ఈ నెల 25వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాలు... కారణం ఏంటంటే.?
Bank Strike: బ్యాంకులకు వరుసగా సెలవులు, దేశవ్యాప్త సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ నెల జీతం, పెన్షన్.. సాధారణ తేదీ కంటే ముందుగానే ఖాతాల్లో జమ చేయనున్నారు.

వరుసగా ఐదు రోజులు బ్యాంకులు మూసివేత
సెప్టెంబర్ నెల చివరిలో బ్యాంకింగ్ సేవలకు వరుసగా అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 26న నాలుగో శనివారం, 27న ఆదివారం సెలవు. ఆ తర్వాత సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో నెలాఖరులో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రభావితమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం ముందుగానే జీతాలు, పెన్షన్లు చెల్లించాలని నిర్ణయించింది. అయితే ఆదివారం బ్యాంకులను నడిపించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఎవరెవరికి సెప్టెంబర్ 25నే జీతం వస్తుంది?
కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్ని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు రక్షణ, పోస్టల్, టెలికాం శాఖల ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ ముందస్తు చెల్లింపు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసే పారిశ్రామిక ఉద్యోగుల వేతనాలను కూడా సెప్టెంబర్ 25నే చెల్లించాలని ఆదేశించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కూడా అదే తేదీన పెన్షన్ అందేలా బ్యాంకులు, పే అండ్ అకౌంట్స్ ఆఫీసులకు సూచనలు చేశారు.
25న వచ్చే డబ్బు ‘అడ్వాన్స్ పేమెంట్’
ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 25న చెల్లించే జీతం, పెన్షన్‌ను సాంకేతికంగా అడ్వాన్స్ పేమెంట్‌గా పరిగణిస్తారు. నెల మొత్తం జీతం, భత్యాల తుది లెక్కలు పూర్తయిన తర్వాత ఏదైనా తేడా కనిపిస్తే దాన్ని తదుపరి నెల జీతంలో సర్దుబాటు చేస్తారు. అంటే ఉద్యోగులకు ముందుగా డబ్బు చెల్లించడం వల్ల వారి వేతన లెక్కల్లో మార్పు ఉండదు.
ప్రభుత్వ లావాదేవీలకు అంతరాయం రాకుండా చర్యలు
సెప్టెంబర్ చివరి వారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ముగింపు సమయం కూడా కావడంతో ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. బ్యాంక్ సమ్మె ప్రభావంతో ప్రభుత్వ ఆదాయం, పన్నుల చెల్లింపులు, ట్రెజరీ లావాదేవీలు, ఇతర ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోకుండా అవసరమైన ప్రక్రియలను సెప్టెంబర్ 25లోపే పూర్తి చేయాలని సూచించింది.
సాయంత్రంలోగా ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు
కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (CGA) అనుమతి తర్వాత భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కూడా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా డబ్బులు జమ చేసే బ్యాంకు శాఖలకు ముందుగానే సమాచారం ఇవ్వాలని కోరారు. సెప్టెంబర్ 25 శుక్రవారం సాయంత్రంలోగా అర్హులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాల్లో జీతం, పెన్షన్ జమ అయ్యేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీంతో బ్యాంక్ సమ్మె సమయంలో నగదు అవసరాలకు ఉద్యోగులు, పెన్షనర్లు ఇబ్బందులు పడకుండా ముందస్తు చెల్లింపు అందుబాటులోకి రానుంది.

