IMD Weather Alert : గజగజా వణికిస్తున్న చలి హటాత్తుగా మాయం..! ఎప్పట్నుంచో తెలుసా?
నవంబర్ లోనే శీతాకాలం అరంభమయ్యేది. కానీ ఇప్పుడే ఈ స్థాయిలో చలి వణికిస్తోంది. అయితే ఈ చలి మాయమయ్యే సమయం వచ్చిందంటున్నారు వాతావరణ నిపుణులు. మరి ఉష్ణోగ్రతలు ఎప్పుడు పెరుగుతాయి… చలి ఎప్పుడు తగ్గుతుందో తెలుసా?

నవంబర్ మొదట్లోనే చలి
IMD Cold Wave Alert : గతంలో ఎన్నడూ లేనివిధంగా శీతాకాలం ఆరంభంలోనే దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి పడిపోయాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ప్రస్తుతం సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు (5 నుండి 10 డిగ్రీ సెల్సియస్ మధ్య) నమోదవుతున్నాయి. దీంతో ఎప్పుడో డిసెంబర్, జనవరిలో తీయాల్సిన దుప్పట్లు, స్వెట్టర్లు, మప్లర్లను ముందుగానే తీయాల్సివచ్చింది.
అయితే ఈ చలిగాలులు ఇంకెన్నో రోజులు కొనసాగవని.. త్వరలోనే ఈస్థాయిలో వణికిస్తున్న చలి మాయమయ్యే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ నెలలోనే పూర్తిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతాయని… అత్యంత చలి పరిస్థితులు మారిపోతాయని చెబుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేస్తున్నారు.
చలి తగ్గేదెన్నడు?
మరో రెండుమూడు రోజులు ఉష్ణోగ్రతలు ఇలాగే పడిపోతూ తెలుగు రాష్ట్రాల్లో చలిగాలులు కొనసాగుతాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. కానీ తర్వాత వాతావరణ పరిస్థితులు మారిపోతాయని అంచనా వేస్తున్నారు.
Look at the distribution of COLDWAVE across entire Telangana. Next 2days too, similar range of temperatures expected 🥶🥶
After 3days, gradual improvement expected pic.twitter.com/vRD649jWoi— Telangana Weatherman (@balaji25_t) November 17, 2025
ఆదివారం నుండి గాలి దిశ మారుతుందని ఇతర వాతావరణ నిపుణులు కూడా చెబుతున్నారు. గాలిలో తేమ పెరుగుతుందని… దీంతో తెలంగాణ, ఏపీలోని అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి చెబుతున్నారు.
అల్పపీడనాల ఎఫెక్ట్
బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనం కొనసాగుతోంది. త్వరలోనే మరికొన్ని అల్పపీడనాలు ఏర్పడి తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకునే అవకాశాలున్నాయని ఇరురాష్ట్రాల వాతావరణ విభాగాలు హెచ్చరిస్తున్నాయి. ఇలా వర్షాలు మొదలైన గాలిలో తేమ పెరిగి చలి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల వాతావరణం
ఈ శనివారం (నవంబర్ 22) వరకు ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు ఉండదు. ఆ తర్వాత చలిగాలుల ప్రభావం తగ్గుతుంది. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు వచ్చేవారం ఈ చలినుండి కాస్త ఊరట లభించే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం తెలంగాణ, ఏపీలో ఉష్ణోగ్రత సాధారణం కంటే 2-3 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉంటున్నాయి… చాలా ప్రాంతాల్లో పొగమంచు కురుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో పాటు హైదరాబాద్, శివారుప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటోంది. ఏపీలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు, పాడేరు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది… సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

