- Home
- Andhra Pradesh
- Police Recruitment : 2026 లోనే తెలుగు యువత కల సాకారం.. ఖాకీ డ్రెస్ వేసి, సింహాల టోపీ పెట్టేందుకు సిద్దమా..?
Police Recruitment : 2026 లోనే తెలుగు యువత కల సాకారం.. ఖాకీ డ్రెస్ వేసి, సింహాల టోపీ పెట్టేందుకు సిద్దమా..?
Andhra Pradesh Police Recruitment : పోలీస్ శాఖలో మరోసారి ఉద్యోగాల భర్తీకి కూటమి ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు స్వయంగా హోంమంత్రి వంగలపూడి అనిత క్లారిటీ ఇచ్చారు.

ఏపీలో భారీగా ఉద్యోగాల భర్తీ... చంద్రబాబు సర్కార్ రెడీ
Police Jobs : పోలీస్ జాబ్... చాలామంది నిరుద్యోగుల కల. ఖాకీ డ్రెస్ వేసి, మూడు సింహాలతో కూడిన టోపీ తలపై పెట్టి ఠీవిగా నడిచివస్తుంటే... తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల కళ్లలో ఆనందం చూడాలని కోరుకుంటారు. కేవలం IPS లకే కాదు ఖాకీ డ్రెస్ వేస్తే చాలు కానిస్టేబుల్స్ కు కూడా సమాజంలో మంచి గౌరవం దక్కుతుంది... అందుకే పోలీస్ ఉద్యోగం సాధించాలని యువతీయువకులు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ తెలిపింది.
జాబ్ క్యాలెండర్ రెడీ అయ్యిందా..?
ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ పై ఓ క్లారిటీ వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమేరకు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేపడుతోంది... త్వరలోనే మరిన్ని ఉద్యోగాల భర్తీ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేయనున్నారో ముందుగానే ప్రకటించేందుకు సిద్దమయ్యింది ప్రభుత్వం... ఈ మేరకు త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని... ఈ లెక్కలు త్వరలోనే తేలనున్నాయని మంత్రి తెలిపారు. అనంతరం ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపడతామని... ఇందుకోసం జాబ్ క్యాలెండర్ ను రెడీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇలా ఈ ఒక్క సంవత్సరమే కాదు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ను సిద్దంచేసి ముందుగానేే విడుదల చేస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.
పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీ..
ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖలో కూడా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించారు. తాజాగా నెల్లూరు జైలును సందర్శించిన అనిత పోలీసుల కొరతపై స్పందించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంతోనే పోలీసులపై పనిభారం పెరిగిపోయిందన్నారు... అందుకే త్వరలోనే జైల్లు, అగ్నిమాపక శాఖల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు హోంమంత్రి అనిత ప్రకటించారు.
ఏపీ ప్రభుత్వం విడుదల చేసే జాబ్ క్యాలెండర్ లో హోంశాఖలో భర్తీచేయనున్న ఉద్యోగాల వివరాలు కూడా ఉంటాయని తెలిపారు. మొత్తంగా పోలీస్ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తామని... రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూస్తామని, ప్రజలకు మరింత మెరుగైన భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇలా పోలీస్ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ హోంమంత్రి చేసిన ప్రకటనపై నిరుద్యోగ యువత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే వేలాది పోలీస్ ఉద్యోగాలు భర్తీ...
కూటమి ప్రభుత్వం ఇటీవలే భారీ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేసింది... స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాబ్స్ సాధించిన యువతీయువకులకు నియామక పత్రాలు అందించారు. మొత్తం 6014 కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించారు... వీరిలో 5,757 మంది శిక్షణకు అర్హత సాధించారు. ఇలా 3,343 సివిల్ కానిస్టేబుల్, 2,414 మంది ఏపిఎస్పీకి ఎంపికై ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు.
ఇప్పటికే హోంశాఖలో భారీ ఉద్యోగాల భర్తీ చేపట్టింది... ఇప్పుడు జైళ్ళు, అగ్నిమాపక శాఖలో నియామకాలపై ఫోకస్ పెట్టింది కూటమి సర్కార్. ఈ విభాగాల్లోనూ త్వరలోనే ఉద్యోగాల భర్తీ నోటిఫికేన్స్ ఉంటాయని స్వయంగా హోంమంత్రి అనిత ప్రకటించారు. కాబట్టి ఏ క్షణంలో నోటిఫికేషన్ వచ్చినా ఉద్యోగం సాధించేందుకు నిరుద్యోగ యువతీయువకులు రెడీగా ఉండాలి.
మరో డిఎస్సి ఉంటుందా..?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదట ప్రభుత్వ ఉపాధ్యాయులను భర్తీ చేసి విద్యాశాఖను మరింత బలోపేతం చేసింది. ఇటీవలే మెగా డిఎస్సి ద్వారా 15 వేలకు పైగా గవర్నమెంట్ టీచర్లను భర్తీచేసింది... ఇప్పటికే వీరంతా ఉద్యోగాల్లో కూడా చేరారు. ఈ నియామకాల సమయంలోనే ప్రతి ఏటా డిఎస్సి నిర్వహించి ఉద్యోగాల భర్తీ చేపడతామని స్వయంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే త్వరలోనే మరో డిఎస్సి నిర్వహణకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది... ఇప్పటికే టెట్ నిర్వహించింది.

