Jasmine storage tips: మల్లెపూలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా చేయండి!
మల్లెపూల వాసన ఎవరికి నచ్చదు చెప్పండి. అవి ఎక్కుడుంటే అక్కడ సువాసన వెదజల్లుతుంటాయి. చాలామంది ఆడవాళ్లు మల్లెపూలను ఇష్టంగా జడలో పెట్టుకుంటారు. అవి వారి అందాన్ని రెట్టింపు చేస్తాయి. సాధారణంగా మల్లెపూలు ఒక్క రోజులోనే వాడిపోతుంటాయి. కానీ వారం రోజులైనా వాడిపోకుండా తాజాగా ఎలా ఉంచాలో ఇక్కడ తెలుసుకుందాం.

మనలో చాలామంది మల్లెపూలను కొన్న తర్వాత ఫ్రిజ్‌లో నిల్వ చేస్తారు. కానీ ఫ్రిజ్‌లో ఉంచినా పూలు రెండు రోజుల్లోనే వాడిపోతాయి లేదా కుళ్లిపోవడం స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని చిట్కాలతో పూలను వారంపాటు నిల్వ ఉంచవచ్చు. అదెలాగో ఇక్కడ చూద్దాం.
అరటి ఆకులో..
ముందుగా కోసిన పూలను అందంగా చుట్టి, అరటి ఆకులో ఉంచి గట్టిగా మడవండి. అరటి ఆకులో పూలను మడవడంలో ఒత్తిడి చేయకుండా తేలికగా ప్యాక్ చేయాలి. తర్వాత దాన్ని ఒక పాత్రలో ఉంచి గాలి చొరబడకుండా మూసివేసి ఫ్రిజ్‌లో నిల్వ చేయండి. ఇలా చేస్తే మల్లెపూలు వారం వరకు వాడకుండా ఉంటాయి.
టిష్యూ పేపర్ లో..
అరటి ఆకు లేకపోతే, పూలను తెల్ల కాగితం లేదా టిష్యూ పేపర్‌లో ఉంచి నెమ్మదిగా చుట్టాలి. కాటన్ బట్టలో కూడా పూలను ఉంచవచ్చు. పూలను చుట్టే ముందు కాటన్ బట్టను తడిపాలి. తర్వాత గాలి చొరబడని డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మల్లెపూలు ఎక్కువ కాలం వాడకుండా తాజాగా ఉంటాయి.
ఫ్రిజ్ లేకపోతే..
ఇంట్లో ఫ్రిజ్ లేకపోతే ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి దానిపై అరటి ఆకును పెట్టండి. తర్వాత కోసిన మల్లె పూలను దానిపై ఉంచండి. తర్వాత కాటన్ బట్టను తడిపి పూలపై వేయండి. పాత్రను మూసివేసి దానిపై ప్లేటు ఉంచితే పూలు ఒక వారం వరకు వాడకుండా తాజాగా ఉంటాయి. అరటి ఆకు లోపలికి నీరు వెళ్లకుండా చూసుకోవాలి.
కాటన్ క్లాత్ తో ఇలా చేయండి..
ఇంట్లో ఫ్రిజ్ లేకపోతే ముందుగా పూలను దండగా కట్టుకోండి. తర్వాత వాటిలోని తేమ పోయే వరకు వేచి ఉండండి. ఆ తర్వాత కాటన్ బట్టలో చుట్టి గాలి చొరబడని డబ్బాలో ఉంచితే పూలు ఫ్రెష్‌గా ఉంటాయి.
ఇది గుర్తుంచుకోండి!
కాటన్ బట్టను ఉపయోగించేటప్పుడు అది ఎండిపోతే మళ్ళీ తడి చేయడం మర్చిపోవద్దు. ఈ చిట్కాలతో ఫ్రిజ్ లేకపోయినా మల్లెపూలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచవచ్చు.