Business Ideas: ఐస్ క్యూబ్స్‌తో మీ ఇంట ఐశ్వర్యం.. ఈ వ్యాపారంతో మీ తలరాత మారాల్సిందే
Business Ideas: వ్యాపారం చేయాలని ఉన్నా నష్టాలు వస్తాయని భయపడి వెనుకడుగు వేస్తుంటారు. కానీ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా వ్యాపారం మొదలు పెడితే లాభాలు రావడం ఖాయం. అలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా ఐస్ క్యూబ్ మేకింగ్.

అసలేంటీ ఐస్ క్యూబ్ మేకింగ్
వేసవి కాలం పెరిగే కొద్దీ ఐస్ క్యూబ్స్‌కు భారీ డిమాండ్ ఉంటుంది. జ్యూస్ సెంటర్లు, కూల్ డ్రింక్ షాపులు, బార్లు, వైన్ షాపులు, హోటళ్లు, క్యాటరింగ్ సంస్థలు – ఇలా అనేక చోట్ల ఐస్ అవసరం ఉంటుంది. అందుకే ఐస్ క్యూబ్ తయారీ వ్యాపారం చిన్న స్థాయిలో ప్రారంభించినా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సరైన ప్రణాళికతో ఈ వ్యాపారం స్థిరంగా నడిపించవచ్చు.
ఈ వ్యాపారం వ్యాపారం ప్రారంభించే ముందు మార్కెట్ అవసరాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా ఈ ఐస్ క్యూబ్స్‌కి ఎక్కువగా జ్యూస్ సెంటర్లు, ఫ్రూట్ జ్యూస్ షాపులు, బార్లు, పబ్‌లు, వైన్ షాపులు, రెస్టారెంట్లు, హోటళ్లు, ఫంక్షన్ హాల్స్, క్యాటరింగ్ సంస్థల్లో డిమాండ్ ఉంటుంది. వేసవిలో ఐస్ డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే పెళ్లిళ్లు, పార్టీలు, ఈవెంట్లు ఉన్నప్పుడు కూడా ఐస్ వినియోగం పెరుగుతుంది. మీ ప్రాంతంలో ఉన్న జ్యూస్ షాపులు లేదా బార్లతో ఒప్పందం చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. ఒకసారి రెగ్యులర్ కస్టమర్లు ఏర్పడితే ఈ వ్యాపారం నిరంతరం ఆదాయం వచ్చేలా మారుతుంది.
ఐస్ క్యూబ్ తయారీకి అవసరమైన యంత్రాలు
ఈ వ్యాపారంలో ముఖ్యమైనది ఐస్ తయారీ యంత్రం. మంచి నాణ్యత ఉన్న యంత్రం కొనుగోలు చేస్తే ఉత్పత్తి సులభంగా జరుగుతుంది. ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టేందుకు ఐస్ క్యూబ్ మెషిన్, డీప్ ఫ్రీజర్ లేదా కోల్డ్ స్టోరేజ్, వాటర్ ఫిల్టర్ లేదా RO ప్లాంట్, ఐస్ స్టోరేజ్ బాక్సులు, ప్యాకింగ్ మెషిన్ లేదా ప్యాకింగ్ బ్యాగ్స్ ఐస్ క్యూబ్ మెషిన్ రోజుకు 100 కిలోల నుంచి 1 టన్ను వరకు ఐస్ తయారు చేసే సామర్థ్యంతో వస్తుంది. మీ మార్కెట్ అవసరాన్ని బట్టి మెషిన్ ఎంపిక చేసుకోవాలి. అదే విధంగా నీటి నాణ్యత కూడా చాలా ముఖ్యమైనది. అందుకే RO లేదా ఫిల్టర్ చేసిన నీటితో ఐస్ తయారు చేస్తే కస్టమర్ల నమ్మకం పెరుగుతుంది.
లైసెన్స్‌లు, చట్టపరమైన అనుమతులు
ఐస్ క్యూబ్స్ తినే పదార్థాల్లో ఉపయోగిస్తారు కాబట్టి కొన్ని లైసెన్స్‌లు అవసరం. ప్రధానంగా అవసరమయ్యేవి MSME రిజిస్ట్రేషన్, FSSAI లైసెన్స్ (ఆహార ఉత్పత్తి కోసం), ట్రేడ్ లైసెన్స్, GST రిజిస్ట్రేషన్ (వ్యాపారం పెరిగితే). ఈ అనుమతులు ఉంటే మీ వ్యాపారం చట్టబద్ధంగా నడుస్తుంది. అలాగే పెద్ద హోటళ్లు లేదా బార్లు కూడా మీ దగ్గర నుంచి ఐస్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతాయి.
పెట్టుబడి ఎంత అవసరం?
ఐస్ క్యూబ్ తయారీ వ్యాపారం చిన్న స్థాయిలో ప్రారంభించాలంటే సుమారు రూ. 2 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుంది. ఖర్చులు ఇలా ఉండొచ్చు.
* ఐస్ క్యూబ్ మెషిన్ – రూ. 1.5 లక్షలు నుంచి రూ. 3 లక్షలు
* RO వాటర్ సిస్టమ్ – రూ. 30,000 నుంచి రూ. 60,000
* డీప్ ఫ్రీజర్ – రూ. 40,000 నుంచి రూ. 80,000
* షెడ్ లేదా రూమ్ ఏర్పాటు – రూ. 50,000 వరకు
* ఇతర ఖర్చులు – రూ. 20,000 నుంచి రూ. 50,000 వరకు అవుతుంది.
చిన్న స్థాయిలో ప్రారంభిస్తే పెట్టుబడి తక్కువగా ఉంటుంది. తర్వాత డిమాండ్ పెరిగితే మెషిన్లు పెంచుకోవచ్చు.
ప్రభుత్వం ద్వారా MSME రుణ పథకాల ద్వారా కూడా రుణం పొందే అవకాశం ఉంటుంది
లాభాలు ఎలా ఉంటాయి.?
ఐస్ క్యూబ్ వ్యాపారంలో లాభాలు మార్కెట్ డిమాండ్‌పై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా ఒక కిలో ఐస్ తయారీ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు 1 కిలో ఐస్ తయారీ ఖర్చు సుమారు రూ. 3 నుంచి రూ. 4 అవుతుంది. దీనిని మార్కెట్లో రూ. 8 నుంచి రూ. 15 వరకు విక్రయించవచ్చు. లాభాల విషయానికొస్తే నెలకు మొత్తం ఆదాయం సుమారు రూ. 60 నుంచి రూ. లక్ష వరకు వస్తుంది. ఖర్చులన్నీ పోయినా రూ. 30 నుంచి రూ. 40 వేల లాభం పొందొచ్చు.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ఓ అంచనా ప్రకారం మాత్రమే భావించాలి. ఇలాంటి వ్యాపారం మొదలు పెట్టే ఆలోచన ఉంటే ముందుగా ఈ రంగంలో అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోవడం మంచిది.

