సాధారణంగా వర్షాకాలంలో పచ్చళ్లు త్వరగా పాడైపోతుంటాయి. అప్పుడు వాటిని పారేయడం తప్పా.. మరో మార్గం ఉండదు. అలా పచ్చళ్లు పాడుకాకుండా ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.  

 

సాధారణంగా మనం ఇంట్లో టమాటా, ఉసిరి, మామిడి, నిమ్మ లాంటి చాలా రకాల నిల్వ పచ్చళ్లను పెడుతూ ఉంటాం. వేడి వేడి అన్నంలో పచ్చడి, కాస్త నెయ్యి వేసుకొని తింటే ఆ రుచే వేరు. కూరలు లేని టైంలో కూడా పచ్చళ్లు ఉపయోగపడతాయి. అయితే పచ్చళ్లు కొన్ని సార్లు త్వరగా పాడైపోతుంటాయి. వర్షాకాలంలో అయితే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాస్త తేమ తగిలితే చాలు పచ్చడి చెడిపోయే ప్రమాదం ఉంటుంది. మరి వర్షాకాలంలో పచ్చళ్లు చెడిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

పచ్చళ్లు చెడిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ప్లాస్టిక్ బాక్సులు

చాలామంది పచ్చళ్లను ప్లాస్టిక్ బాక్సుల్లో నిల్వ చేస్తుంటారు. కానీ పచ్చళ్లను ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ చేయడం మంచిది కాదు. వాటి రంగు, వాసన పచ్చడితో కలిసిపోతాయి. దీనివల్ల పచ్చడి చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గాజు సీసాల్లో పచ్చళ్లను నిల్వచేయడం మంచిది. గాజు సీసాను శుభ్రం చేసి.. బాగా ఆరబెట్టాక అందులో పచ్చడి నిల్వ చేయాలి. దీనివల్ల పచ్చళ్లు ఎక్కువకాలం నిల్వ ఉంటాయి.

సరిపడా ఉప్పు, నూనె

పచ్చళ్లలో నూనె, ఉప్పు సరైన మోతాదులో వేస్తే.. చాలా కాలం నిల్వ ఉంటాయి. కాబట్టి పచ్చడిలో నూనె, ఉప్పు వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

తేమ ప్రదేశంలో..

పచ్చళ్లని తేమ ఉన్న చోట పెట్టకూడదు. దానివల్ల త్వరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చళ్లను కిటికీలు, తలుపుల దగ్గర పెట్టకండి. అలా అని ఎండ ఉన్న ప్రదేశంలో కూడా పెట్టకూడదు.

తడి చేతులతో...

తడి చేతులతో పచ్చడిని ముట్టుకోకూడదు. స్పూన్ తో తీసుకోవడం మంచిది. స్పూన్ ని వాడేముందు తేమ లేకుండా చూసుకోవాలి. పచ్చడి తీసుకున్న తర్వాత స్పూన్ ని అందులో వదిలేయకూడదు. దీనివల్ల కూడా పచ్చడి చెడిపోయే అవకాశం ఉంటుంది.

తరచు మూత తీయకూడదు 

ఎక్కువ మొత్తంలో పచ్చళ్లను పెట్టినప్పుడు తరచుగా జాడీ లేదా సీసా మూతను తీయకూడదు. 10 రోజులకు సరిపడా పచ్చడిని ఒకేసారి సీసా నుంచి తీసుకొని మరో చిన్న డబ్బాలో పెట్టి వాడుకోవడం మంచిది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వర్షాకాలంలోనూ పచ్చడి చెడిపోకుండా ఉంటుంది.