Gold Price: గోల్డెన్ న్యూస్.. తులం బంగారం రూ. 55 వేలు..
ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తుంది. తులం బంగారం ధర రూ. లక్ష దాటడం ఖాయమని అంతా భావించారు. అందుకు అనుగుణంగా పసిడి ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. అయితే తాజాగా బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే ఈ తగ్గుదుల ఇంకా కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. త్వరలోనే తులం బంగారం ధర రూ. 55 వేలకు చేరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ బంగారం ఇంతలా తగ్గుముఖం పట్టడానికి కారణం ఏంటి.? నిపుణులు ఏమంటున్నారు.? ఇప్పుడు తెలుసుకుందాం..

Gold
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలి పోయాయి. పెట్టుబడిదారుల భయాందోళనతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యింది. అయితే సహజంగా స్టాక్ మార్కెట్లు నస్టాన్ని చవి చూసినప్పుడు బంగారం ధరలు పెరగాలి. కానీ ప్రస్తుతం పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. కేవలం స్టాక్ మార్కెట్లు మాత్రమే కాకుండా పెట్టుబడి దారులు బంగారం నుంచి సైతం తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడం వల్ల పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు అంచనా వేస్తున్నారు.
తాజాగా అమెరికాలో ఒక ఔన్స్ (31.2 గ్రాములు) 35 డాలర్లు తగ్గి 3000 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్‌లోనూ బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. భారత్ విషయానికొస్తే మంగళవారం ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 82,990 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,370 వద్ద కొనసాగుతోంది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 82,840గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 90,370 వద్ద కొనసాగుతోంది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖలో ఈ రోజు 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 82,840గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 90,370 వద్ద కొనసాగుతోంది.
తులం బంగారం రూ. 55 వేలు..
ఇదిలా ఉంటే బంగారం ధరల పతనం మరింత కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో తులం బంగారం ధర రూ. 55 వేలకు దిగిరావడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ బంగారం ధర ఇంతలా తగ్గడానికి కారణాలు ఏమై ఉంటాయి.? నిపుణుల అభిప్రాయం ఏంటి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
* అమెరికాకు చెందిన ట్రేడు డాట్ కామ్ సీనియర్ ఎనలిస్ట్ నికోస్ టజాబౌరాస్ మాట్లాడుతూ ఇన్వెస్టర్లు బంగారం కన్నా కూడా స్విట్జర్లాండ్ ఫ్రాంక్, జపనీస్ యెన్ వంటి కరెన్సీల పైన పెట్టుబడి పెడుతున్నారు. ఇది కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక కారణమని తెలిపారు.
* అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ నాటికల్లా 120 పాయింట్ల మీద వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే మే నెలలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి దీంతో బంగారం ధర మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది.
* ఈక్విటీ మార్కెట్, ఇతర ఆస్తుల తరగతులలో అమ్మకాలు కొనసాగుతున్నందున బంగారం ధర సోమవారం పడిపోయిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌లో కమోడిటీస్ సీనియర్ ఎనలిస్ట్ సౌమిల్ గాంధీ అభిప్రాయపడ్డారు.
* మార్నింగ్ స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్ బంగారం ధర 38 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. ఔన్స్ బంగారంపై 2 వేల డాలర్ల వరకు తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
* 2029 నాటికి ఔన్స్ బంగారం 1820 డాలర్లకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2025-2027 సమయంలో సగటు బంగారం ధర ఔన్సుకు 3170 డాలర్లుగా అంచనా వేశారు.
* బంగారం ధర భారీగా పెరగడంతో మైనింగ్ కంపెనీలు పెద్ద ఎత్తున మైనింగ్ చేశాయి. దీంతో మార్కెట్లో అవసరానికి మించిన బంగారం లభించింది. ఈ కారణంగానే బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని అబిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
* బంగారంపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య ఎక్కువ రోజులు కొనసాగదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గే అవకాశం ఉందని నిపుణులు అనుకుంటున్నారు.
* ప్రస్తుతం బంగారం ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని, ఇదే పీక్ స్టేజ్ అని ఇకపై ధరలు తగ్గడం తప్ప పెరగడం ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.