రూ.260 కోట్లతో అమరావతిలో వెంకన్న ఆలయ విస్తరణ.. భూమిపూజలో సీఎం చంద్రబాబు
Amaravati Venkateswara Temple : తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అమరావతిలో వేంకటేశ్వరస్వామి ఆలయం విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది. రూ.260 కోట్లతో రెండు దశల్లో భారీ పనులు ప్రారంభం కానున్నాయి. గురువారం సీఎం చంద్రబాబు భూమిపూజ చేస్తారు.

అమరావతి రాజధానిలో ఆధ్యాత్మిక వైభవం
అమరావతి రాజధానిలో ఆధ్యాత్మిక వైభవాన్ని మళ్లీ వెలిగించే కీలక కార్యక్రమానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. వెంకటపాలెంలో కొలువైన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం భూమిపూజ చేయనున్నారు.
మొత్తం రూ.260 కోట్ల భారీ వ్యయంతో రెండు దశల్లో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం, అమరావతిని తిరుమల తరహాలో ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ ప్రణాళికకు శ్రీకారం చుడుతోంది.
రూ.260 కోట్లతో భారీ విస్తర పనులు
టీటీడీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ అభివృద్ధి ప్రాజెక్టులో తొలి దశ పనులకు రూ.140 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.92 కోట్లతో ఆలయాన్ని చుట్టుముట్టే పటిష్ఠమైన ప్రాకారం, ఏడు అంతస్తుల మహా రాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన, రథ మండపాలు ఉన్నాయి. వీటితో పాటు ఆంజనేయ స్వామి ఆలయం, పవిత్ర పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ లు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇవన్నీ భక్తులకు అత్యాధునిక, సాంప్రదాయ సౌకర్యాలను అందించేందుకు ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. మొదటి విడత ఆలయ నిర్మాణం పూర్తవడంతో ఇప్పుడు రెండో, మూడో విడతలకు శంకుస్థాపన జరగనుంది.
రెండో దశలో మాడ వీధులు, అన్నదాన సత్రం, విశ్రాంతి నిలయాలు
రెండో దశలో రూ.120 కోట్లతో పెద్దఎత్తున సదుపాయాలను నిర్మించనున్నారు. వీటిలో తిరుమల శైలిలో మాడ వీధులు, అప్రోచ్ రోడ్లు, భారీ అన్నదాన కాంప్లెక్స్, యాత్రికుల విశ్రాంతి భవనం, అర్చకులు, సిబ్బందికి నివాస క్వార్టర్లు, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ స్థలం వంటివి ఉన్నాయి. అమరావతిని దక్షిణ భారతదేశంలో ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించేందుకు ఈ సదుపాయాలు కీలకంగా ఉండనున్నాయి.
గత ప్రభుత్వంలో నిలిచిన ఆలయ పనులు
2019కు ముందే టీడీపీ ప్రభుత్వం వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని తిరుమల ప్రతిరూపంగా నిర్మించాలని నిర్ణయించి, కృష్ణా తీరం వద్ద 25.417 ఎకరాలను కేటాయించింది. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక విస్తరణ ప్రణాళికను తగ్గించి, బడ్జెట్‌ను భారీగా కోత పెట్టింది. అనేక ఆధునిక నిర్మాణాలు ఆగిపోయాయి.
కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తిరిగి ఆ ప్రణాళికకు జీవం పోసి, నిలిచిపోయిన పనులను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది.
తిరుమల తరహాలో అమరావతి ఆలయ కొత్త రూపకల్పన
అమరావతి శ్రీవారి ఆలయాన్ని తిరుమల తరహాలో తీర్చిదిద్దే లక్ష్యంతో అనేక అద్భుత నిర్మాణాలు ప్రతిపాదించారు. తూర్పు వైపున 7 అంతస్తుల మహా రాజగోపురం, మిగతా మూడు దిశల్లో 5 అంతస్తుల గాలి గోపురాలు, లోపలి ప్రాకారంతో పాటు రెండో ప్రాకారం, భక్తుల ఉత్సవాలు, నిత్య కార్యక్రమాలు, పుష్కరిణి, ఉత్సవ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం వంటివి ఉన్నాయి. దీంతో అమరావతి ఆలయం తిరుమల క్షేత్రం తరహాలో ఆధ్యాత్మిక మహిమాన్వితాన్ని అందించనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

