- Home
- Andhra Pradesh
- TTD: తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. పెరిగిన వీఐపీ బ్రేక్ దర్శనాల కోట. ఈ అవకాశం ఎవరికంటే..
TTD: తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. పెరిగిన వీఐపీ బ్రేక్ దర్శనాల కోట. ఈ అవకాశం ఎవరికంటే..
తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రవాసాంధ్రుల కోసం టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.

వీఐపీ బ్రేక్ దర్శనాల కోటా పెంపు
విదేశాల్లో ఉంటున్న ఆంధ్రుల కోసం తిరుమల శ్రీవారి దర్శనంలో భారీ సౌకర్యం కల్పిస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ప్రవాసాంధ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై స్పందించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం విదేశాల్లో ఉంటున్న వారికి మాత్రమే కాకుండా భారత్‌లో ఉంటున్న వారి కుటుంబ సభ్యులకు ఇది ఉపయోగపడనుంది.
గతంలో 10 ఇప్పుడు..
ఇంతవరకు విదేశాల నుంచి వచ్చే ఆంధ్రులకు రోజుకి కేవలం 10 వీఐపీ బ్రేక్ దర్శనాల అవకాశమే ఇచ్చేవారు. తాజాగా ఈ కోటాను ఏకంగా 100కు పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు ప్రతి రోజు వందమంది ప్రవాసాంధ్రులు ప్రత్యేక దర్శనం చేసుకునే అవకాశాన్ని పొందనున్నారు.
గతంలో తగ్గిన కోటా
నిజానికి ప్రవాసాంధ్రులకు వీఐపీ బ్రేక్ దర్శనాల్లో మొదట 50 టికెట్ల కోటా ఉండేది. కానీ గత ప్రభుత్వ కాలంలో దీనిని కేవలం 10కి పరిమితం చేశారు. ఈ నిర్ణయం కారణంగా విదేశాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవాసాంధ్రుల వినతిని పరిశీలించి, వారి కోసం తిరిగి కోటా పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు.
టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే.?
ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ అధ్యక్షుడు రవి వేమూరి నేతృత్వంలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబుకు ప్రవాసాంధ్రుల సమస్యలు వివరించారు. ఫిబ్రవరిలో జరిగిన ఈ చర్చలో సీఎం స్పందించి, టీటీడీకి రోజూ వంద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు కేటాయించాలన్న ఆదేశాలు జారీ చేశారు.
ఇక వీఐపీ బ్రేక్ దర్శనం కావాలనుకునే ప్రవాసాంధ్రులు ముందుగా https://apnrts.ap.gov.in/ అనే వెబ్‌సైట్ ద్వారా సభ్యత్వం నమోదు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో వీసా లేదా వర్క్ పర్మిట్ వంటి డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. అనంతరం మూడు నెలలలో అందుబాటులో ఉన్న స్లాట్లు కనిపిస్తాయి. అభ్యర్థులు తమకు అనుకూలమైన తేదీని ఎంచుకుని టికెట్ బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుకింగ్ చేసిన తర్వాత ఏపీఎన్ఆర్టీకి చెందిన పీఆర్వోను సంప్రదించి, వీఐపీ బ్రేక్ దర్శనానికి అనుమతి పొందవచ్చు.
తిరుమలలో గరుడ పంచమి వేడుకలు
ఇదిలా ఉంటే ఈ నెల 29వ తేదీన మంగళవారం గరుడ పంచమి వేడుకలు తిరుమలలో ఘనంగా జరగనున్నాయి. రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య శ్రీ మలయప్పస్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెలలో ఇది రెండవ గరుడ వాహన సేవ కావడం విశేషం. ఈ పర్వదినాన వివాహితులు తమ కుటుంబ క్షేమం కోసం పూజలు చేస్తారు.