- Home
- Andhra Pradesh
- IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలు, అక్కడ తుపాను బీభత్సం
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలు, అక్కడ తుపాను బీభత్సం
IMD Rain Alert : భారత దేశంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఏపీతో పాటు తమిళనాడు, డిల్లీ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా… జమ్మూ కాశ్మీర్ లో మంచు కురుస్తోంది. ఇక అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది.

మళ్లీ వర్షాలు షురూ...
IMD Rain Alert : భారతదేశంలో కాలంతో పనిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాకాలం ముగిశాకే బంగాళాఖాతంలో తుపానులు ఏర్పడి తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఆ తర్వాత శీతాకాలంలో వర్షాలు కొనసాగాయి... భారీగా కురవకున్నా అప్పుడప్పుడు చెదురుమదురు జల్లులు పడుతూనే ఉన్నాయి. తాజాగా చలికాలం ముగింపుకు చేరుకుని ఎండాకాలం ప్రారంభమయ్యే సమయంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అనేకచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.
కోస్తా, రాయలసీమలో వర్షాలు
తెలుగు రాష్ట్రాలనూ తాజా వానలు వదిలిపెట్టడంలేదు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది... ఈ నెలాఖరు వరకు ఇవి కొనసాగుతాయని ప్రకటించింది. కాబట్టి రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు
ఆంధ్ర ప్రదేశ్ వెదర్ మ్యాన్ ప్రకారం... ప్రస్తుతం శ్రీలంక సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనమే రాష్ట్రంలో వర్షాలకు కారణంగా తెలుస్తోంది. బంగాళాఖాతంలోని ఈ అల్పపీడనం ప్రభావం ఏపీ, తమిళనాడు ప్రాంతాలపై కనిపిస్తోంది. ఏపీలోని తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇవాళ (జనవరి 24న) వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు.
జనవరి 26న కూడా వర్షాలు
అల్పపీడనం సముద్రంలో ముందుకు కదులుతూ మరింత బలపడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో రాబోయే రెండుమూడురోజులు కూడా వర్షాలు తప్పవని ఏపీ వెదర్ మ్యాన్ ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు సరిహద్దు తీర ప్రాంతాల్లో జనవరి 25, 26 (శని, ఆదివారం) కూడా వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు వెదర్ మ్యాన్. అయితే అల్పపీడనం ప్రభావంతో చిరుజల్లులు మాత్రమే కురుస్తాయని... భారీ వర్షాలు కురిసే అవకాశాలు లేవని ఏపీ వెదర్ మ్యాన్ ప్రకటించారు.
Light rain / Drizzles possible along Tirupati and Chittoor districts due to a Mini-Low Pressure over Sri Lanka during today, 25th and 26th:
In a very rare-case, a Mini-Low Pressure over Sri Lanka is pushing moisture, which will cause some rains (Light rains and chill mornings)… pic.twitter.com/lAMfVa4R01— Andhra Pradesh Weatherman (@praneethweather) January 24, 2026
రిపబ్లిక్ డే వేడుకలకు వర్షాలు ఆటంకం..?
ఇదిలావుంటే ఇప్పటికే దేశ రాజధాని డిల్లీలో వర్షాలు మొదలయ్యాయి. నిన్న (జనవరి 23, శుక్రవారం) ఒక్కసారిగా వర్షం కురవడంతో రిపబ్లిక్ డే పరేడ్ కు ఆటంకం కలిగింది. ఈ సోమవారమే(జనవరి 26న) రిపబ్లిక్ డే... కాబట్టి ఇప్పటికే భారత సైనికులు పరేడ్ సన్నాహాలు చేపట్టారు. ఈ క్రమంలో న్యూడిల్లీలోని కర్తవ్యపథ్ లో రిహార్సల్ నిర్వహిస్తుండగా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నా తడుస్తూనే సైనికులు కవాతు నిర్వహించారు. రిపబ్లిక్ డే వేడుకలకు కూడా వర్షాలు ఆటంకం కలిగించే అవకాశాలున్నాయని ఐఎండి హెచ్చరిస్తోంది.
జమ్మూ కాశ్మీర్ లో హిమపాతం
జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాలయా పర్వతాలు కలిగిన రాష్ట్రాల్లో మంచు కురుస్తోంది. ఈ హిమపాతం రోడ్డు రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది... దట్టమైన మంచు కారణంగా విమానాలు కూడా రద్దు అవుతున్నాయి. తీవ్రంగా మంచు కురుస్తున్న ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు... అలాగే వైష్ణో దేవి ఆలయాన్ని కూడా అధికారులు మూసివేశారు. ఈ మంచు కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరక్కుండా అత్యవసర పరిస్థితిని ప్రకటించి కంట్రోల్ రూం ఏర్పాటుచేశారు.
అమెరికాలో మంచు తుపాను
హిమాలయాల్లో మాదిరిగానే అమెరికాలో కూడా ప్రస్తుతం దట్టమైన మంచు కురుస్తోంది. ఈ మంచు తుపాను బీభత్సానికి ప్రజలు వణికిపోతున్నారు. గడ్డకట్టే చలి, మంచు తుఫాన్ కారణంగా ఏకంగా 1800 విమానాలు రద్దు అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, మరికొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిచిపోయింది. ఈ మంచు తుపాను ప్రభావిత 15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు... మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది.

