- Home
- Andhra Pradesh
- Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్... రెండు రోజులపాటు ఆ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం.
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్... రెండు రోజులపాటు ఆ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా? అయితే అక్టోబర్ 4, 5 తేదీల్లో వెళ్లే భక్తులు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించి కీలక మార్పులు చేసింది. ఇంతకీ ఆ రెండు రోజుల్లో ఏం మారబోతోందంటే..

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 4, 5 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించి మార్పులు చేసింది.
వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
అక్టోబర్ 4, 2026న వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించి సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించదు. దీంతో ఆ రోజు సిఫార్సు లేఖల ద్వారా వీఐపీ బ్రేక్ దర్శనం పొందే అవకాశం ఉండదు.
అలాగే అక్టోబర్ 5, 2026న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని పూర్తిగా రద్దు చేశారు. అయితే ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వీఐపీలకు మాత్రం ఈ నిర్ణయం వర్తించదు.
తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ
భారీగా భక్తుల రద్దీ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దర్శనానికి వచ్చే భక్తులు ఈ మార్పులను ముందుగానే గమనించాలని టీటీడీ సూచించింది. భక్తులు తమ తిరుమల పర్యటనను అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని కోరింది.
ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ప్రస్తుతం సర్వదర్శనానికి 30 నుంచి 35 గంటలకు పైగా సమయం పడుతోంది. దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి రావడంతో ముందుగానే అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు.
చిన్న పిల్లలు, వృద్ధులు జాగ్రత్త: టీటీడీ
ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులతో కలిసి తిరుమలకు వచ్చే వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ సమయం క్యూలైన్లలో ఉండాల్సి రావచ్చు కాబట్టి అవసరమైన మందులు వెంట తీసుకెళ్లడం మంచిది. అలాగే తాగునీటిని అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. భారీ రద్దీ నేపథ్యంలో తిరుమల పర్యటనకు వచ్చే భక్తులు పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాన్ని, దర్శన సమయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవాలి.
అయితే గత నాలుగు రోజుల్లో భక్తుల సంఖ్య చూసుకున్నట్లైతే..సెప్టెంబర్ 28- 84,171..సెప్టెంబర్ 29- 77,082..సెప్టెంబర్ 30- 78,723..అక్టోబర్ 1- 78,026 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

