ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన 5 ఫోన్లు ఇవే
World Top Five Best Selling Phones: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన 5 ఫోన్ల జాబితా విడుదలైంది. నోకియా 1100 నుంచి ఐఫోన్ 11 వరకు కోట్ల యూనిట్లు అమ్ముడై రికార్డులు సృష్టించాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ప్రపంచంలో రికార్డులు అమ్మకాలు సాధించిన ఫోన్లు
ప్రపంచ మొబైల్ మార్కెట్‌లోకి ప్రతి రోజూ కొత్త ఫోన్లు వస్తూనే ఉన్నాయి. వందలాది మోడళ్లు వస్తుంటాయి. కానీ కొద్ది ఫోన్లు మాత్రమే చరిత్రలో నిలిచిపోతాయి. కోట్ల సంఖ్యలో అమ్ముడై ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలుస్తాయి.
HowStuffWorks నివేదికలో ప్రపంచంలో ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడైన ఐదు ఫోన్ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ జాబితాలో ఉన్న తొలి ఫోన్‌ను Gen-Z తరానికి చెందిన చాలా మంది చూసి ఉండకపోవచ్చు. ఆ వివరాలు గమనిస్తే..
25 కోట్ల యూనిట్లు అమ్ముడైన Nokia 1100
2003లో నోకియా 1100 మార్కెట్‌లోకి వచ్చింది. ఈ మోడల్ ప్రపంచంలో ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా నిలిచింది. ఈ ఫోన్ 25 కోట్లకు పైగా యూనిట్లు అమ్ముడైంది. దాని బలమైన నిర్మాణం ప్రధాన కారణం.
పడిపోయినా, నీళ్లు పడినా పనిచేయగల సామర్థ్యం ఉండేది. టార్చ్, మెసేజ్ పంపే ఆప్షన్ వంటి సింపుల్ ఫీచర్లతో ఇది ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి ప్రాంతాల్లో లక్షల మందికి తొలి మొబైల్‌గా నిలిచింది.
22 కోట్ల యూనిట్లు అమ్ముడైన iPhone 6, 6 Plus
2014లో యాపిల్ తన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ సిరీస్‌ను విడుదల చేసింది. ఆపిల్ ఈ సిరీస్ ను ప్రపంచవ్యాప్తంగా 22 కోట్లకుపైగా యూనిట్లు అమ్మింది.
యాపిల్ తొలిసారి పెద్ద స్క్రీన్‌తో ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీంతో ముఖ్యంగా ధనిక దేశాల యువత ఈ మోడల్‌ను భారీగా కొనుగోలు చేసింది.
3. నోకియా 1110
బడ్జెట్ మార్కెట్‌లో హిట్ పెంచిన ఫోన్. నోకియా 1110 కూడా అత్యధిక అమ్మకాలు సాధించిన మోడళ్లలో ఒకటి.
ఇది ప్రధానంగా చవకైన ఫోన్లు ఎక్కువగా కోరుకునే దేశాల్లో భారీగా అమ్ముడైంది. ఈ ఫోన్‌లో కెమెరా లేదా ఇంటర్నెట్ లేకపోయినా, దీర్ఘకాల బ్యాటరీ బ్యాకప్ దాన్ని రోజువారీ ఉపయోగానికి అనువుగా మార్చింది.
ఐఫోన్ 11, శాంసంగ్ గెలాక్సీ S4
2019లో వచ్చిన ఐఫోన్ 11 ప్రపంచవ్యాప్తంగా మంచి విక్రయాలు సాధించింది. ఉత్తర అమెరికా, యూరప్, భారత్‌లో ఈ మోడల్‌కు విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఫేస్ ఐడీ, శక్తివంతమైన చిప్, మెరుగైన కెమెరా వంటి ఫీచర్లతో ఈ ఫోన్ అత్యధిక అమ్మకాలు సాధించింది.
అలాగే, శాంసంగ్ గెలాక్సీ S4 మాత్రం ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడైన ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ఫోన్‌గా రికార్డు సృష్టించింది. 2013లో మార్కెట్‌లోకి వచ్చిన ఈ ఫోన్ 8 కోట్ల యూనిట్లను శాంసంగ్ అమ్మింది. AMOLED డిస్‌ప్లే, కొత్త సాఫ్ట్‌వేర్ ఫీచర్లు సామ్‌సంగ్‌కు ప్రపంచ మార్కెట్‌లో బలాన్ని తెచ్చిపెట్టాయి.