IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Weather Update : తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోనున్నాయని… చలి గజగజా వణికించనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. టెంపరేచర్స్ ఏ స్థాయికి దిగజారనున్నాయో తెలుసా..?

ఇక రికార్డు టెంపరేచర్స్
Peak Cold Wave Warning : గత పదిరోజులుగా వీస్తున్న చలిగాలులు తెలుగు ప్రజలను గజగజా వణికిస్తున్నాయి. ఇవి చాలవన్నట్లు రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత దారుణంగా పడిపోనున్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయికి టెంపరేచర్స్ చేరుకుంటాయని... ఊహకందని స్థాయిలో చలి ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.
రేపట్నుంచి ఫీక్స్ చలి
డిసెంబర్ చివర్లో లేదా జనవరి ఆరంభంలో సాధారణంగా చలి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి ముందుగానే గడ్డకట్టే స్థాయిలో చలిగాలులు వీస్తున్నాయి. డిసెంబర్ ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రారంభమయ్యింది... నెల మధ్యలోకి వచ్చేసరికి చలి తారాస్థాయికి చేరుకుంది. ఇక రేపట్నుంచి నాల్రోజులు (డిసెంబర్ 18 నుండి 21 వరకు) ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ తో సహా యావత్ తెలంగాణలో చలిగాలులు పీక్స్ కు చేరుకుంటాయని హెచ్చరించారు.
మరింత దిగువకు టెంపరేచర్స్
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుతం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... ఈ నాలుగురోజుల్లో మరింత తగ్గే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ తెలిపారు. 6 నుండి 7°C ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. ఇక పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో 7-9 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉంటాయని... హైదరాబాద్ లో కూడా ఇలాంటి వాతావరణమే ఉంటుందని ప్రకటించారు. ఇలా చలి పీక్స్ కు చేరుకుని ఆ తర్వాత క్రమంగా తగ్గుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు.
ఇక్కడే గజగజలాడించే చలి
రాబోయే నాలుగైదు రోజులు ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, కరీంనగర్, కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉంటాయిని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా ప్రకటించింది. ఈ జిల్లాల్లో 5 నుండి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రకటించింది. మిగతా తెలంగాణ జిల్లాల్లో 11 నుండి 20 డిగ్రీల వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరించింది.
తెలంగాణలో అత్యల్ఫ ఉష్ణోగ్రతలు ఇక్కడే...
ఆదిలాబాద్ లో అత్యల్పంగా 9.2, మెదక్ లో 10.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హన్మకొండలో 12, రామగుండంలో 12.6, నిజామాబాద్ లో 13.6, నల్గొండలొ 13.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ పటాన్ చెరు ప్రాంతంలో 8.2, రాజేంద్రనగర్ లో 10 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఏపీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
ఆంధ్ర ప్రదేశ్ లో ఉష్ణోగ్రతలు తెలంగాణ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో చలి మరింత పెరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో అత్యల్పంగా 3.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. అరకు, ముంచంగిపుట్టు, చింతపల్లి, పాడేరు ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు కుప్పకూలిపోయి చలి గజగజలాడిస్తోంది.
తస్మాత్ జాగ్రత్త..
ఇప్పటికే చలి తీవ్రత పెరగడంతో చిన్నారులు, ముసలివారు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పుడు చలి మరింత పెరిగే అవకాశాలున్నాయన్న హెచ్చరికలు కంగారు పెడుతున్నాయి. ఈ నాల్రోజులు తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాయంత్రం నుండి ఉదయం వరకు బయటకు వెళ్లాల్సి వస్తే వెచ్చని దుస్తులు (స్వెట్టర్లు, మప్లర్లు) ధరించాలని... ఇంటిని కూడా వేడిగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

