- Home
- Andhra Pradesh
- IMD Weather Update : బంగాళాఖాతంలో తుపాను.. ఆంధ్ర ప్రదేశ్ తీరాన్ని తాకుతుందా? భారీ నుండి అతిభారీ వర్షాలు తప్పవా?
IMD Weather Update : బంగాళాఖాతంలో తుపాను.. ఆంధ్ర ప్రదేశ్ తీరాన్ని తాకుతుందా? భారీ నుండి అతిభారీ వర్షాలు తప్పవా?
Weather Update : ఈ అక్టోబర్ నెలలో తెలుగు రాష్ట్రాలను భారీ నుండి అతిభారీ వర్షాలు పలకరించనున్నాయా? అంటే వాతావరణ నిపుణుల నుండి అవుననే సమాధానం వినిపిస్తోంది.

అక్టోబర్ లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో మరోసారి వర్షాలకు అనుకూలంగా వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నాయని వాతావరణ శాఖ (IMD) అంచనా వేస్తోంది. ఉత్తర అండమాన్ సముద్రంపై అక్టోబర్ 12న ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.... దీంతో అక్టోబర్ 13 నాటికి అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఇది క్రమంగా బలపడి అక్టోబర్ 15 నాటికి దక్షిణ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని APSDMA తెలిపింది. ఇది తీవ్ర వాయుగుండంగా, చివరికి తుపానుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని అంచనా వేస్తోంది.
బంగాళాఖాతంలో తుపాను..?
తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితుల్లో అక్టోబర్ 12 నుంచి మార్పులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అక్టోబర్ 12 నుండి 15 నాటికి బంగాళాఖాతంలో వాయుగుండం... ఆ తర్వాత వాతావరణం అనుకూలిస్తే తుపాను ఏర్పడనుంది. ఒకవేళ తుపాను ఏర్పడితే అది ఏ దిశలో కదులుతుందన్నది అత్యంత కీలకం. ఒడిశా వైపు వెళ్తుందా, కోస్తాంధ్రపై ప్రభావం చూపుతుందా అనే విషయంలో స్పష్టత రావాలి.... ఒకవేళ ఏపీ తీరం వైపు వస్తే మాత్రం భారీ నుండి అతిభారీ వర్షాలు తప్పవు.
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారుతుందని అంచనా వేశారు. కానీ ఇది తీవ్ర వాయుగుండంగా మారినతర్వాత బలహీనపడింది... తుపానుగా మారలేదు. కానీ ఈ వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి. కాబట్టి అక్టోబర్ 15న తర్వాత తుపాను ఏర్పడితే ఈ సీజన్లో మొదటిది అవుతుంది.
కోస్తాంధ్రలో వర్షాలు
ఇదిలావుంటే ప్రస్తుతం కోస్తాంధ్రలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండి ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి 6 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులు, బలమైన గాలుల హెచ్చరికలను ఐఎండీ జారీ చేసింది. అక్టోబర్ 7 నుంచి 9 వరకు మాత్రం ప్రత్యేక హెచ్చరికలు లేవని తాజా బులెటిన్‌లో పేర్కొంది. అంటే అక్టోబర్ మొదటి వారంలో అక్కడక్కడ వర్షాలు కొనసాగుతుండగా, రెండో వారంలో బంగాళాఖాతంలో ఏర్పడే కొత్త వ్యవస్థ మరోసారి వర్షాల తీవ్రతను పెంచే అవకాశం ఉంది.
ఏపీలో లోటు వర్షపాతం ఎంతో తెలుసా?
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం... జూన్ 1 నుంచి అక్టోబర్ 2 వరకు ఏపీలో సగటు సాధారణ వర్షపాతం 599.3 మిల్లీమీటర్లు... అంటే ఇంత వర్షపాతం నమోదవ్వాలి. కానీ కేవలం 384.2 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35.9 శాతం లోటు కొనసాగుతోంది.
ఉత్తరాంధ్రలో ఇటీవల వర్షాలు కురవడంతో లోటు కొంత తగ్గినా.. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఇప్పటికీ లోటు కొనసాగుతోంది. . శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, కాకినాడ, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యింది. మరోవైపు అన్నమయ్య జిల్లాలో వర్షపాతం లోటు సుమారు 62.8 శాతంగా ఉంది. శ్రీ సత్యసాయి జిల్లాలో 57.8 శాతం, ప్రకాశం జిల్లాలో 60.6 శాతం, వైఎస్సార్ కడపలో 48.5 శాతం, నంద్యాలలో 44.7 శాతం లోటు నమోదైంది. మిగతా జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే ఉంది.
తెలంగాణలో అక్టోబర్ 6 నుంచి వర్షాలు?
తెలంగాణలో ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతోంది. అయితే అక్గోబర్ 6 అంటే వచ్చే మంగళవారం నుండి మళ్లీ వర్షాలు మొదలవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం , ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయట. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని హెచ్చరిస్తోంది... ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇక తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనాల ప్రకారం... అక్టోబర్ 3-12 మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో వర్షాల తీవ్రత పెరగనుంది. తుఫాన్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తుపాను లేకున్నా తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో జోరువానలు కురుస్తాయట.
అక్టోబర్ 13 నుండి 18 వరకు బంగాళాఖాతంలో అల్పపీడన వ్యవస్థకు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నాయి. దీనితో దక్షిణ భారతదేశంలో ఈశాన్య రుతుపవనాలు ఆరంభం అవుతుంది. అక్టోబర్ 13 నుండి 18 వరకు తెలంగాణలో వర్షపాత సరళిని అల్పపీడనం, వాయుగుండం నిర్ణయిస్తాయి. తుపాను ఏర్పడితే మాత్రం ఆంధ్రప్రదేశ్‌కు సమీపంలో ఉన్న ఆగ్నేయ తెలంగాణ జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది.
మొత్తంగా తుపాను వస్తుందా?
మొత్తంగా చూస్తే ఈ అక్టోబర్ 13 నాటికి అల్పపీడనం, అక్టోబర్ 15 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. కానీ ఇది ఆ తర్వాత తుపానుగా మారుతుందా లేదా అనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేం. అలాగే తుపానుగా మారినా దాని పయనం ఒడిశా వైపా, ఉత్తరాంధ్ర వైపా, మరేదైనా దిశలో ఉంటుందా అన్నది కూడా ప్రస్తుత దశలో స్పష్టంగా లేదు. కానీ ఒక్కవిషయం ఖాయం... అక్టోబర్ నెల మధ్యలో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా.

