- Home
- Business
- Silver Price: రూ. 4 లక్షల నుంచి రూ. 2 లక్షల కంటే తక్కువకు.. వెండి ధర ఎందుకు తగ్గుతోంది?
Silver Price: రూ. 4 లక్షల నుంచి రూ. 2 లక్షల కంటే తక్కువకు.. వెండి ధర ఎందుకు తగ్గుతోంది?
Silver Price: వెండి ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠాల నుంచి భారీగా పడిపోయాయి. ప్రపంచ మార్కెట్ మార్పులు, పెరిగిన వడ్డీ రేట్లు, పారిశ్రామిక డిమాండ్ తగ్గుదల వంటి కారణాల వల్ల వెండి ధర తగ్గుతోంది. వెండి ధర పడిపోవడానికి పూర్తి కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

వెండి ధరల భారీ పతనం.. ఆల్‌టైమ్ గరిష్ఠం నుంచి సగానికి పైగా డౌన్
అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో వెండి ధరలు ఊహించని రీతిలో భారీగా పడిపోతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కిలో వెండి ధర ఎంసీఎక్స్ మార్కెట్‌లో రూ.4.2 లక్షల నుంచి రూ.4.27 లక్షల కంటే ఎక్కువ ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. అయితే, అక్కడ నుంచి ధరలు ఏకంగా 50 శాతానికి పైగా పడిపోయి.
ప్రస్తుతం కిలో రూ.1.95 లక్షల నుంచి రూ.2 లక్షల దిగువకు చేరాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, ట్రేడర్ల మార్జిన్ కాల్స్, పారిశ్రామిక రంగా నుంచి డిమాండ్ తగ్గడమే ఈ భారీ పతనానికి ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
డాలర్ బలం.. అధిక వడ్డీ రేట్ల ప్రభావం
అంతర్జాతీయంగా బ్రెంట్ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $110 దాటి ఉండటంతో ద్రవ్యోల్బణ భయాలు మళ్లీ మొదలయ్యాయి. దీనివల్ల అమెరికా ఫెడరల్ బ్యాంక్ మరికొంత కాలం పాటు వడ్డీ రేట్లను గరిష్ఠ స్థాయిలోనే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు, ఎలాంటి వడ్డీ ఆదాయం ఇవ్వని వెండి, బంగారం వంటి ఆస్తులలో పెట్టుబడులు పెట్టడం ఇన్వెస్టర్లకు అంత లాభదాయకంగా అనిపించదు. బాండ్లు, క్యాష్ పై ఎక్కువ రిటర్న్స్ వస్తుండటంతో, ఇన్వెస్టర్లు వెండిలోని తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో వెండి ధరలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.
ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో భారీ మార్జిన్ సెల్లింగ్
వెండి ధరలు రూ.4.2 లక్షల గరిష్ఠ స్థాయి దాటినప్పుడు స్పెక్యులేటివ్ బైయింగ్ విపరీతంగా పెరిగింది. అయితే ధరలు ఒక్కసారిగా తగ్గడం ప్రారంభించగానే, ప్రపంచ కమోడిటీ ఎక్స్ఛేంజీలు మార్జిన్ పరిమితులను పెంచాయి. దీంతో నష్టాలను భరించలేక ఫ్యూచర్స్ ట్రేడర్లు తమ పొజిషన్లను క్లోజ్ చేసుకోక తప్పలేదు. బ్రోకర్లు ఆటోమేటిక్ సెల్ సిగ్నల్స్ ద్వారా క్లాక్ చేసిన ఫోర్స్డ్ సెల్లింగ్ కారణంగా ఒక్కసారిగా వెండి సరఫరా పెరిగి ధరలు వేగంగా పడిపోయాయి.
పారిశ్రామిక రంగంలో తగ్గిన డిమాండ్
బంగారం కేవలం ఒక సురక్షితమైన ఆస్తిగా మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ, ప్రపంచవ్యాప్తంగా లభించే మొత్తం వెండిలో 50 శాతానికి పైగా పరిశ్రమల్లోనే వినియోగిస్తారు. ముఖ్యంగా సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్, ఈవీ వాహనాలు, ఏఐ చిప్స్, తయారీ రంగంలో వెండి వినియోగం చాలా ఎక్కువ.
చైనా వంటి ప్రధాన పారిశ్రామిక దేశాలలో తయారీ రంగ వృద్ధి ఊహించినంత వేగంగా లేకపోవడంతో, వెండి పారిశ్రామిక డిమాండ్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా బంగారం కంటే వెండి ధరలు అత్యంత వేగంగా పడిపోవడానికి ప్రధాన కారణమైంది.
టెక్ షేర్లలో అమ్మకాలు.. పోర్ట్‌ఫోలియో అడ్జస్ట్‌మెంట్స్
ఇటీవలి కాలంలో మెగా-క్యాప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు చెందిన కంపెనీల షేర్లు తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇన్వెస్టర్లు టెక్ రంగాలు, ఇతర ఆస్తుల్లో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి లేదా కొలేటరల్ డిపాజిట్లు చేయడానికి కమోడిటీ మార్కెట్లలో ఉన్న తమ వెండి పొజిషన్లను విక్రయించారు. గ్లోబల్ ఇన్సిస్టిట్యూషనల్ ట్రేడర్లు నిధులను రీబ్యాలెన్స్ చేయడం వల్ల కమోడిటీ మార్కెట్ నుంచి పెద్ద ఎత్తున క్యాపిటల్ బయటకు వెళ్ళింది.
ఇన్వెస్టర్లకు నిపుణుల కీలక సూచనలు
స్వల్పకాలంలో వెండి ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, దీర్ఘకాలికంగా వెండికి మంచి భవిష్యత్తు ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీ, సోలార్ ప్రాజెక్టులు, ఈవీ వాహనాలు, సెమీకండక్టర్ తయారీ రంగాల్లో వెండి వినియోగం రాబోయే రోజుల్లో మరింత పెరగనుంది.
ప్రస్తుతానికి మార్కెట్‌లో వోలటైలిటీ ఎక్కువగా ఉన్నందున, తగ్గిన ప్రతిసారీ ఆత్రుతగా కొనుగోలు చేయడం కంటే, మార్కెట్ ఒక నిర్దిష్ట సపోర్ట్ లెవెల్ దగ్గర స్థిరపడే వరకు వేచి చూడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. రిటైల్ కస్టమర్లు కూడా జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు గమనించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలన్నారు.

