బంగారం ధర తగ్గింది.. ఇప్పుడే కొనాలా వద్దా?
Gold: వెండి, బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే, పెట్టుబడిదారులు, సామాన్యులు కోనుగోలు విషయంలో ఎలా వ్యవహరించాలి అనే అంశంపై నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. పెట్టుబడిదారుల వ్యూహం ఏంటి?
బంగారం ధరల్లో తాజాగా స్వల్పంగా తగ్గుదల నమోదైంది. పండుగ సీజన్ తరువాత వచ్చిన ఈ ధరల మార్పు పెట్టుబడిదారులలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒక నెల క్రితం బంగారం ధర 10 గ్రాములకు రూ.1,32,294 రికార్డ్ స్థాయికి చేరింది. అయితే నవంబర్ 17 ఉదయం 9 గంటలకు MCXలో బంగారం ధర 6.88 శాతం తగ్గి రూ.1,23,180 వద్ద ట్రేడ్ అయ్యింది. గత రోజు ధరతో పోలిస్తే 0.3 శాతం తగ్గుదల నమోదైంది. అలాగే, మంగళవారం కూడా స్వల్ప తగ్గుదల నమోదైంది.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌కు చెందిన ప్రెషియస్ మెటల్ విశ్లేషకుడు మనవ్ మోదీ మనీ కంట్రోల్ తో మాట్లాడుతూ.. “ఈ సంవత్సరంలో ధరలు ఇప్పటికే 60–70 శాతం పెరిగాయి. కాబట్టి కొంత మోస్తరు కూలింగ్ ఆఫ్, లాభాల వసూలు సహజమే” అని అన్నారు.
ఆయన పెట్టుబడిదారుల కోసం స్పష్టమైన సూచన ఇస్తూ.. భారీ పెరుగుదల వచ్చినప్పుడు లాభాలు బుక్ చేయాలి, తగ్గుదల వచ్చినప్పుడు కొనుగోలు చేయాలి. దీర్ఘకాలికంగా బంగారం బుల్లిష్ పంథాలో కొనసాగుతుందని” ఆయన అభిప్రాయపడ్డారు.
ఫెడ్ రేట్ల కోత – బంగారం, వెండి ధరల పరిస్థితి ఏంటి?
అక్టోబర్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 3.75–4 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒత్తిడి వల్ల వచ్చిందనే అభిప్రాయం మార్కెట్లలో మొదట వినిపించింది. ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ మాత్రం ద్రవ్యోల్బణ ప్రమాదాలు ఇంకా ఉన్నాయి అని, టారిఫ్ ప్రభావం, ప్రభుత్వ షట్‌డౌన్ తర్వాతి పరిస్థితులు ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని కొనసాగిస్తున్నాయని తెలిపారు.
డిసెంబర్ రేటు కోత అవకాశాలు 90 శాతం నుంచి 50 శాతానికి పడిపోయాయి. ఈ అనిశ్చితి బంగారం, వెండి ధరల పెరుగుదలను స్వల్పకాలంలో నియంత్రించింది. మనవ్ మోదీ మాట్లాడుతూ.. “లేబర్ మార్కెట్లో బలహీనత కనబడే వరకు పూర్తి ఈజింగ్ సైకిల్‌కు ఫెడ్ వెళ్లే అవకాశం లేదు” అని అన్నారు.
దేశీయంగా డాలర్-రూపాయి మారకం రేటు 90కు సమీపంగా ఉంటే, రూ.1,18,000 నుంచి రూ.1,20,000 ధరలు బంగారానికి బలమైన సపోర్ట్ జోన్ అవుతాయని చెప్పారు. ఈ స్థాయి నిలకడగా ఉంటే, వచ్చే ఏడాదిలో రూ.1,30,000 నుంచి రూ.1,37,000 వరకు పెరుగుదల అవకాశముందని ఆయన అంచనా వేశారు.
కేంద్ర బ్యాంకులు బంగారం ఏందుకు కొనుగోలు చేస్తున్నాయి?
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం, 2025 మూడో త్రైమాసికంలో ప్రపంచ కేంద్ర బ్యాంకులు కలిపి 220 టన్నుల బంగారం కొనుగోలు చేశాయి. ఇది గత త్రైమాసికంతో పోలిస్తే 28 శాతం అధికం.
భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ 2025 వరకు మరో 600 కిలోల బంగారం కొనుగోలు చేసింది. దీంతో భారత బంగారం నిల్వలు సుమారు 880 టన్నులకు చేరాయి.
మనవ్ మోదీ ప్రకారం, ఈ కొనుగోళ్లు బంగారం దీర్ఘకాల రక్షణ విలువను చూపిస్తున్నాయి. గ్లోబల్ అనిశ్చితి పెరుగుతున్న సమయంలో బంగారం కేంద్ర బ్యాంకుల కోసం వ్యూహాత్మక రక్షణ సాధనంగా మారుతోంది. ఈ డిమాండ్ గ్లోబల్ ధరలకు స్థిరత్వాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు.
వెండిపై పరిశ్రమ డిమాండ్ ఎలా ప్రభావం చూపుతోంది?
ఈ ఏడాది వెండి ధరలు బంగారాన్ని మించిపోయాయి. కారణం సేఫ్ హేవెన్ ఆస్తిగా ఉండడమే కాకుండా దాని పరిశ్రమ వినియోగం కూడా పెరగడం.
ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ప్యానెల్స్, క్లీన్ ఎనర్జీ రంగంలో అమెరికా, చైనా, భారతదేశం వేగంగా పెట్టుబడులు పెంచుతున్నాయి. ఈ మార్పులు వెండి పరిశ్రమ వినియోగాన్ని పెంచుతున్నాయి.
మోదీ మాట్లాడుతూ, “సప్లై సమస్యలు ఉన్నప్పటికీ, తీవ్ర కొరతలో కొంత ఉపశమనం కనిపిస్తోంది. పరిశ్రమ డిమాండ్, ETF పెట్టుబడులు కలిపి వెండి ధరకే బలాన్ని ఇస్తున్నాయి” అని అన్నారు.
గోల్డ్, సిల్వర్ ETFs – పెట్టుబడిదారులకు సరైన ఎంపికేనా?
భారతదేశంలో గోల్డ్ ETF ఆస్తుల విలువ రూ.1 లక్ష కోట్లు చేరుకుంది. సిల్వర్ ETFలు రూ.35,000 కోట్లకు చేరువలో ఉన్నాయి. ఇది పెట్టుబడిదారుల నమ్మకం పెరుగుతోందని సూచిస్తోంది.
మనవ్ మోదీ మాట్లాడుతూ.. 1 సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ పెట్టుబడి గడువు ఉంటే ETFs మంచి ఎంపిక.
అవి పారదర్శకంగా, లిక్విడ్‌గా, తక్కువ ఖర్చుతో ఉంటాయని అన్నారు. ప్రస్తుత అస్థిర గ్లోబల్ పరిస్థితుల్లో పోర్ట్‌ఫోలియోలో కొంత శాతం బంగారం లేదా వెండి ETFలు ఉంచడం మంచి డైవర్సిఫికేషన్ వ్యూహమని ఆయన పేర్కొన్నారు.

