CJ Roy Net Worth : రియల్ ఎస్టేట్ టైకూన్ సిజె రాయ్ నెట్ వర్త్ ఎంతో తెలుసా..?
కాన్ఫిడెంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ సి.జె. రాయ్ ఇండియాలో అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఈయన భారత్, యూఏఈ, అమెరికాలో వ్యాపారాలు చేస్తున్నారు. రాయ్ భారీ రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ సామ్రాజ్యాన్ని నిర్మించారు.

రియల్ ఎస్టేట్ టైకూన్ జిజె రాయ్ సూసైడ్
CJ Roy Net Worth : ప్రముఖ వ్యాపారవేత్త, కాన్ఫిడెంట్ గ్రూప్ ఛైర్మన్ డా. సి.జె. రాయ్ (57) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బెంగళూరులోని కాన్ఫిడెంట్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో ఆయన తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. ఆఫీసులోని సిబ్బంది ఆయనను దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించినా పలితంలేకుండా పోయింది… అప్పటికే ఆయన ఆయన ప్రాణాలు వదిలారు.
గత నెల రోజులనుండి సీజె రాయ్ కు చెందిన సంస్థలపై వరుస ఐటీ దాడులు జరుగుతున్నాయి. దీంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు... ఇదే సమయంలో కేరళకు చెందిన ఐటీ అధికారులు బెంగళూరు కార్యాలయంలో సోదాలు చేపట్టారు. గత మూడు రోజులుగా ఈ సోదాలు కొనసాగుతున్నాయి... దీంతో మరింత ఒత్తిడికి గురయిన సిజె రాయ్ కార్యాలయంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే ఐటీ దాడులు, ఆత్మహత్య నేపథ్యంలో సిజె రాయ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఆయన వ్యాపారాలు, ఆస్తిపాస్తులు, వ్యక్తిగత వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
సిజె రాయ్ వ్యక్తిగత జీవితం...
సిజె రాయ్ అసలుపేరు చిరియాంకండత్ జోసెఫ్ రాయ్… ఆయన స్వరాష్ట్రం కేరళ. రాయ్ ప్రాథమిక విద్యాభ్యాసం స్థానికంగానే సాగినా ఉన్నత విద్యాభ్యాసం మాత్రం ప్రాన్స్, స్విట్జర్లాండ్ దేశాల్లో సాగింది. చదువు పూర్తిచేసుకుని ఇండియాకు తిరిగివచ్చి పలు కంపెనీలు ఉద్యోగాలు చేశారు. 2006 లో కాన్ఫిడెంట్ గ్రూప్ ను స్థాపించారు. ఇలా మొదట రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన రాయ్ తర్వాత హాస్పిటాలిటీ, ఏవియేషన్, వినోద రంగాల్లో ప్రవేశించారు. అన్నిరంగాల్లో సక్సెస్ సాధించి దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల సరసన చేరారు.
సిజె రాయ్ ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ఆయన భార్య లిని రాయ్. వీరికి ఇద్దరు సంతానం... రోహిత్, రియా. ప్రస్తుతం భార్యాపిల్లలు విదేశాల్లో ఉండగా వ్యాపార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న రాయ్ బెంగళూరులో ఒంటరిగా ఉంటున్నారు.
సిజె రాయ్ వ్యాపార సామ్రాజ్యం...
సిజె రాయ్ కి చెందిన కాన్ఫిడెంట్ గ్రూప్ భారత్ లోనే కాదు యూఏఈ, అమెరికాలో కార్యకలాపాలు సాగిస్తోంది. ఇక్కడ కర్ణాటక, కేరళలో ఈ సంస్థ వ్యాపార కార్యకలాపాలు సాగిస్తోంది.
కాన్ఫిడెంట్ గ్రూప్ 150కి పైగా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను పూర్తి చేసింది. బెంగళూరు సమీపంలోని జియాన్ హిల్స్ గోల్ఫ్ కౌంటీ ప్రాజెక్ట్ ను ఈ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది... దీని విలువ సుమారు రూ.3,000 కోట్లు. ఈ గ్రూప్ "జీరో-డెట్" వ్యాపార నమూనాను అనుసరించింది.
ఈ సంస్థ ఎంటర్టైన్మెంట్ వ్యాపారంలో కూడా కొనసాగుతోంది. కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా సిజె రాయ్ వ్యవహరించారు. ఇక బిగ్ బాస్ (కన్నడ) రియాలిటీ షో టైటిల్ స్పాన్సర్ గా కూడా వ్యవహరించింది కాన్ఫిడెంట్ గ్రూప్.
సిజె రాయ్ నెట్ వర్త్ ఎంత..?
ఫోర్బ్స్ లేదా బ్లూమ్‌బెర్గ్ వంటి సంస్థల నుంచి సీజే రాయ్ నికర విలువపై అధికారిక ధృవీకరణ లేదు. కానీ ఆయన వ్యాపారాలు, ఆస్తుల ఆధారంగా ఆయన ఇండియన్ బిలియనీర్స్ లో ఒకరిగా పేర్కొనవచ్చు. ఆయన నెట్ వర్త్ $1 బిలియన్‌కు పైగా ఉంటుందని అంచనా... అంటే ఇండియన్ రూపాయల్లో వేల కోట్లు అన్నమాట.
విలాసవంతమైన జీవితం...
సీజే రాయ్ విలాసవంతమైన జీవనశైలికి ప్రసిద్ధి. ఆయనవద్ద ఖరీదైన రోల్స్ రాయిస్ కార్లు 12 ఉన్నట్లు సమాచారం. ఇక బెంట్లీ, లంబోర్ఘిని, బుగాట్టి వంటి మరికొన్ని లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. గల్ఫ్‌స్ట్రీమ్ G650 ప్రైవేట్ జెట్, విలాసవంతమైన ఇళ్లు, ఆర్ట్ కలెక్షన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తన లగ్జరీ జీవితానికి సంబంధించిన ఫోటోలను తరచూ సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టేవారు రాయ్.
డాక్టర్ రాయ్ తరచూ తన జీవితం ఎంత సాధారణంగా ప్రారంభమయ్యిందో చెప్పేవారు. వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడానికి ముందు వివిధ సంస్థల్లో చేసిన చిన్నచిన్న ఉద్యోగాల గురించి చెప్పేవారు. ఆయన ప్రయాణం యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకం. కానీ ఆయన మరణం వ్యాపార వర్గాల్లో, ఉద్యోగులు, పెట్టుబడిదారులలో ప్రకంపనలు సృష్టించింది.

