Business Ideas: మీ మేడపై ఖాళీ స్థలం ఉందా.? ఇలా చేస్తే నెలకు లక్ష సంపాదించొచ్చు
Business Ideas: వ్యాపారం అంటే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాలి, ఇంటి నుంచి దూరంగా వెళ్లాలి అనే ఆలోచనలో ఉంటాం. అయితే సరైన ప్లానింగ్ ఉంటే ఇల్లు కదలకుండా కూడా లక్షల్లో ఆదాయం పొందొచ్చు. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం

మేడపై ఖాళీ ప్రదేశాన్ని ఉపయోగించుకుంటే..
సాధారణంగా ఇళ్ల మేడపై ఉండే ఖాళీ స్థలాన్ని చాలామంది పట్టించుకోరు. మహా అయితే చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటారు, లేదంటే పాత వస్తువులను పడేస్తుంటారు. అయితే ఇదే ప్రదేశాన్ని చిన్న వ్యాపారం కోసం ఉపయోగిస్తే అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా నగరాల్లో భూమి కొరత ఉన్నప్పుడు టెర్రస్ ఫిష్ ఫార్మింగ్ మంచి ప్రత్యామ్నాయం అవుతుంది. మేడపై తొట్టెల్లో చేపల పెంపకం చేపడితే ఇంట్లోనే ఉండి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది యువకులు, రైతులు కూడా ఈ విధానాన్ని ప్రయత్నిస్తున్నారు.
మేడపై చేపల పెంపకం ఎలా చేయాలి?
మేడపై ఫిష్ ఫార్మింగ్ చేయాలంటే ముందుగా ఫైబర్ లేదా సిమెంట్‌తో తయారు చేసిన నీటి తొట్టెలను ఏర్పాటు చేయాలి. వాటిలో శుభ్రమైన నీటిని నింపి చేప పిల్లలను వదలాలి. ఈ విధంగా చేపలను పెంచడం చాలా సులభం. రోజూ కొద్దిగా ఫుడ్ వేయడం, నీటి నాణ్యతను చూసుకుంటే సరిపోతుంది. మేడపై స్థలం చిన్నదైనా 4–5 తొట్టెలు పెట్టుకుని ప్రారంభించవచ్చు.
కొర్రమీను పెంపకం ఎందుకు లాభదాయకం?
చేపల పెంపకంలో ముఖ్యంగా కొర్రమీను (Murrel fish) పెంచడం మంచి లాభం ఇస్తుంది. ఈ చేపకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం కొర్రమీను కిలో ధర సుమారు రూ.400 వరకు ఉంది. హోటళ్లు, మార్కెట్లు, సంతల్లో ఈ చేపకు మంచి కొనుగోలు ఉంటుంది. అందుకే ఈ చేపల పెంపకం లాభదాయకమైన వ్యాపారంగా భావిస్తున్నారు.
పెట్టుబడి, బ్యాంకు రుణాలు ఎలా ఉంటాయి?
ఈ వ్యాపారం ప్రారంభించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. ఒక అంచనా ప్రకారం 4–5 నీటి తొట్టెలు ఏర్పాటు చేయడానికి సుమారు రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. చేప పిల్లలు కొనుగోలు చేయడం, ఫీడ్ ఖర్చు కూడా ఇందులో కలుస్తాయి. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న రంగం కావడంతో కొన్ని బ్యాంకులు కూడా ఈ వ్యాపారం కోసం రుణాలు ఇస్తున్నాయి. కాబట్టి మొదలు పెట్టడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు.
లాభాలు ఎలా ఉంటాయి?
చేపల పెంపకంలో సాధారణంగా 6 నెలలకు ఒకసారి క్రాప్ వస్తుంది. ఒక్క తొట్టెలోనే మంచి దిగుబడి వస్తుంది. సరైన ఫుడ్, శుభ్రమైన నీరు ఉంటే చేపలు త్వరగా పెరుగుతాయి. ఒక సీజన్‌లో మంచి దిగుబడి వస్తే లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. విక్రయం కూడా సులభమే. వారానికి జరిగే సంతల్లో నేరుగా అమ్మవచ్చు. లేకపోతే వినియోగదారులు మీ దగ్గరకు వచ్చి కొనుగోలు చేస్తారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తే మరింత మంది కస్టమర్లు చేరే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఇంటి మేడపై ఖాళీగా ఉన్న స్థలాన్ని సరిగ్గా ఉపయోగిస్తే అది ఆదాయం వచ్చే మంచి వ్యాపారంగా మారుతుంది. సరైన ప్రణాళికతో చేపల పెంపకం ప్రారంభిస్తే ఇంట్లోనే ఉండి మంచి లాభాలు పొందవచ్చు. పెద్ద ఎత్తున ఈ వ్యాపారాన్ని చేస్తున్న కొందరు నెలకు రూ. లక్ష సంపాదిస్తున్న ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఎన్నో సక్సెస్ స్టోరీలు యూట్యూబ్‌లో ఉన్నాయి.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఈ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ముందుగా ఆ రంగంలో అనుభవం ఉన్న వారిని నేరుగా సంప్రదించడం మంచిది.

