PM Modi: పుట్టపర్తిలో జరిగిన శ్రీ సత్యసాయి బాబా శతజయంతి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన రూ.100 స్మారక నాణెం, కొత్త తపాలా బిళ్లలను విడుదల చేశారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు.
సత్యసాయి బాబా జీవితం – సేవతో నిండిన సందేశం
ప్రధాని మాట్లాడుతూ, సత్యసాయి బాబా శతజయంతి జరుపుకోవటం సర్వాంతర్యామి ఇచ్చిన వరం అని పేర్కొన్నారు. ప్రేమ, కరుణ, సేవ అనే విలువలను ప్రపంచానికెత్తిచూపిన మహనీయుడు బాబా అని ప్రధానమంత్రి అభివర్ణించారు.
వసుదైవ కుటుంబకం – బాబా చూపిన మార్గం
బాబా జీవితం మొత్తం “వసుదైవ కుటుంబకం” అనే భావన చుట్టూ తిరిగింది. జాతి, మతం, ప్రాంతం అనే భేదాలు లేని సమానత్వాన్ని ఆయన బోధించారు. "లవ్ ఆల్ – సర్వ్ ఆల్" అనే ఉపదేశం ఇప్పటికీ కోట్ల మందిని ప్రేరేపిస్తోంది. అని మోదీ చెప్పుకొచ్చారు.
బాబా నిర్మించిన సంస్థల సేవలు
ప్రధాని మాట్లాడుతూ, బాబా భౌతికంగా కనిపించకపోయినా ఆయన స్థాపించిన సేవా సంస్థలు ఇప్పటికీ ప్రజలను ఆదుకుంటున్నాయని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు, ఉచిత వైద్యం, విద్య వంటి అవసరాల్ని అందించటంలో ఈ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
ప్రకృతి వైపరీత్యాల్లో సేవాదళ్ పాత్ర
దేశంలో ఎక్కడ విపత్తు వచ్చినా సత్యసాయి సేవాదళ్ ఎప్పుడూ ముందుంటుందని మోదీ అన్నారు. గుజరాత్‌లోని భుజ్ భూకంప సమయంలో చేసిన సేవలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని మోదీ గుర్తు చేసుకున్నారు. సత్యసాయి నీటి ప్రాజెక్టు ద్వారా మూడు వేల కిలోమీటర్లకు పైగా పైపులు వేసి లక్షల మందికి తాగునీరు అందించటం గొప్ప సేవ అని ప్రధాని వివరించారు. ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేసి సాధారణ ప్రజలకు ఉచితంగా వైద్యం అందించే వ్యవస్థను బాబా నిర్మించడం గొప్ప విషయమని అన్నారు.
సుకన్య సమృద్ధి యోజన – బాలికల భవిష్యత్తు బలపడింది
దేశంలో బాలికల కోసం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన గురించి మోదీ చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా ఖాతాలు ఓపెన్ అయ్యాయి. ఈ ఖాతాల్లో 3.25 లక్షల కోట్ల దాకా నిధులు ఉన్నాయని చెప్పారు. వారణాసిలో 27 వేల బాలికలకు ఈ పథకం కింద నిధులు జమ చేయించామని మోదీ గుర్తు చేశారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక భద్రతా పథకాలపై విదేశాల్లో కూడా చర్చ జరుగుతోందని ప్రధాని పేర్కొన్నారు. పేదలకు సాయం చేయటంలో భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రపంచం ప్రశంసలు కురిపిస్తోందని మోదీ అన్నారు.
గిర్ గోవుల పంపిణీ – గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం
సత్యసాయి ట్రస్టు ఏర్పాటు చేసిన గిర్ గోవులను పేద కుటుంబాలకు అందజేస్తూ మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
పాలలో ఉన్న పోషకగుణాలు గ్రామీణ ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయని ఆయన వివరించారు.
వారణాసిలో 480కు పైగా గిర్ ఆవులను పేదలకు పంపిణీ చేయటం వల్ల ఇప్పుడు వేల సంఖ్యలో ఆవులు పెరుగుతున్నాయని చెప్పారు.
వోకల్ ఫర్ లోకల్ – ఆత్మనిర్భర్ భారత్ మార్గం
దేశ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రాన్ని అందరూ అంగీకరించాలని మోదీ పిలుపునిచ్చారు. స్థానిక వస్తువులను కొనుగోలు చేస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని తెలిపారు.
సత్యసాయి బోధనలతో వికసిత్ భారత్ దిశగా
కరుణ, శాంతి, కర్మ అనే మూడు విలువలు ప్రతి ఒక్కరి ఆచరణలో ఉండాలని ప్రధాని పేర్కొన్నారు. సత్యసాయి బాబా చూపిన దారిలో నడిస్తే సమాజం మరింత సుందరంగా మారుతుందని చెప్పారు. సహకారం, సేవ, మానవత్వం భారత భవిష్యత్తుకు దిక్సూచిక అని ప్రధాని అన్నారు.


