పెట్రోల్ వాహనాలను ఈవీలు మార్చే టెక్నాలజీపై ఫోకస్.. చంద్రబాబు కీలక సూచన
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో జరుగుతోన్న పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సమ్మిట్‌లో చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ పాల్గొన్నారు.

పెట్రోల్ వాహనాలను ఈవీలు మార్చాలి
విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కళావేది కలో జరుగుతున్న పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సాంకేతిక ఆవిష్కరణలను పరిశీలించారు. రాష్ట్రాన్ని టెక్నాలజీ, ఇన్నోవేషన్‌కు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ఆయన దృష్టి సారించారు. ఆక్సి ఏరోస్పేస్ రూపొందించిన డ్రోన్‌ను పరిశీలించిన సీఎం.. సంస్థ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు దానిపై సంతకం చేశారు. పెట్రోల్‌తో నడిచే టూవీలర్ వాహనాలను కొద్ది గంటల్లోనే ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే సాంకేతికత గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టును ఏపీలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆరోగ్యం నుంచి టెక్నాలజీ వరకు కొత్త ఆవిష్కరణలు
సదస్సులో ప్రదర్శించిన వివిధ స్టార్టప్ ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలను చంద్రబాబు పరిశీలించారు. ముఖాన్ని స్కాన్ చేయడం ద్వారా కొన్ని నిమిషాల్లో ప్రాథమిక ఆరోగ్య రిపోర్ట్ అందించే యాప్ గురించి వివరాలు తెలుసుకున్నారు. సాంకేతికతను ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించడంపై ఆయన ఆసక్తి చూపించారు. స్వర్ణాంధ్ర-10 సూత్రాల అమలులో టెక్నాలజీని ఎలా ఉపయోగించవచ్చో చిన్నారులు ఇచ్చిన ప్రజెంటేషన్‌ను కూడా సీఎం ఆసక్తిగా విన్నారు. అనంతరం వారిని అభినందించి గ్రూప్ ఫొటో దిగారు.
పాన్ ఐఐటీ సదస్సులో నిపుణుల భాగస్వామ్యం
ఆవిష్కరణలు, సాంకేతిక రంగం అభివృద్ధికి ప్రోత్సాహం అందించే లక్ష్యంతో విజయవాడలో పాన్ ఐఐటీ ఆంధ్రప్రదేశ్ సదస్సు నిర్వహించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సదస్సును ప్రారంభించారు. దేశంలోని పలు ఐఐటీల పూర్వ విద్యార్థులు, ఐఐటీ డైరెక్టర్లు, కార్పొరేట్ సంస్థల సీఈవోలు, యూనికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, ఐటీ నిపుణులు, విధాన నిర్ణేతలు ఇందులో పాల్గొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, అగ్రిటెక్, నీటి భద్రత వంటి అంశాలపై చర్చలు జరిగాయి.
ఏపీ అభివృద్ధిపై లోకేశ్ వ్యాఖ్యలు
భారత్ అభివృద్ధి నమూనాను ప్రపంచానికి చూపించే స్థాయికి అమరావతి ఎదగాలని నారా లోకేశ్ అన్నారు. ఆ సామర్థ్యం ఆంధ్రప్రదేశ్‌కు ఉందనే విషయాన్ని దేశంలోని యువతతో పాటు ప్రపంచానికి తెలియజేయాలని పేర్కొన్నారు. ప్రతి రంగంలో రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఆ స్థాయికి చేరుకోవడానికి దశాబ్దాలు పట్టిందని, దుబాయ్ 30 ఏళ్లు, సింగపూర్ 25 ఏళ్లలో అభివృద్ధి సాధించాయని వివరించారు. వచ్చే పదేళ్లలో భారత్ కూడా ఆ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని, ఆ ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటుందని చెప్పారు.
‘స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ’తో కూడిన త్రీ ఎస్ విధానంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని లోకేశ్ తెలిపారు. పారిశ్రామికవేత్తలు ఏపీ వైపు వచ్చేలా అవసరమైన ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఒప్పందాలకే పరిమితం కాకుండా పరిశ్రమలు వాస్తవంగా రాష్ట్రంలో ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సంస్కరణలను ప్రకటించడం కంటే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడమే కీలకమన్నారు. వ్యవసాయం, ఉద్యానవన రంగాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.
డీప్‌టెక్ కోసం రూ.500 కోట్ల ఫండ్
అమరావతి కేంద్రంగా శాశ్వత ప్రాతిపదికన పాన్ ఐఐటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు లోకేశ్ వెల్లడించారు. డీప్‌టెక్ స్టార్టప్‌లు, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు రూ.500 కోట్లతో పాన్ ఐఐటీ ఆంధ్రా ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో 100 ఇండస్ట్రీ రీసెర్చ్ ఛైర్స్, 100 మంది సభ్యులతో గ్లోబల్ ఐఐటీ మెంటార్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. చంద్రబాబు 4.0 ఆపరేటింగ్ సిస్టమ్‌కు యంగ్ అండ్ డైనమిక్ హార్డ్‌వేర్ తోడైందని వ్యాఖ్యానించారు. ప్రతి 100 రోజులకు అమరావతి నిర్మాణంలో పురోగతి కనిపిస్తోందన్నారు. పాన్ ఐఐటీ సదస్సుకు వచ్చిన ప్రతినిధులు అమరావతి నిర్మాణ పనులను పరిశీలించాలని కోరారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అందుబాటులోకి రానుందని తెలిపారు. దేశంలోని 23 ఐఐటీల పూర్వ విద్యార్థులు అమరావతిలో సమావేశం కావడం సంతోషంగా ఉందన్నారు.

