- Home
- Automobile
- Bikes
- Ather: అవును, ఈ స్కూటీ మీతో మాట్లాడుతుంది.. వాయిస్ కంట్రోల్ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే.?
Ather: అవును, ఈ స్కూటీ మీతో మాట్లాడుతుంది.. వాయిస్ కంట్రోల్ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే.?
Ather: ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఏథర్ ఎనర్జీ మరో సరికొత్త సౌకర్యాన్ని తన వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 'Voice on Ather' పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం

ఏ స్కూటర్లలో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది?
ఈ కొత్త ఫీచర్‌తో స్కూటర్‌లోని అనేక ఫంక్షన్లను కేవలం వాయిస్ కమాండ్లతోనే నియంత్రించవచ్చు. నావిగేషన్ ప్రారంభించడం నుంచి ఫోన్ కాల్స్ చేయడం, మ్యూజిక్ కంట్రోల్ చేయడం వరకు ఎన్నో పనులను చేతులతో టచ్ చేయకుండా పూర్తి చేయొచ్చు. ఈ ఫీచర్ ప్రస్తుతం కంపెనీ విడుదల చేసిన AtherStack 7 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో భాగంగా అందుబాటులోకి వచ్చింది. Ather తీసుకొచ్చిన 'Voice on Ather' ఫీచర్ ప్రస్తుతం Gen 3 లేదా అంతకంటే కొత్త హార్డ్‌వేర్ ఉన్న స్కూటర్లలో మాత్రమే పనిచేస్తోంది. ఇందులో Ather 450X, Ather 450 Apex, Rizta Z మోడళ్లకు ఈ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అయితే Ather 450S, Rizta S మోడళ్లకు ఈ ఫీచర్ అందుబాటులో లేదు. కంపెనీ ఈ అప్‌డేట్‌ను OTA (Over The Air) విధానంలో విడుదల చేస్తోంది. దీంతో సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి వద్ద నుంచే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.
వాయిస్ కమాండ్లతో ఏమేం చేయవచ్చు?
ఈ కొత్త ఫీచర్‌తో స్కూటర్‌ను నడుపుతున్న సమయంలో స్క్రీన్‌ను పదేపదే తాకాల్సిన అవసరం ఉండదు. సహజంగా మాట్లాడిన మాటలను అర్థం చేసుకునే విధంగా ఈ సిస్టమ్‌ను రూపొందించారు. ఉదాహరణకు, ఇంటికి వెళ్లేందుకు నావిగేషన్ ప్రారంభించమని చెప్పినా, దగ్గరలోని ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడ ఉందని అడిగినా వెంటనే సమాచారం చూపిస్తుంది. అలాగే స్క్రీన్ బ్రైట్‌నెస్ పెంచడం లేదా తగ్గించడం, ట్రాక్షన్ కంట్రోల్ మోడ్ మార్చడం, మ్యాజిక్ ట్విస్ట్ రీజెనరేషన్ స్థాయిని సెట్ చేయడం వంటి వాహన సెట్టింగ్‌లను కూడా వాయిస్ ద్వారానే మార్చుకోవచ్చు. అంతేకాదు, స్మార్ట్‌ఫోన్‌ను బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసి ఉంటే కాంటాక్ట్‌లలో ఉన్న వ్యక్తులకు కాల్ చేయడం, పాటలను ప్లే చేయడం, పాజ్ చేయడం లేదా తదుపరి పాటకు మారడం వంటి మీడియా కంట్రోల్స్‌ను కూడా వాయిస్ కమాండ్లతో నిర్వహించవచ్చు. దీంతో రైడింగ్ సమయంలో ఫోన్ లేదా స్క్రీన్‌ను ఉపయోగించే అవసరం గణనీయంగా తగ్గుతుంది.
AI టెక్నాలజీతో మరింత తెలివైన వ్యవస్థ
ఈ ఫీచర్‌కు ఆధారంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLMs), నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (NLP) వంటి అత్యాధునిక కృత్రిమ మేథ (AI) టెక్నాలజీలను ఉపయోగించింది ఏథర్. అందువల్ల వినియోగదారులు కచ్చితమైన కమాండ్లు చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా మాట్లాడే భాషలోనే ఆదేశాలు ఇచ్చినా స్కూటర్ వాటిని అర్థం చేసుకుని స్పందిస్తుంది. ముఖ్యంగా భారతీయ యాసలు, ఉచ్చారణలు, భిన్నమైన మాట్లాడే విధానాలను కూడా సులభంగా గుర్తించేలా ఈ సిస్టమ్‌ను రూపొందించారు. ఈ ఫీచర్‌ను ఏథర్ హాలో స్మార్ట్ హెల్మెట్ ద్వారా ఉపయోగించవచ్చు. అలాగే సాధారణ బ్లూటూత్ హెడ్‌సెట్ ఉన్నా వాయిస్ కమాండ్లు పనిచేస్తాయి. దీంతో ప్రయాణ సమయంలో మరింత సౌకర్యవంతమైన అనుభవం లభిస్తుంది.
త్వరలో స్కూటర్ మీతోనే మాట్లాడుతుంది
ప్రస్తుతం 'Voice on Ather' ఫీచర్ వినియోగదారుడు ఇచ్చే ఆదేశాలను మాత్రమే అమలు చేస్తోంది. అయితే భవిష్యత్‌లో దీనిని మరింత అభివృద్ధి చేసి AI ఆధారిత రెండు వైపుల సంభాషణ (Two-Way Communication) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత స్కూటర్ అవసరమైనప్పుడు స్వయంగా యూజర్లతో మాట్లాడగలదు. బ్యాటరీ తక్కువగా ఉన్నప్పుడు ముందుగానే హెచ్చరించడం, సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌ను సూచించడం, వాహన సర్వీస్ సమయం దగ్గరపడిందని గుర్తుచేయడం, ప్రయాణానికి సంబంధించిన సూచనలు ఇవ్వడం, భద్రతా హెచ్చరికలను అందించడం వంటి సేవలను అందించనుంది. దీంతో స్కూటర్ కేవలం రవాణా సాధనంగా కాకుండా, ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండే AI స్మార్ట్ అసిస్టెంట్‌గా మారనుంది.
రైడర్లకు ఎలా ఉపయోగపడనుంది.?
రైడింగ్ సమయంలో మొబైల్ లేదా టచ్‌స్క్రీన్‌ను ఉపయోగించడం వల్ల ప్రమాదాల అవకాశాలు పెరుగుతాయి. కొత్త వాయిస్ కంట్రోల్ ఫీచర్‌తో చేతులు ఎప్పుడూ హ్యాండిల్‌పైనే, కళ్లూ రోడ్డుపైనే ఉండేలా అవసరమైన పనులన్నీ వాయిస్ ద్వారానే పూర్తి చేయవచ్చు. దీంతో ప్రయాణం మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుతుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి రైడింగ్ అనుభవాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో Ather తీసుకొచ్చిన ఈ ఫీచర్, భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో మరో కీలక ముందడుగుగా భావిస్తున్నారు. భవిష్యత్‌లో మరిన్ని AI ఆధారిత సౌకర్యాలను అందించే దిశగా కంపెనీ అడుగులు వేస్తుండటంతో, Ather స్కూటర్ల వినియోగదారులకు మరింత స్మార్ట్ రైడింగ్ అనుభవం లభించే అవకాశం ఉంది.

