- Home
- Andhra Pradesh
- IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
IMD Rain and Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే గడ్డకట్టే చలి ఉండగా కొన్నిచోట్ల వర్షాలు కూడా తోడయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఈసారి చలివానలు..
IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు కురిశాయి. వర్షాకాలం ముగిశాక కూడా అంటే నవంబర్ చివర్లో, డిసెంబర్ ఆరంభంలో భారీ నుండి అతిభారీ వర్షాలు పడ్డాయి. దీన్నిబట్టి కాలంతో పనిలేకుండా వర్షాలు కురుస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. తాజాగా చలితీవ్రత ఎక్కువగా ఉంది... ఈ సమయంలోనూ ఆంధ్ర ప్రదేశ్ లో అక్కడక్కడ వర్షాలు కురుసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
తేలికపాటి వర్షాలు
వాతావరణ పరిస్థితులు మారడంతో చలితో పాటు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. బంగాళాఖాతం నుండి వీస్తున్న గాలులు ప్రభావం తమిళనాడుపై ఎక్కువగా ఉండటంతో అక్కడ వర్షాలు కురుస్తున్నాయి... ఈ రాష్ట్ర బార్డర్ లోని ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు, మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రాయలసీమలో అక్కడక్కడ చలిగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు.
నేడు ఏపీలో వర్షాలు..?
డిసెంబర్ 18 (గురువారం) మధ్యాహ్నం ఎండ ఉన్నా ఉదయం, సాయంత్రం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని ప్రకటించారు. స్వల్ప వర్షం కురిసే సూచనలున్నాయట. ఇక డిసెంబర్ 19 అంటే రేపు(శుక్రవారం) కూడా ఇలాంటి వాతావరణమే ఉంటుందని... చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండి వర్షం స్థాయిలోనే దట్టమైన పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఏపీపై చలి పంజా
ఆంధ్ర ప్రదేశ్ లో చలిగాలులు తీవ్రత ఎక్కువగా ఉంది... కొండప్రాంతాల్లో అయితే మరీ దారుణంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి మరీ ఎక్కువగా ఉంది... జి.మాడుగుల, అరకు, పాడేరు వంటి ప్రాంతాల్లో 3 డిగ్రీలకు టెంపరేచర్స్ పడిపోయాయి. మిగతా ప్రాంతాల్లోనూ చలి చంపేస్తోంది... దీంతో ప్రజలు ఉదయం, రాత్రి సమయాల్లో ఇళ్లనుండి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
తెలంగాణలో చలి చంపేస్తోందిగా...
తెలంగాణలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి... ఆదిలాబాద్ వంటి మారుమూల ప్రాంతాల్లో కాదు రాజధాని హైదరాబాద్ పరిసరాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పటాన్ చెరులో రాష్ట్రంలోనే అత్యల్పంగా 8 డిగ్రీ సెల్సియస్ నమోదయ్యింది... ఆదిలాబాద్ లో 9 డిగ్రీలు ఉంది. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, గద్వాల, మంచిర్యాల, ములుగు, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో అత్యంత చలి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. డిసెంబర్ 18 నుండి 21 వరకు అంటే నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు మరింత దిగువకు చేరుకుని చలిగాలులు, పొగమంచు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు.

