- Home
- Andhra Pradesh
- Visakhapatnam : విశాఖ వాసులకు గమనిక ... నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, ఐద్రోజులపాటు ఈ రూట్లో నో ఎంట్రీ
Visakhapatnam : విశాఖ వాసులకు గమనిక ... నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, ఐద్రోజులపాటు ఈ రూట్లో నో ఎంట్రీ
బీచ్ సిటి విశాఖపట్నం యోగా డే 2025 వేడుకల కోసం సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే భద్రతా చర్యల్లో భాగంగా ఇప్పటినుండే పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఏఏ మార్గాల్లో వాహనాలకు నో ఎంట్రీ ఉందో తెలుసా?

యోగా డే వేడులకు సిద్దమవుతున్న వైజాగ్
Yoga Day 2025 : భారత సంస్కృతిలో భాగమైన యోగాను యావత్ ప్రపంచం అంగీకరించింది... ఆరోగ్యం కోసం మన సూర్య నమస్కారాలు వంటి సాంప్రదాయ యోగాసాలను ఫాలో అవుతున్నారు. ఇలా మన యోగా ఖండాంతరాలు దాటింది. చివరకు ఐక్యరాజ్యసమితి కూడా యోగా శారీరక ఆరోగ్యానికి దోహదపడుతుందని గుర్తించింది... అందుకే భారతీయ యోగాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించింది. జూన్ 21ని అంతర్జాతీయ యోగా డే గా నిర్ణయించింది... అంటే ప్రతిఏడాది ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహించి దీనిపై అవగాహన కల్పిస్తారు.
యావత్ ప్రపంచమే మన యోగాను గుర్తించింది... మరి మన దేశ సంస్కృతిలో భాగమైన దీన్ని అంత సింపుల్ గా జరుపుకుంటామా..! ప్రతిసారి యోగా డే వేడుకలను అట్టహాసంగా నిర్వహించుకుంటున్నాం... మరి ఈసారి తెలుగు ప్రజలు మరింత ప్రత్యేకంగా యోగా డే వేడుకలకు సిద్దం అవుతున్నారు. యోగా డే 2025 ని ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు గడ్డపై జరుపుకోనున్నారు... ఇందుకోసం బీచ్ సిటీ విశాఖపట్నం రెడీ అవుతోంది.
జూన్ 21న వైజాగ్ ఆర్కే బీచ్ లో యోగా డే వేడుకలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు... ఇలా రాజకీయ ప్రముఖలంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఒకేచోట దాదాపు 5 లక్షల మందికిపైగా యోగాసానాలు వేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
ఇలా అట్టహాసంగా నిర్వహించనున్న యోగా డే వేడుకల కోసం ఇప్పటినుండే విశాఖలో ట్రాఫిక్ కంట్రోల్ చర్యలు చేపట్టారు పోలీసులు. జూన్ 17 నుండి 21 వరకు నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని... కాబట్టి వాహనదారులు సహకరించాలని పోలీసులు కోరారు. ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించి నగర పోలీస్ కమీషనర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసారు.
విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు
యోగా డే 2025 వేడుకల నేపథ్యంలో విశాఖపట్నంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇవాళ్టి (జూన్ 17) నుండి యోగా డే వేడుకలు పూర్తయ్యేవరకు అంటే జూన్ 21 వరకు ఎన్టీఆర్ సర్కిల్ నుండి పార్క్ హోటల్ వరకు బీచ్ రోడ్డును పూర్తిగా మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. నిత్యం ఈ మార్గంలో ప్రయాణించేవారు ఈ ఐదురోజులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని వైజాగ్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
ఇక యోగా డే కు సమయం దగ్గరపడుతున్నకొద్దీ మరిన్ని ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని పోలీసులు తెలిపారు. మరో రెండ్రోజుల తర్వాత అంటే జూన్ 19 నుండి పార్క్ హోటల్ నుండి భీమిలి బీచ్ వరకు రోడ్డును మూసివేస్తున్నట్లు ప్రకటించారు. జూన్ 21 వరకు ఈ మార్గంలో వాహనాలను అనుమతించబోమని ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు.
యోగా డే వేడుకల కోసం పార్కింగ్ ఏర్పాట్లు
11వ అంతర్జాతీయ యోగా డే వేడుకలకు విశాఖపట్నం వేదిక కానుంది. ప్రధాని మోదీ పాల్గొననున్న ఈ వేడుకల నిర్వహణను కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది... స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన వేదిక, ప్రత్యేక అతిథులు, ప్రజల కోసం చేపట్టిన ఏర్పాట్ల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇటీవల స్వయంగా ఏర్పాట్లను పరిశీలించిన సీఎం అధికారులకు తగు సలహాలు సూచనలిచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు వేదికపైకి ఈజీగా చేరుకునేలా ప్రధాని మోదీ, ఇతర ప్రముఖుల వాహనాల పార్కింగ్ ఏపీఐఐసి గ్రౌండ్, ఏయూ భాస్కర్ హాస్టల్ ప్రాంగణంలో ఏర్పాట్లు చేసారు. ఇక వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చే ప్రజలకోసం నగరంలో పలుచోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేసారు. యోగా డే రోజున విశాఖపట్నంలోకి భారీ వాహనాలకు అనుమతి ఉండదని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు.
యోగా డే 2025 భద్రతా చర్యలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగా డే వేడుకలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశమైన హోంమంత్రి వంగలపూడి అనిత భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. విశాఖతో పాటు వివిధ ప్రాంతాల నుండి పోలీసులను తీసుకువచ్చి భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు హోంమంత్రికి వివరించారు.
ఇప్పటికే బీచో రోడ్డులో డ్రోన్లపై నిషేధం విధించి రెడ్ జోన్ గా ప్రకటించినట్లు తెలిపారు. యోగా డే వేడుకలు జరిగే ప్రధాన వేదికవద్ద 323 కంపార్ట్ మెంట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు... ప్రతి కంపార్ట్ మెంట్ వద్ద పోలీసులు ఉంటారని తెలిపారు. ఈ వేడుకల కోసం ఇప్పటికే 2వేలకు పైగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు... అవసరం అయితే మరిన్ని ఏర్పిటు చేస్తామని పోలీసులు తెలిపారు.
విశాఖ యోగా డే వేడుకల్లో పాల్గొనేవారికి ఇవి ఫ్రీ...
ఈ యోగా డే వేడుకల్లో పాల్గొనేవారికి ఎలాంటి ఇబ్బందిలేకుండా ఆసనాలు వేసేలా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి ఓ యోగా మ్యాట్, టీ షర్ట్, ఓఆర్ఎస్ బాటిల్ అందించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మంచినీటి సౌకర్యం కూడా కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.