేదా 30 సంవత్సరాలకు పెంచితే EMI కొంచెం తగ్గుతుంది. కానీ మొత్తం వడ్డీ మాత్రం ఎక్కువ అవుతుంది.
EMI ఆధారంగా ఎంత జీతం అవసరం.?
బ్యాంకు నియమం ప్రకారం జీతంలో 60% వరకు EMI చెల్లించవచ్చు. పైన తెలిపిన ఉదాహరణలో మీరు రూ. 27,000 ఈఎమ్ఐ చెల్లిస్తున్నారని అనుకుందాం. అంటే మీ మొత్తం జీతం సుమారు రూ. 45,000 – రూ. 50,000 ఉండాలి. అయితే ఇది లోన్‌ను మరింత సులభంగా రీపేమెంట్ చేయాలంటే మీకు కనీసం నెలకు రూ. 50 నుంచి రూ. 60 వేల జీతం ఉండాలి.
వడ్డీ రేట్లు ఎలా నిర్ణయిస్తారు?
బ్యాంకులు సాధారణంగా MCLR (Marginal Cost of Lending Rate) అనే ప్రమాణం ఆధారంగా వడ్డీ నిర్ణయిస్తాయి. ఉదాహరణకు MCLR 8%గా ఉంటే బ్యాంక్ మార్జిన్ = 1% అంటే మొత్తం వడ్డీ రేటు 9% అవుతుంది. ఒక్కో బ్యాంకులో వడ్డీ రేట్లు ఒక్కోలా ఉంటాయి. కాబట్టి లోన్ తీసుకునే ముందు మీకు నచ్చిన బ్యాంకుకు నేరుగా వెళ్లి సంప్రదించడం మంచిది.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేలవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడమే మంచిది.

