CoinDCX: ఒక్క దెబ్బకు రూ. 378 కోట్లు ఫట్.. పెట్టుబడి పెట్టిన వారి పరిస్థితి ఏంటి.?
మారుతోన్న టెక్నాలజీతో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి. రకరకాల మార్గాల్లో సైబర్ నేరస్థులు కోట్లు కొల్లగొడుతున్నారు. తాజాగా ఇలాంటి ఓ భారీ దోపిడి వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..

రూ. 378 కోట్లు ఫట్
భారతదేశానికి చెందిన ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజ్ CoinDCX తాజాగా భారీ సైబర్ దాడికి గురైంది. ఈ ఘటనలో దాదాపు రూ.378 కోట్లు (అంటే $44 మిలియన్లు) నష్టం జరిగింది. జూలై 19 తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఒక అధికారిక హ్యాకింగ్ జరిగిందని కంపెనీ తెలిపింది.
పెట్టుబడి దారుల పరిస్థితి ఏంటి.?
ఈ క్రిప్టోలో పెట్టుబడి పెట్టిన వారి సొమ్ము సురక్షితంగా ఉందని CoinDCX కంపెనీ తెలిపింది. "ఇది కేవలం మా అంతర్గత ఖాతాలను టార్గెట్ చేసిన దాడి. వినియోగదారుల ఫండ్లు ఉన్న వాలెట్‌లకు ఎటువంటి హాని జరగలేదు. మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు" అని సీఈఓ సుమిత్ గుప్తా సోషల్ మీడియాలో తెలిపారు.
17 గంటల తర్వాత వెలుగులోకి
ఈ ఘటనను తొలుత బ్లాక్‌చైన్ విశ్లేషకుడు ZachXBT గుర్తించారు. CoinDCX 17 గంటల తర్వాత దీనిని అధికారికంగా ప్రకటించింది. దీంతో కంపెనీపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ వినియోగదారుల డబ్బును రక్షించడానికి కంపెనీ తీసుకున్న చర్యలను చాలామంది ప్రశంసిస్తున్నారు.
సేవల్లో అంతరాయం
హ్యాక్ తరువాత వినియోగదారులు పెద్ద ఎత్తున తమ డబ్బును విత్‌డ్రా చేసేందుకు ప్రయత్నించారు. దీని వల్ల CoinDCX పోర్ట్‌ఫోలియో APIలు కొంతసేపు సరిగా పనిచేయలేదు. బ్యాలెన్స్‌లు, లావాదేవీ వివరాలు చూపించకపోవడం వల్ల వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది. తర్వాత కంపెనీ API లను రీసెట్ చేసి, సేవల్ని పునఃప్రారంభించింది.
భద్రతా సంస్థల సహాయంతో దర్యాప్తు
CoinDCX ఈ హ్యాకింగ్‌ను CERT-In (భారత ప్రభుత్వ ఐటీ విభాగం)కి అధికారికంగా నివేదించింది. ఈ కేసుపై ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి సైబర్ భద్రతా సంస్థల సహకారంతో ఫోరెన్సిక్ విచారణ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు 2024లో వజీరెక్స్‌లో ఏకంగా రూ. 1965 కోట్ల స్కామ్ జరిగింది. ఇలాంటి సంఘటనలు భారత క్రిప్టో మార్కెట్‌లో భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.