గుడ్డు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలుసు. రోజుకో గుడ్డు తినమని డాక్టర్లు చెబుతుంటారు. అయితే రోజుకో గుడ్డు తినడం వల్ల కలిగే లాభాలు, శరీరంలో జరిగే మార్పుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతుంటారు. కొందరు రోజుకు 2 నుంచి 3 గుడ్లు కూడా తింటారు. గుడ్డులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఉడికించిన గుడ్లు తినడం వల్ల కలిగే లాభాలు, కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
గుడ్డులోని పోషకాలు:
ఒక పెద్ద ఉడికించిన గుడ్డులో దాదాపు 77 కేలరీలు ఉంటాయి. ఇందులో విటమిన్ A, B5, B12, D, E, K, B6, ఫోలేట్, ఫాస్ఫరస్, సెలీనియం, కాల్షియం, జింక్, 6 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
ప్రోటీన్:
గుడ్లు.. ప్రోటీన్ కి మంచి వనరు. శరీరానికి కావాల్సిన తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలు గుడ్డులో ఉంటాయి. ఇవి కండరాల బలోపేతానికి తోడ్పడుతాయి. ఒక ఉడికించిన గుడ్డులో దాదాపు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కడుపు నిండిన భావన కలిగించి, బరువు నియంత్రణకు సహాయపడుతుంది.
మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది:
గుడ్లల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా.. ఇవి రక్తంలో మంచి కొలెస్ట్రాల్ అయిన HDL ని పెంచుతాయి. చాలామందిలో.. ఆహారంలోని కొలెస్ట్రాల్, రక్తంలోని కొలెస్ట్రాల్‌ను ప్రతికూలంగా ప్రభావితం చేయదని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి.
మెదడు ఆరోగ్యానికి:
గుడ్లల్లో కోలిన్ అనే ముఖ్యమైన పోషకం ఉంటుంది. కోలిన్ మెదడు కణాల పెరుగుదలకు, మెదడులో సంకేతాలను ఉత్పత్తి చేసే అణువులను తయారు చేయడానికి సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి, మానసిక స్థితి, కండరాల నియంత్రణకు కోలిన్ అవసరం. గర్భిణులకు కోలిన్ చాలా ముఖ్యం. ఇది కడుపులోని బిడ్డ మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది.
కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
గుడ్డులోని పచ్చసొనలో లూటీన్, జియాక్సంతిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వయసు పెరిగే కొద్దీ వచ్చే కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా గుడ్డులోని విటమిన్ A కంటి ఆరోగ్యానికి చాలా అవసరం.
ఎముకల ఆరోగ్యానికి మంచిది:
గుడ్డులోని పచ్చసొనలో విటమిన్ D సహజంగానే ఉంటుంది. విటమిన్ D కాల్షియం శోషణకు అవసరం. ఇది ఎముకలు, దంతాల బలోపేతానికి సహాయపడుతుంది. విటమిన్ D లోపం ఎముకలను బలహీనపరుస్తుంది. రోజూ గుడ్డు తినడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
గుడ్లలో విటమిన్ A, విటమిన్ B12, సెలీనియం వంటి పోషకాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
బరువు నియంత్రణ:
గుడ్లు తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటాయి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఉడికించిన గుడ్లు తింటే ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఇది అతిగా తినడాన్ని, బరువు పెరగడాన్ని నియంత్రిస్తుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యానికి:
గుడ్లలోని విటమిన్ B2, B5, B12, మెథియోనిన్ వంటి అమైనో ఆమ్లాలు ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోళ్లకు అవసరం.
ఇవి గుర్తుంచుకోండి:
- గుడ్డును ఎక్కువ సేపు ఉడికిస్తే.. దానిలోని కొన్ని పోషకాలు తగ్గిపోవచ్చు. కాబట్టి తక్కువ మంట మీద ఉడికించి తినడం మంచిది.
- చాలా మందికి.. రోజూ ఒక గుడ్డు తినడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ప్రభావితం కావు. అయితే ఇప్పటికే ఎక్కువ కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బులు ఉన్నవారు రోజుకో గుడ్డు లేదా కొన్నిసార్లు తెల్లసొన మాత్రమే తినడం మంచిది.
- కొంతమందికి గుడ్డు అలెర్జీ ఉంటుంది. అలాంటివారు గుడ్డు తినడం మానేయాలి.
- సరిగ్గా ఉడకని గుడ్లలో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉండే ప్రమాదం ఉంది. కాబట్టి గుడ్లను పూర్తిగా ఉడికించి తినడం మంచిది.
- ఉడికించిన గుడ్లు చాలా మంచి పోషకాలు కలిగిన ఆహారం. ఇవి ఆరోగ్యానికి చాలా లాభాలు చేకూరుస్తాయి. ఆరోగ్యవంతులు రోజూ ఒక గుడ్డును తినచ్చు. అయితే ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.