Weather Update: ఏపీ, తెలంగాణలకు వేసవి వార్నింగ్.. ఐఎండీ బాంబు పేల్చిందిగా !
Weather Update: ఈ ఏడాది మార్చి నుండి మే వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మార్చి టూ మే.. మాడ పగిలే ఎండలు ! తెలుగు రాష్ట్రాలకు హీట్ వేవ్ అలర్ట్
భారత వాతావరణ శాఖ (IMD) 2026 వేసవి కాలానికి సంబంధించి కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి నుండి మే నెల వరకు దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతల అంచనా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఐఎండి సూచనలను ఉటంకిస్తూ కీలక వివరాలు వెల్లడించారు. 2026 వేసవిలో మార్చి నుంచి మే వరకు సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ, ఉత్తరాంధ్రలోని కొన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు. సెంట్రల్ ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే ఎక్కువ రోజుల పాటు వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో హీట్ వేవ్
తెలంగాణలో కూడా మార్చి నుంచి మే మధ్య వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండి తెలిపింది. దేశవ్యాప్తంగా గుజరాత్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, బీహార్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే ఎక్కువ రోజులు హీట్ వేవ్ పరిస్థితులు నెలకొంటాయి. మార్చి నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు కొన్ని చోట్ల సాధారణంగా ఉన్నప్పటికీ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు మాత్రం దేశవ్యాప్తంగా అధికంగానే ఉండే అవకాశం ఉంది. ఇది రాత్రిపూట కూడా వేడిని పెంచుతుంది.
వ్యవసాయ రంగంపై ప్రభావం
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు రబీ పంటలపై, ముఖ్యంగా గోధుమలపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపవని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సగటు ఉష్ణోగ్రతలు గోధుమ పెరుగుదలకు అనుకూలంగానే ఉన్నాయని భారతీయ గోధుమ, బార్లీ పరిశోధనా సంస్థ డైరెక్టర్ రతన్ తివారీ తెలిపారు. ఈ ఏడాది రబీ సాగు విస్తీర్ణం 1.58 మిలియన్ హెక్టార్లు పెరిగి మొత్తం 67.68 మిలియన్ హెక్టార్లకు చేరింది. అయితే మార్చి నెలలో ఎండలు అసాధారణంగా పెరిగితే మాత్రం దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ప్రజారోగ్యం, విద్యుత్ డిమాండ్ పై ప్రభావం
ఎండల తీవ్రత పెరగడం వల్ల ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, బయట పని చేసే కూలీలు వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. వేడి పెరగడం వల్ల దేశంలో విద్యుత్ డిమాండ్ కూడా భారీగా పెరుగుతుందని, దీనివల్ల బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తిపై భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. జిల్లా యంత్రాంగాలు ఇప్పటి నుండే చల్లని ఆశ్రయాలు, తాగునీటి సౌకర్యాలు, వైద్య సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
మండే ఎండలు.. తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు
ఎండ తీవ్రత, వడగాల్పుల నుండి ప్రాణనష్టం జరగకుండా ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటించాలని ప్రఖర్ జైన్ సూచించారు..
- బయటకు వెళ్లేటప్పుడు టోపీ, కర్చీఫ్, తెలుపు రంగు కాటన్ వస్త్రాలను ధరించాలి.
- కళ్ళ రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించాలి.
- ఇంటి పైకప్పులపై వైట్ పెయింట్ వేయడం, కూల్ రూఫ్ టెక్నాలజీ లేదా థర్మోకోల్ ఇన్సులేషన్ వంటివి ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంటి ఉష్ణోగ్రత తగ్గుతుంది.
- ఇంటి లోపల, బయట మొక్కలను పెంచడం ద్వారా వాతావరణం చల్లగా ఉంటుంది.
- వంటగదిలో క్రాస్ వెంటిలేషన్ ఉండేలా కిటికీలు, తలుపులు తీసి ఉంచాలి.

