చంద్రబాబు విజన్‌కు ఫిదా అయిన ఆనంద్ మహీంద్ర.. ఏపీ భవిష్యత్ మారడం ఖాయం
Anand mahindra: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రశంసలు కురిపించారు. ఇటీవల విశాఖలో జరిగిన సీఐఐ సమ్మిట్‌లో చంద్రబాబు చేసిన ప్రకటనకు సంబంధించిన ఆనంద్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

పెట్టుబడిదారుల కోసం ఎస్క్రో ఖాతాలు
విశాఖపట్నంలో జరిగిన CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ 2025 ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పెట్టుబడిదారులకు పెద్ద భరోసా ఇచ్చారు. ఏ సంస్థ AP ప్రభుత్వంతో MoU చేస్తే, ఆటోమేటిక్‌గా ఎస్క్రో ఖాతా ఓపెన్ అవుతుంది, ప్రోత్సాహకాల విడుదలపై ఆలస్యం ఉండదని హామీ ఇచ్చారు. బ్యాంక్ నుంచి నేరుగా నిధులు వెళ్లే విధానం ఉండటం వల్ల వ్యాపార వేత్తలు ఎవరినీ కలిసి మాట్లాడాల్సిన పనిలేదు. అవసరం అయితే సావరిన్ గ్యారంటీ కూడా ఇస్తామని చెప్పారు. ఈ నిర్ణయాన్ని పెట్టుబడిదారులు స్వాగతించారు.
ఏపీలో భారీ పెట్టుబడులు
గత 18 నెలల్లో $20 బిలియన్ పెట్టుబడులు వచ్చాయి, 20 లక్షల ఉద్యోగాలు లభించాయని చంద్రబాబు తెలిపారు. మూడు సంవత్సరాల్లో $500 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్, 50 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో వచ్చే పదేళ్లలో $1 ట్రిలియన్ ఇన్వెస్ట్‌మెంట్ దిశగా రాష్ట్రం కదులుతోందని పేర్కొన్నారు. APలో సహజ వనరులు, విస్తారమైన తీరరేఖ పెట్టుబడులకు ప్రధాన బలం అని అన్నారు.
నెక్స్ట్-జన్ గ్రోత్ కు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్
సమ్మిట్‌కు 72 దేశాల నుంచి 2,500 మందికి పైగా ప్రతినిధులు రావటం పట్ల సంతోషం వ్యక్తమైంది. విశాఖపట్నం భవిష్యత్తులో IT కేంద్రం, పెట్టుబడుల హబ్ అవుతుందని చంద్రబాబు నమ్మకం వ్యక్తం చేశారు. డ్రోన్ ఆవిష్కరణపై భారత్ దృష్టి పెట్టిన నేపథ్యంలో, మొదటి డ్రోన్ ట్యాక్సీలు AP నుంచే ప్రారంభం అవుతాయి అని తెలిపారు. అలాగే అరుదైన ఖనిజాలు, ఫార్మా, ఆరోగ్య రంగం, టూరిజం, పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రవాణా రంగం, లాజిస్టిక్స్ పార్కులు తదితర రంగాల్లో భారీ అవకాశాలు ఉన్నాయని వివరించారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటును ప్రకటించారు. ఇంకా రెండు సంవత్సరాల్లోనే క్వాంటమ్ కంప్యూటర్ తయారీ APలో ప్రారంభమవుతుందని చెప్పారు.
గ్రీన్ ఎనర్జీ
దేశానికి 500 GW గ్రీన్ ఎనర్జీ లక్ష్యం ఉంది. ఇందులో 160 GW ఉత్పత్తి APలోనే చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖలో నిర్మించబోయే పెద్ద డేటా సెంటర్‌కు ఒక్కటే 6 GW విద్యుత్ అవసరం. అందుకే గ్రీన్ ఎనర్జీపై రాష్ట్రం ఎక్కువ దృష్టి పెట్టుతోంది.
“అపార శక్తి ఉన్న నాయకుడు”
చంద్రబాబు నిర్ణయాలు చూసిన అనంతరం ఇండస్ట్రీ లీడర్ ఆనంద్ మహీంద్ర స్పందించారు. ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్‌లో.. “ఈ వ్యక్తి ప్రకృతిలాంటి ఆపలేని శక్తి. అభివృద్ధిపై ఉన్న అతని విజన్ మాత్రమే కాదు, విధానాల్లో కొత్తదనాన్ని తీసుకురావాలన్న తపన కూడా అద్భుతం. అతను తనకే కాదు, చుట్టూ ఉన్న అందరి స్థాయిని పెంచుతారు.” అంటూ రాసుకొచ్చారు. దీంతో ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది. చంద్రబాబు విజన్ ఎంత గొప్పదో చెప్పేందుకు ఇదే నిదర్శనమని అంటున్నారు.
This man is an unstoppable force of nature.
What I’ve admired about him for decades is not just his obsession for development but his desire to always be innovative in his policies.
He raises the bar for himself and for everyone around him.
👏🏽👏🏽👏🏽
pic.twitter.com/4RFUWGfwiv— anand mahindra (@anandmahindra) November 19, 2025

