- Home
- Jobs
- హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షపైగా జీతం, ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలంటే?
హైస్పీడ్ రైలు ప్రాజెక్టులో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షపైగా జీతం, ఎవరు అర్హులు, ఎలా అప్లై చేసుకోవాలంటే?
NHSRCL Recruitment: దేశంలో హైస్పీడ్ రైలు ప్రాజెక్టులను అమలు చేస్తున్న నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 237 టెక్నీషియన్ పోస్టులకుగానుఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి?
ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్, రోలింగ్ స్టాక్ తదితర విభాగాల్లో టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులను సంస్థ అవసరాలను బట్టి దేశంలోని ఏ ప్రాంతంలోనైనా విధుల్లో నియమించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో చేరిన తర్వాత తొలి ఏడాది ప్రొబేషన్ కాలంగా పరిగణిస్తారు. ఆ కాలంలో అభ్యర్థుల పనితీరును పరిశీలించిన తర్వాత శాశ్వత నియామకాన్ని కొనసాగిస్తారు.
అర్హతలు, అనుభవం ఎలా ఉండాలి?
దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అనంతరం ఫిట్టర్, మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, సర్వేయర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ప్లంబర్, పెయింటర్, కంప్యూటర్ ఆపరేటర్, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రానిక్ మెకానిక్ వంటి గుర్తింపు పొందిన ట్రేడ్లలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ వంటి బ్రాంచ్‌లలో ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
విద్యార్హతలతో పాటు 2026 జూన్ 30 నాటికి కనీసం రెండేళ్ల సంబంధిత ఉద్యోగ అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అయితే బోధన, ఫ్యాకల్టీ విధులు, అప్రెంటిస్‌షిప్, పార్ట్‌నర్‌షిప్, ఫ్రీలాన్సింగ్ వంటి అనుభవాలను ఉద్యోగ అనుభవంగా పరిగణించరు. అలాగే బీఈ లేదా బీటెక్ వంటి ఉన్నత విద్య పూర్తి చేసి, ఐటీఐ లేదా డిప్లొమా అర్హత లేని అభ్యర్థులు ఈ నియామకాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది?
అభ్యర్థుల ఎంపికను పలు దశల్లో నిర్వహిస్తారు. ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) నిర్వహించి అర్హత సాధించిన వారిని తదుపరి దశకు ఎంపిక చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని దశల్లో విజయవంతమైన అభ్యర్థుల మెరిట్ ఆధారంగా తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. సీబీటీ తేదీ, అడ్మిట్ కార్డు, ఇతర సమాచారాన్ని అభ్యర్థులు నమోదు చేసిన ఈమెయిల్ చిరునామాకు పంపిస్తారు.
వయోపరిమితి, వేతనం, దరఖాస్తు ఫీజు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు మించకూడదు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తదితర ప్రత్యేక వర్గాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం నెలకు రూ.35,000 నుంచి రూ.1,10,000 వరకు ఉంటుంది. ప్రాథమిక వేతనంతో పాటు ఇండస్ట్రియల్ డియర్‌నెస్ అలవెన్స్ (IDA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), వైద్య సదుపాయాలు, ఉద్యోగుల భవిష్యనిధి (EPF), గ్రాట్యుటీ, ఇతర అలవెన్సులు, ప్రోత్సాహకాలు కూడా అందిస్తారు.
దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు కల్పించారు.
దరఖాస్తు గడువు, ముఖ్యమైన సమాచారం
ఈ నియామకాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ 2026 ఆగస్టు 5. అర్హతలు, పోస్టుల వివరాలు, దరఖాస్తు విధానం, అధికారిక నోటిఫికేషన్ తదితర పూర్తి సమాచారం కోసం NHSRCL అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అన్ని అర్హతలను ఒకసారి పరిశీలించి దరఖాస్తు సమర్పించడం మంచిది.

